గాంధీయే మార్గం- 26
ఆ ముగ్గురు గాంధీజీకి హార్ట్, హ్యాండ్, హెడ్ అని ఒక అజ్ఞాత వ్యక్తి 1950ల్లో రాజాజీకి ఉత్తరం రాశారట. చారిత్రక కోణాల పరిశోధకులు రామచంద్ర గుహ తన పరిశోధనలో భాగంగా నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీలో కొన్ని సంవత్సరాల క్రితం ఆ ఉత్తరాన్ని చూశారు. గాంధీజీ హృదయానికీ, కార్యాచరణకు, ఆలోచనలకు ప్రతీకలుగా జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, రాజగోపాలాచారి గార్లను ఆ ఉత్తరంలో పేర్కొన్నారు.
Also read: శ్రమజీవిగా బహురూపి
సిసలైన గాంధేయులు 12 మంది
125 సంవత్సరాలు జీవించాలనే తలంపును గాంధీజీ వ్యక్తీకరించినా 80 సంవత్సరం నిండకుండానే 1948 జనవరి 30న తుపాకి గుండ్లకు నేలకొరిగారు. ఈ ఆకస్మిక పరిణామానికి, అప్పుడే స్వాతంత్య్రం గడించిన దేశం ఎలా స్థిరపడుతుందోనని ఎంతోమంది ఆందోళన పడేవారు. అలాంటి ఆలోచనల నుంచి ఈ సూత్రీకరణ మొదలై ఉండవచ్చు. ఈ సమాచారంతో గాంధీజీ 150వ జయంతి సంవత్సరం ముగింపువేళ ‘హిందూస్థాన్ టైమ్స్’లో సిసలైన గాంధేయులుగా – నెహ్రూ, పటేల్, రాజేంద్ర ప్రసాద్, అబుల్ కలాం అజాద్, జె.బి.కృపలాని, రాజాజీ, కమాలాదేవి ఛటోపాధ్యాయ, మృదులా సారాభాయి, జయప్రకాష్ నారాయణ్, జె.సి.కుమారప్ప, మీరాబెన్, సరిహద్దు గాంధీ గా పిలువబడే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ – ఈ పన్నెండుమందినీ రామచంద్ర గుహ ఒక వ్యాసంలో ప్రస్తావిస్తూ తమ జీవితాంతం గాంధీజీతో, గాంధీజీ ఆదర్శాలతో సాగిన వారని తెలియచేశారు.
నెహ్రూ, పటేల్ మధ్య సఖ్యత
నెహ్రూ, పటేల్ గార్లకు పడేది కాదనే రీతిలో ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి కానీ, వారి మధ్య సఖ్యత ఉంది కనుకనే తొలినాళ్ళలో మనదేశపు స్వాతంత్య్రం సవ్యంగా సాగిందని గుహ అంటూ ఒక విషయం ప్రస్తావిస్తారు – వారిద్దరి మధ్య నడిచిన ఉత్తరాల గురించి పేర్కొంటూ! గాంధీజీ గతించగానే నెహ్రూ ఉత్తరంలో పటేల్‌తో అన్నదేమిటంటే – ‘‘బాపు కనుమరుగయ్యాక అంతా మారిపోయింది. ఇప్పుడు క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. పాత విబేధాలను పక్కన బెట్టి మనందరం మరింత సఖ్యతతో పనిచెయ్యాల్సి ఉంది’’ అని. దానికి పటేల్ జవాబు ఇలా సాగింది – ‘‘…హృదయంలోని భావనను చక్కగా చెప్పారు. నిజానికి కొన్ని విషయాలు నచ్చడం లేదు. బాధ్యతల నుంచి తప్పించమని బాపుకు ఉత్తరం కూడా రాశాను. అయితే, ఇంతలో ఆయన అంతర్ధానం కావడంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఈ సంక్షోభం మనల్ని పూర్తిగా కమ్మివేయకముందే మనం కళ్ళు తెరచి కలసి సాగితే ఏమి సాధించగలమో బోధపడుతుంది. ఈ బాధా తప్త సమయంలో సంఘటితంగా సాగాలి…’’ అని!
నిజానికి ఆ సమయంలో దేశాన్ని కరువు, ద్రవ్యనిల్వల లోటు, మతతత్వం, వైషమ్యాలు పీడిస్తున్నాయి. నెహ్రూ, పటేల్, అంబేద్కర్ కలసి పనిచేయడం వల్లనే ఈ మాత్రమైనా దేశం పురోగమించిందని రామచంద్ర గుహ అంటారు.
నెహ్రూ, పటేల్ చివరి దాకా ప్రభుత్వంలో కొనసాగి దేశానికి దిశానిర్దేశనం చేశారు.
రాజేంద్ర ప్రసాద్, మౌలానా అబుల్ కలాం ఆజాద్
వీరిద్దరిలాగే మహాత్మునికి అత్యంత సన్నిహితులైనవారు బాబూ రాజేంద్రప్రసాద్, మౌలానా అబుల్ కలాం ఆజాద్. గాంధీజీ మనదేశంలో పాల్గొన్న తొలి ఉద్యమపు రంగస్థలం చంపారన్‌లో పరిచయమైన బీహారీ లాయర్ రాజేంద్రప్రసాద్ తర్వాత గాంధీకి అత్యంత ఆప్తులుగా మారారు. రాజ్యాంగ రచనలోనే కాక రాజ్యాంగపరిషత్తు(కాన్స్టిట్యుయెంట్ అసెంబ్లీ)కి అధ్యక్షుడిగా, భారత దేశపు తొలి రాష్ట్రపతిగా గాంభీర్యం, విలువల కలబోతకు ప్రతీకగా నిలిచారు. గాంధీజీ ముస్లిం మిత్రులలో అతి ముఖ్యుడు అబుల్ కలాం ఆజాద్. అజాద్‌ను దేశ విభజన చాలా బాధించింది. తొలి విద్యాశాఖా మంత్రిగా విశ్వవిద్యాలయాల స్థాపన, విస్తరణలతో పాటు సాహిత్యం, సంగీతం, నృత్యాలకు సంబంధించి అకాడమీలు ఏర్పడడానికి అజాద్ ఎనలేని కృషిచేశారు.
ఆచార్య కృపలానీ
పటేల్, రాజాజీ, నెహ్రూ, రాజేంద్రప్రసాద్ గార్ల కన్న గాంధీజీకి ముందు జె.బి.కృపలాని పరిచయమయ్యారు. 1915లో గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి రాగానే శాంతినికేతన్‌లో కృపలానీని కలిశారు. చంపారన్ ఉద్యమంలో గాంధీజీతో కలసి పనిచేశారు. నెహ్రూ, పటేల్, కృపలానీ కలిసి చాలా ఏళ్ళు కారాగారాల్లో ఉన్నారు. స్వాతంత్య్రం రాకముందు కాంగ్రెస్ పార్టీలో కృపలానీ చాలా కీలకస్థానంలో కూడా బాధ్యతలు నిర్వహించారు. అయితే, స్వాతంత్య్రం రాగానే కాంగ్రెస్ పార్టీని వీడిన కృపలానీ పలుసార్లు నెహ్రూతో విబేధించడమే కాక, రక్షణ శాఖామాత్యులుగా వి.కె.కృష్ణమీనన్ వైఫల్యాలను ఎన్నోసార్లు ఎండగట్టారు. ఇలాంటి మరో విలక్షణమైన వ్యక్తి – చక్రవర్తుల రాజగోపాలాచారి. గాంధీజీ కుమారుడు దేవదాస్‌కు తన కుమార్తె లక్ష్మితో వివాహం జరిపించి వియ్యంకుడు కూడా అయ్యారు. అలాగే చివరి వైస్రాయ్‌గా, తొలి గవర్నర్ జనరల్‌గా దేశానికి నాయకత్వం వహించారు. ఒకే పార్టీ ఉండటం దేశానికి ఆరోగ్యం కాదని 1956లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు. తర్వాత మరో మూడేళ్ళకు స్వతంత్ర పార్టీని స్థాపించారు. ఉదార విలువలుండాలని, ఆర్థిక పరమైన వెసులుబాట్లు ఉండాలని గాంధీవాదం వినిపించినవారు రాజాజీ.
Also read: గాంధీ సినిమా అజ్ఞాత తపస్వి మోతీలాల్ కొఠారీ
కమలాదేవి ఛటోపాధ్యాయ
కమలాదేవి ఛటోపాధ్యాయ, మృదులా సారాభాయి – ఈ ఇద్దరూ విలక్షణమైన మహిళామూర్తులు. ఎన్నో ప్రతిబంధకాలతో పోరాడి గెలిచిన మహిళ కమలాదేవి తొలుత కొన్ని సినిమాలలో కూడా నటించారు. సరోజినీ నాయుడు తమ్ముడు హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయని ప్రేమించి, పెళ్ళాడి, పిమ్మట విడిపోయారు. గాంధీజీతో పట్టుబట్టి ఉద్యమంలో మహిళలకు స్థానం సాధించిన ధీర-కమల. ప్రధానిగా నెహ్రూ కేబినెట్‌లోకి ఆహ్వానించినా, కమలాదేవి పార్టీలకు అతీతంగా సేవారంగంలో ఉండిపోయారు. కాందిశీకుల పునరావాసానికి తొలుత కృషి చేసి, పిమ్మట హస్తకళలకు సంబంధించి ఎంతో సేవ చేశారు. ఎంతో దీక్షగా కృషి చేసి, ఎంతోమందిని తయారు చేసి తను మాత్రం సాధ్యమైనంత తెరమరుగున ఉండిపోయిన వ్యక్తి కమలాదేవి దేవి ఛటోపాధ్యాయ.
మృదులా సారాభాయి
గాంధీజీకి అత్యంత సన్నిహితులయిన సారాబాయి కుటుంబపు వ్యక్తి, అనసూయ సారాభాయి మేనకోడలు, శాస్త్రవేత్త విక్రం సారాభాయి అక్కయ్య – మృదులా సారాభాయి! పౌర సమాజ కార్యక్రమాలలో చురుకుగా ఉండి, దేశ విభజన సమయంలో అపహరణకు గురైన ఎంతోమందిని స్త్రీలను విజయవంతంగా వారి కుటుంబాలకు తీసుకువచ్చిన యోధ మృదుల. కశ్మీరీ ప్రజల హక్కులకోసం కూడా పోరాడిన మృదుల తొలుత బ్రిటిష్ వారి హయాంలోనూ, తర్వాత స్వతంత్ర దేశంలో కూడా జైలుపాలయ్యారు.
Also read: మానవ లోకానికే ధ్రువతార
నిప్పులు చెరిగిన సోషలిస్టు జేపీ తన భార్య ప్రభావతి కారణంగా గాంధీజీకి సన్నిహితమైన జయప్రకాష్ నారాయణ్ మొదట్లో విమర్శించేవారు. నిప్పులు చెరిగే సోషలిస్టు అయిన జయప్రకాష్ నారాయణ్, గాంధీజీ కనుమూసిన తర్వాత ఆయన గాంధీపథానికి చేరువైన వారు. కశ్మీరు, నాగాలాండ్ ప్రజలను దేశంతో కలపడానికి ఎంతో కృషి చేసిన జయప్రకాష్ తర్వాతి దశలో ఇందిరాగాంధీ అత్యయిక పరిస్థితికి ఎదురొడ్డి పోరాడిన ధైర్యశాలి, త్యాగశీలి జయప్రకాష్ నారాయణ్.
కుమారప్ప, మీరాబెన్
జె.సి. కుమారప్ప, మీరాబెన్ మనదేశంలో పర్యావరణం కోసం పోరాడిన తొలి యోధులు. కుమారప్ప దక్షిణాదికి చెందిన దళిత క్రిస్టియన్ కాగా, మీరాబెన్‌గా ప్రసిద్ధులయిన మేడలిన్ స్లేడ్ ఇంగ్లాండు వనిత. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కుమారప్ప మధురై దగ్గర తన గ్రామంలో స్థిరపడి ఆర్థికశాస్త్రంలో గొప్ప కృషి చేయగా, మీరాబెన్ హిమాలయాల పాదాల దగ్గర గ్రామీణాభివృద్ధికి పాటుపడ్డారు. గ్రామీణ వికాసం, నీటి పొదుపు, సేంద్రియ వ్యవసాయం, అడవుల సంరక్షణ వంటి విషయాల మీద కృషి చేసిన కుమారప్ప గాంధీజీ ఆర్థిక శాస్త్రానికి సైద్ధాంతిక ప్రతీక. గాంధీజీ – కుమారప్ప గార్ల ఆలోచనలను ఇ.ఎఫ్.షూమేకర్ ‘స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్’ అనే పుస్తకంలో వివరించారు. భారీ డ్యాములను, ఒకేరకం అడవులను, ఆధునిక మనిషి అత్యాశను ఖండిరచిన మీరాబెన్ ఎన్నోసార్లు మనిషి ప్రకృతికి దూరంగా పోవడం వివేకం కాదని వాదించారు.
Also read: అసలైన విప్లవవాది.. సిసలైన సిద్ధాంతకర్త!
ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్
గాంధీజీ తర్వాత అత్యంత ధైర్యశాలిగా పిలువబడిన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ సత్యం, ప్రేమ, అహింసలతో పఠానుల కోసం పాకిస్తాన్ దేశంతోనూ, పాకిస్తాన్ సైన్యంతోనూ దశాబ్దాలు తరబడి పోరాడిన వ్యక్తి. మతపరమైన వైషమ్యాలను గట్టిగా ఖండిరచిన వారు ఈ ‘సరిహద్దు గాంధీ’.
అంబేడ్కర్, రామమనోహర్ లోహియా
గాంధీజీ ఆదర్శాలనూ, విధానాలను పాటించిన అత్యుత్తమ భారతీయులైన వీరిని గాంధీజీ అసలైన అనుయాయులుగా పేర్కొంటూ రామచంద్ర గుహ వారి గొప్పతనాన్ని సూక్ష్మంగా విశ్లేషించారు. ఈ సందర్భంలో అంబేద్కర్ గురించి ప్రస్తావిస్తూ గాంధీజీతో విబేధించారని, అయితే గాంధీజీ కోరిక మేర తొలి క్యాబినెట్‌లో న్యాయ శాఖా మంత్రి అయ్యారని గుహ రాశారు. రాజ్యాంగ రచనకు సంబంధించిన బృందానికి నాయకత్వం కొరకు వేరు వేరు వ్యక్తుల గురించి ప్రస్తావన చేసినపుడు అంబేద్కర్ పేరును ప్రతిపాదించిన వ్యక్తి గాంధీజీ. అలాగే రామచంద్ర గుహ పేర్కొనని వ్యక్తి రామమనోహర్ లోహియా. గాంధీజీని మానసిక పితగా భావించిన లోహియా గాంధీ భావనలలోని కీలకమైన అర్ధాన్ని ప్రయోజనకరమైన కోణాన్ని విశదం చేసిన వాడు. దండి సత్యాగ్రహం అంశం మీద పిహెచ్.డి. చేసిన మేధోశాలి లోహియా. గాంధీజీకి సిసలైన వ్యాఖ్యాత లోహియా!
నిజానికి ఈ పద్నాలుగుమంది మహనీయుల జీవన గమనాలు శోధిస్తే గాంధీజీ హృదయం మనకు బోధపడుతుంది.
Also read: సంభాషించడం… సంబాళించడం!
డాక్టర్ నాగసూరి వేణుగోపాల్,
ఆకాశవాణి పూర్వ సంచాలకులు, 9440732392