Saturday, December 21, 2024

సార్వత్రిక ఎన్నికలకు సర్వత్రా కసరత్తు

  • ప్రతిపక్ష కూటమికి దీటుగా ఎన్ డీఏ ప్రదర్శన
  • 38కీ, 26కీ మద్య పోటీ ఎట్లా ఉండబోతోంది?

సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడేకొద్దీ రాజకీయ పార్టీలు చేసే వన్నెచిన్నెలు మిన్నునంటుతున్నాయి. అభివృద్ధి పేరుతో అధికారపక్షం -ప్రజాస్వామ్యం అంటూ ప్రతిపక్షం రేపు అధికారంలోకి రావడం కోసం అన్ని ఆటలు మొదలుపెట్టాయి. గెలుపుఓటముల తర్వాత వాటాలు ఎలా ఉంటాయో తెలియదు కానీ కూటములు కడుతున్నాయి, మాటలు కోటలు దాటుతున్నాయి. గెలుపు సంబరంలో వున్న కాంగ్రెస్  బెంగళూరును అడ్డాగా మార్చుకుంది. మోదీ మీద కోపమున్న విపక్షాలన్నీ జై అంటూ సై అంటూ వెంట నడిచాయి. విపక్షాలకు పోటీగా అధికారపక్షం దేశరాజధానిలో బలప్రదర్శన చేసే ప్రయత్నం చేసింది. సుమారు 90లోక్ సభ స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కొన్ని తటస్థ పార్టీలు ఈ రెండు కూటముల సమావేశాలకు దూరంగా ఉన్నాయి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే అధికారంలో ఉన్న వైసీపీ, బీఆర్ ఎస్ తమ మానాన తాను దూరంగా ఉన్నాయి. ఇందులో బీఆర్ ఎస్ – బిజెపి బంధం ఒక మాయ. వైసీపీ మొదటి నుంచీ నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని బిజెపికి మద్దతు పలుకుతూనే వుంది. ఒకప్పటి టీ ఆర్ ఎస్ కూడా కొంతకాలం మోదీకి వంత పాడింది. ఆ తర్వాత వ్యూహం మార్చుకుంది. టీ ఆర్ ఎస్ ను బీ ఆర్ ఎస్ గా మలిచిన కెసిఆర్ ఇటు బిజెపికి -అటు కాంగ్రెస్ కు మేం దూరమని చెబుతున్నారు. కానీ అదే మాట మీద నిలబడతారని ఎవరు గ్యారంటీ ఇవ్వగలరు?

ఎన్ డీ ఏ భాగస్వామ్య పక్షాల నేతల సమావేశం

Also read: శ్రీరమణ పెన్నుమూశారు

బీఆర్ఎస్ వైఖరీ ఇప్పుడే వెల్లడి కాదు

ఆంధ్రప్రదేశ్ కంటే ముందుగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి. వాటి ఫలితాలు, తర్వాత వచ్చే లోక్ సభ ఫలితాలు బట్టి కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ ఎస్ అడుగులు ఉంటాయని అంచనా వేయవచ్చు. జగన్ మాత్రం మోదీ వైపే ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. బిజెపి మిత్ర పక్షాలు ‘ఎన్డీఏ’ గానే ఉన్నాయి. కాంగ్రెస్, మిగిలిన విపక్షాలు తమ కూటమికి ‘ఇండియా’ అనే సంచలనాత్మకమైన పేరు పెట్టుకున్నారు. రేపటి ఎన్నికల్లో సంచలన విజయాలను నమోదు చేసుకుంటారో లేదో కానీ, రెండో సమావేశంతోనే సంచలనం సృష్టించారు. మోదీ హవాలో మాకు తిరుగులేదనుకున్న బిజెపి తన బలగాన్ని పెంచుకోవాల్సిన పరిస్థితిలోకి, బలాన్ని చూపించాల్సిన స్థితిలోకి వచ్చింది. రెండు కూటములలోనూ కొన్ని వైఫల్యాలు లేకపోలేదు. బెంగళూరులో సమావేశం ముగిసీముగియక ముందే నితీశ్ కుమార్, లాలుప్రసాద్ యాదవ్ మీడియా సమావేశానికి డుమ్మా కొట్టారు. అధికారంపైనా, ప్రధానమంత్రి పదవి పైనా తమకు ఆసక్తి లేదని ప్రకటించడంలోనే వ్యూహం దాగివుంది. విపక్షాల మధ్య ఐక్యత కుదరడానికి, తన పరపతి పెరగడానికి కాంగ్రెస్ ఈ మంత్రాన్ని ప్రయోగించింది. రేపటి ఎన్నికల్లో ఫలితాలను బట్టి ఆ సంగతి చూసుకుందాములే అని కాంగ్రెస్ చేస్తున్న ఆలోచనలు బహిరంగ రహస్యాలు.

Also read: ఐటీ భవితవ్యం ఏమిటి?

నితీశ్ అలిగారా?

ప్రధాని పదవి ఆశావహుల్లో నితీశ్ ప్రధానంగా ఉన్నారు. మీడియా సమావేశానికి ఎగ్గొట్టడం వెనకాల ఆయన లెక్కలు ఆయనకు ఉన్నాయి. ఏదైనా తేడా వస్తే, మళ్ళీ ఎన్డీఏ కూటమిలోకి నిస్సుగ్గుగా చేరిపోతారు. వాళ్ళు చేర్చుకుంటారు. లాలూ ప్రసాద్ కు తన లెక్కలు తనకున్నాయి. నిజం చెప్పాలంటే ఈ కూటమిలో కలవడం ఆప్ అధినేత కేజ్రీవాల్ కు ఇష్టం లేదు. కలుపుకోవడం కాంగ్రెస్ కు ఇష్టం లేదు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని సోనియాగాంధీ ఆశ. మిగిలినవన్నీ నాటకంలో భాగం. సరే! రాహుల్ లోక్ సభ అభ్యర్థిత్వం, ఎన్నికల్లో అర్హత, అనర్హత అంశాలు న్యాయస్థానం పరిధిలో ఉన్నాయి. అవి తేలడం కీలకం. ‘ఇండియా’ అనే పేరు వివాదాస్పదంగా ఉందని ఇప్పటికే అధికార బిజెపి పక్షం కారాలుమిరియాలు నూరుతోంది. బిజెపి మద్దతుదార్లు కోర్టుల దృష్టికి తీసుకెళ్లే పనిలో పడిపోయారు. ఇంతకూ 2024 సార్వత్రిక ఎన్నికల దాకా ఈ విపక్షాలన్నీ కలిసుంటాయా? అంటే ఔను అని గట్టిగా చెప్పలేం. ఎప్పుడైనా గుర్రం ఎగరవచ్చు. ఇక అధికార ఎన్డీఏ పక్షంలో 38 పార్టీలు ఉన్నాయని చెప్పుకుంటున్నా, అందులో బిజెపి తప్ప బలమైన పార్టీలు పెద్దగా ఏమీలేవు. ఆంధ్రప్రదేశ్ లో కాస్త బలమైన పార్టీ తెలుగుదేశం. ఎన్డీఏ లో తిరిగి కలవాలని చంద్రబాబు నానా తిప్పలు పడుతున్నారని వింటున్నాం. మొన్నామధ్య బిజెపి అగ్రనేత అమిత్ షాను, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను చంద్రబాబు కలిసి కూడా వచ్చారు. చాలా తఫాలు చంద్రబాబు జైమోదీ అనడం మనం వింటూనే ఉన్నాం.

బెంగళూరులో ఇండియా కూటమి సమావేశం

Also read: అదృష్టవంతుడు

సత్తా చాటడం అందరికీ అవసరం

బిజెపి -జనసేన -టీడీపీ కలిస్తే బాగుంటుందనే ఆలోచనలో ఎన్డీఏ భాగస్వామిగా చెప్పుకొనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఉన్నారు. బలప్రదర్శన కోసం చిన్నాచితకా పార్టీలన్నింటినీ కలుపుకుంటున్న బిజెపి పెద్దలు చంద్రబాబును ఎందుకు దూరంగా పెట్టారో తెలియడం లేదు. బాబుపై మోదీకి కోపం ఇంకా తగ్గలేదా? ఇంకా ఏదైనా వ్యూహం వుందా తెలియాల్సివుంది. నిజానికి జగన్, కేసీఆర్, మోదీకి బాబు ఉమ్మడి శత్రువు. పైపెచ్చు, జగన్ తో మోదీకి ఎటువంటి ఇబ్బంది లేకపోగా, అవసరం కూడా వుంది. ఒకవేళ రేపు బిజెపి ఫలితాలు తగ్గితే, జగన్ తన వైసీపీ సభ్యులను అండగా నిలబెడతారనే విశ్వాసం జగన్ పై మోదీకి వుంది. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ లో గెలిచినంత మాత్రాన కాంగ్రెస్ వెలిగిపోతోందని కాదు. కర్ణాటకలో బిజెపికి సీట్లు తగ్గినా ఓట్లు తగ్గలేదు. మధ్యప్రదేశ్, తెలంగాణలో మాదే అధికారమనే ధీమాలో కాంగ్రెస్ వుంది. అంతర్గత కుమ్ములాటలకు నెలవైన కాంగ్రెస్ గెలవడం అంత తేలిక కాదు. మోదీ పదేళ్ల పాలనపై ప్రజలకు మొహం మొత్తితే తప్ప, విపక్షాలకు రేపటి గెలుపుకు తావులేదు. సంవత్సరంలోపే సార్వత్రిక ఎన్నికలు వున్న నేపథ్యంలో అధికార పక్షం ప్రజావిశ్వాసాన్ని పోగొట్టుకోకుండా చూసుకోవడం కీలకం. విపక్షాలు ఐక్యతను నిలబెట్టుకోవడం, మరిన్ని పక్షాలను రాబట్టుకోవడం, తమపై ప్రజల్లో నమ్మకాన్ని కలిగించుకోవడం అంతే కీలకం. ఈలోపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చూపించుకోవడం అందరికీ అవసరం. ఇండియానా? ఎన్డీఏనా? ఎన్నికల వెండితెరపై చూద్దాం.

Also read: కొమర్రాజుకు కోటి దండాలు

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles