- కన్నీళ్లతో టీవీ రేటింగ్ పెంచుతున్న గృహిణులు
- బుల్లితెరకు ఆదాయం తెస్తున్న నటులు
- టి ఆర్ పి హృదయ స్పందనలతో నిర్మాతలకు డబ్బే డబ్బు
- సంసారాల్లో అలజడులు,తలబాదుకుంటున్న వీక్షకులు
బుల్లి తెరలో సంచలనం రేపుతున్న సీరియల్ కార్తీక దీపం. ఒక నల్ల రంగు చర్మం గల ఒక అమ్మాయి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆమె రంగు వల్ల వివాహ జీవితం విచ్చిన్నం అవుతుంది. కానీ తిరిగి భార్య భర్తలు కలుసుకోవాలని వీక్షకులు ఊపిరి బిగబట్టి చూస్తుంటారు. ఇందులో నటించిన హీరోహిన్ ప్రేమి విశ్వనాథ్ కు కాసుల వర్షం కురిసింది. సీరియల్ లో ఆమె పేరు దీప. 16 అక్టోబర్ 2016 నుంచి బుల్లి తెర ‘స్టార్ మా’ లో ప్రసార మవుతున్న ఈ సీరియల్ ఇంకా కొన సా…గుతోంది. ఈ సీరియల్ ను 22 నిమిషాలు వ్యవధి లో వీక్షకులు ఊపిరి బిగబట్టి చూస్తుంటారు. ఈ సీరియల్ వారం రోజుల్లో ఆరు రోజులు ప్రసారం అవుతుంది.
విపరీతంగా వాణిజ్య ప్రకటనలు
మొత్తం అరగంటలో ఎనమిది నిమిషాల ప్రసారానికి యాడ్స్ (వాణిజ్య ప్రకటనలు) విపరీతంగా వస్తున్నాయి. టిఆర్పీ రేటింగ్ లో ప్రథమ స్థానం ఆక్రమించిన ఈ సీరియల్ ను ఉత్కంఠ భరితంగా చూస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇలా ఒక్కటేమిటీ ‘బంగారు కోడలు,’ ‘రెండు రొళ్లు ఆరు,’ ‘బృందావనం,’ ‘బొమ్మరిల్లు,’ ‘నాగిని,’ ‘నందిని,’ ‘ఇలా కొడళ్ళు,’ అత్తల పేరు మీద వస్తున్న సీరియల్స్ జనరంజకంగా వీక్షకులను కట్టి పడేస్తున్నాయి. అలాగే పాత తెలుగు సినిమా పేర్లను వాడుకొని వివిధ తెలుగు ఛానళ్ల ల్లో ప్రసారం అవుతున్న ఈ సీరియల్స్ ద్వారా సమాజానికి ఏమి సందేశం ఇస్తున్నారు? బహుభార్యత్వాలు, వివాహేతర సంబంధాలు, విడాకులు, ఆకర్షణ, వికర్షణ…ఇవా ప్రేక్షకులు కోరుకుంటున్నవి?
Also Read : దయ్యం ఒక కాల్పనిక భ్రాంతి
నేరప్రవృత్తికి బీజాలు
కుటుంబంలో ఘర్షణ ధోరణి, విచ్చల విడితనం, నేరప్రవృత్తికి బీజం వేసే సీరియల్స్ కు ఇవ్వాళ్ళ వీక్షకులు ఎక్కువయ్యారు. “చూస్తున్నారు కాబట్టి తీస్తున్నాం’’ అని నిర్మాతలు ‘’తీస్తున్నారు కాబట్టి చూస్తున్నాం” అని వీక్షకులు నెపం ఒకరి పై ఒకరు వేసుకుంటున్నారు. ఈ సీరియల్ గొడవలో పడి పిల్లల హోమ్ వర్క్ చేయించని తల్లుల వల్ల పిల్లలు, టైం కు తిండి పెట్టని పెళ్లాల వల్ల మొగుళ్లు తలబాదుకుంటున్నారు. ఎక్కువగా మాట్లాడితే టీవీ నటీమణులు వారిపై పూని ఏమి అఘాయిత్యానికి పాల్పడుతారో అని ఇన్ని మంచి నీళ్ళు తాగి భార్య పక్కన కూర్చొని వారు కుడా టీవీ సీరియల్స్ కు అతుక్కుని పోతున్నారు.
Also Read : వంగర రూపు మారనుందా?
ఊహాజనిత ప్రపంచం
మధ్యాహ్నం, సాయంత్రం…టైం అంతా టీవీ కి అంటిపెట్టుకుపోతున్న గృహిణులు ఊహ జనిత ప్రపంచంలో విహరిస్తూ, రాత్రి బెడ్ రూంలో కూడా టీవీ పాత్రల పేరును కలవరిస్తూ నిద్ర లేమితో పాటు లేని రోగాలు తెచ్చుకుంటున్నారు. వంటింట్లో కూడా టీవీ చప్పుడు వినపడందే గిన్నెలు కూడా మాట వినడం లేదని వాపోయే శ్రీమతులు రోజు రోజుకు పెరుగుతున్నారు. ఒకనాటి “బునియాద్”, “పౌజి” లాంటి సందేశాత్మక సీరియల్స్ తీసే నిర్మాతలు ఇపుడు లేరు. అందమైన కాస్ట్యూమ్స్ వెంట్రుకలు విరబోసుకొని, వంటింట్లో చెప్పులు వేసుకుని తిరిగే కొడళ్ళు భారతీయ సంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చారని మొత్తుకుంటున్న అత్తలు కూడా టీవీ సీరియల్స్ కు ఎడిక్ట్ కావడం విధి వైపరీత్యం.
Also Read : పంచాయతీ వ్యవస్థలో మహిళా సాధికారిత పేరుకే! పురుషులదే పెత్తనం!
టీఆర్పీ అంటే ఏమిటీ?
టీవీ సీరియల్స్ ప్రజాదరణ ఎలా లెక్కిస్తారో చూద్దాం. టిఆర్పి పూర్తి రూపం ఏమిటో తెలుసుకుందాం. టిఆర్పి అంటే టెలివిజన్ రేటింగ్ పాయింట్. ఇది టెలివిజన్ ప్రోగ్రాం ప్రజాదరణను సూచించే సాధనం. ఏ టెలివిజన్ కార్యక్రమాన్ని ఎక్కువగా చూస్తారో నిర్ధారించడానికి ఇది ఉపయోగబడుతుంది. వీక్షకులు ఏ సీరియల్ ను ఎక్కువ సేపు చూస్తున్నారో కొలిచే ఎలక్ట్రానిక్ సాధనం! ఇది నిర్దిష్ట ప్రోగ్రామ్ ప్రజాదరణను చూపుతుంది. అధిక టీఆర్ పి ఉన్న ప్రోగ్రామ్ ను ఈ సాధనం కనిపెడుతుంది. పెద్ద సంఖ్యలో వీక్షకులు ఏ కార్యక్రమాన్ని చూస్తున్నారో ఈ సాధనం సూచిస్తుంది. దీని డేటా ప్రకటన దారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే, వారు అధిక టిఆర్‌పిలతో ప్రోగ్రామ్‌ల సమయంలో తమ ప్రకటనలను ఉంచుతారు. టీఆర్ పీని ఎలా లెక్కిస్తారో చుద్దాం. టీఆర్ పీ లెక్కింపు ప్రాంతంలో పనిచేస్తున్న ఏకైక ఏజెన్సీ INTAM (ఇండియన్ టెలివిజన్ ఆడియన్స్ మెజర్మెంట్). ఇది రెండు పద్ధతులపై పనిచేస్తుంది. ఒకటి ఫ్రీక్వెన్సీ మానిటరింగ్ విధానం. ఈ పద్ధతిలో టిఆర్‌పిని లెక్కించడం ద్వారా ఎంత మంది ఆ ప్రోగ్రాం చూస్తున్నారో ఇట్టే తెలుస్తుంది. దీని ప్రామాణికం కొన్ని వేల మంది వీక్షకుల ఇళ్ల టీవీ సెట్‌లకు ఒక పరికరం జతచేయబడుతుంది. ఈ పరికరాన్ని పీపుల్స్ మీటర్ అని పిలుస్తారు. ఒక నిర్దిష్టమైన రోజున వీక్షకులు చూసే సమయాన్ని రికార్డ్ చేస్తుంది. ఆ తరువాత వీక్షకుల స్థితిని తెలుసుకోవడానికి సగటు 30 రోజుల వ్యవధికి తీసుకుంటారు. పీపుల్స్ మీటర్ ఖరీదైన పరికరం. ఇది విదేశాల నుండి దిగుమతి అవుతోంది. రెండోది పిక్చర్ మ్యాచింగ్ టెక్నిక్. ఈ టెక్నిక్‌లో పీపుల్స్ మీటర్ ఒక నిర్దిష్ట టెలివిజన్ సెట్‌లో చూసే చిత్రంలోని చిన్న భాగాన్ని నిరంతరం రికార్డ్ చేస్తుంది. ఆ తరువాత నమూనా గృహాల నుండి డేటా సేకరించి జాతీయ రేటింగ్‌ను లెక్కించడానికి ఉపయోగిస్తారు. ఈ సాంకేతికత భారతదేశంలో టీవీ రేటింగ్ కు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
Also Read : వివాహ వ్యవస్ధ పయనం ఎటు?
టీవీ అనేది అంతులేని చక్రం. మనుషుల భావోద్రేకాలతో ఆడుతున్న సాధనం. ఉదయం లేచింది మొదలు రాత్రి పన్నెండు వరకు టీవీలో రకరకాల ‘రియాలిటీ షో’ లతో మనుషుల్లో కృత్రిమత్వం వచ్చేసింది.
అప్పటికీ, ఇప్పటికీ ఎంత తేడా?
దూరదర్శన్ ఒక్కటే ఉన్న రోజులకీ, ఇప్పటికీ మార్పు ఏమిటంటే మానవ జీవితాలతో ఆడుకునే నాటకరంగం టీవీ అయిపోయింది. ఈ టెలివిజన్ కార్యక్రమాల కంటెంట్‌లో విపరీతమైన మార్పు వచ్చింది. ఇది వీక్షకులపై విపరీత ప్రభావం చూపిస్తోంది. భారతదేశంలో టెలివిజన్ 1950 ల చివరలో ఒక ప్రయోగంగా ప్రారంభమైంది. కేవలం రెండు గంటల విద్యను మాత్రమే ప్రసారం చేసేది. కానీ 2016 నివేదికల ప్రకారం, ఇపుడు భారతదేశంలో 850 కి పైగా టీవీచానల్స్ వచ్చాయి. భారతీయ చిన్న స్క్రీన్ ప్రోగ్రామింగ్ 1980 లో ప్రారంభమైంది. ఈ సమయంలో, ఒక జాతీయ ఛానెల్ మాత్రమే ఉంది. అది ప్రభుత్వానికి చెందినది. అదే దూరదర్శన్.
Also Read : సోషల్ మీడియా సామాజిక విప్లవమా?సమస్యల సమాహారమా?
దూరదర్శన్ లో నిర్మాణాత్మక కార్యక్రమాలు
ఇది పురాణాల ఆధారంగా “రామాయణం,” “మహాభారతం” వంటి ప్రదర్శనలను ప్రసారం చేసింది. 1984 లో ప్రసారమైన “హమ్ లోగ్” వంటి ఇతర ప్రదర్శనలు భారతీయ కుటుంబాలతో విపరీతమైన మార్పు తీసుకువచ్చింది. 1947 లో భారతదేశ విభజన ఇతివృత్తంగా నిర్మించిన ‘బునియాద్’ (1986-87) మరియు దాని తరువాత, ఫౌజీ (1989) పేరుతో భారత సైన్యం కమాండో శిక్షణను అనుసరించిన సీరియల్స్ భారతీయ సంస్కృతిని కాపాడాయి. కామెడీ షోలు ‘యే జో జిందగీ హై’, పిల్లల కథలు “విక్రమ్ బేతాల్,” “మాల్గుడి రోజులు” పాత తరాన్ని ఆకట్టుకున్నాయి.
Also Read : అచ్చ తెలుగు ఆణి ముత్యం మన వేటూరి
భావోద్రేకాలతో సీరియల్స్
ఇప్పుడు మానవ సంబంధాల భావోద్రేకాలతో కూడిన సీరియల్స్ రావడం వల్ల అతి ప్రవర్తన ఎక్కువైంది. మారుమూల గ్రామాల్లో కూడా ముఖాలకు పౌడర్ రుద్దుకొని నీట్ గా తరవుతున్న యువతరం తీరు చూస్తుంటే ఎంతగా ఆనందం ఉందో, సినిమా టీవీ ప్రభావాలకు లోనై యువతులు జీవితాలను పోగొట్టుకోవడం అంత విషాదంగా ఉంది. టీవీ షో లో యాంకర్లు వేసుకుంటున్న దుస్తులు వారి తల్లి దండ్రులు కూడా చూడలేక పోతున్నారు. భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించే వనిత లు కరవవుతున్నారు. అలాగే సినిమాలాగా టీవీ సీరియల్స్ నటులు కూడా రెమ్యునరేషన్ విపరీతంగా పెంచేశారు. క్రియేటివిటీ కూడా బాగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో రోజు టీవీ అవకాశాల కోసం కాలేజీ అమ్మాయిలు, గృహిణులు స్టూడియోల చుట్టూ ఆరు వందల మంది ప్రదక్షిణం చేస్తున్నారట.
Also Read : స్వర్గం ఒక భ్రాంతి.. ఐశ్వర్యం – పేదరికం – పురుషాధిక్యత!
టాప్ లో ‘కార్తీకదీపం’
ఇటీవల తెలుగు టీవీ రంగంలో “కార్తీక దీపం” రేటింగ్ లో మొదటి స్థానంలో ఉండగా ‘‘మొగలి రేకులు,’’ ‘‘చక్రవాకం,’’ ‘‘మనసు మమత,’’ ‘‘స్వాతి చినుకులు,’’ ‘‘అంతం,’’ ‘‘అగ్నిపూలు’’ ఇలా ఎన్నో సీరియల్స్ ప్రజాదరణ పొందాయి. టీవీ సీరియల్స్ అన్నిట్లో అమ్మాయిలదే డామినేషన్, మొగవాళ్ళు సపోర్టింగ్ రోల్స్ లాగా తయారు అయ్యారు. ఎక్కువగా ఫెమినిజం టీవీలో వస్తుందని అనుకుంటున్నారా? నిజమే గృహిణులు కూడా స్త్రీ వాదాన్ని ఎత్తుకోవడం వల్ల పురుషులు సతమతం అవుతున్నారని ఒక భార్యాబాధితుడు వాపోయాడు…పిల్లలకు సంబందించిన “లాలూ పట్ల”, ‘‘శివ’’ లాంటి యానిమేషన్ టీవీ సీరియల్స్ చూసి పిల్లలు కూడా రియల్ లో చూసిన సాహసాలు నిజజీవితంలో చేసి గాయాల పాలు అవుతున్నారు.
Also Read : కరోనా ప్రపంచానికి నేర్పిన సంస్కారం మన నమస్కారం
పెరుగుతున్న లైంగిక వేధింపులు
కొద్దిగా ప్రతిభ ఉండి అదనపు కార్యక్రమాలలో పాల్గొనే పిల్లలపై తల్లి దండ్రులు కూడా టీవీ మోజులో వారిని చిత్ర హింసలకు గురిచేస్తున్నారని బాలల హక్కులు కాపాడే సంఘాలు ధ్వజ మెత్తుతున్నాయి. టీవీ రంగం లో కూడా లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయని కొంత మంది వాపోతున్నారు. నకిలీ ప్రొడ్యూసర్లు టీవీ సీరియల్స్ తీస్తున్నామని అందమైన అమ్మాయిలకు వల వేస్తున్నారని కూడా పోలీసులు చెబుతున్నారు. టీవీ మోజులో హైద్రాబాద్ నగరానికి చేరే యువతులపై ‘షీ పోలీసు టీం’ లు ఒక కన్నేసి ఉంచాయి. స్టూడియోల దగ్గర అమాయక వనితలను ప్రలోభపెట్టే కంత్రీగాళ్లపై కన్నేసి ఉంచారు. నిజానికి టీవీ సీరియల్స్ లో ఉత్తమ కథాగమనంతో సమజానికి మేలు చేసే సీరియల్స్ రావాలని పలువురు కోరుకుంటున్నారు.
Also Read : సంసారాల్లో స్మార్ట్ ఫోన్ సరిగమలు!