Sunday, December 22, 2024

పాత్రికేయ ఘనాపాఠి తుర్లపాటి

ప్రముఖ పాత్రికేయుడు, పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు (1933 ఆగస్టు 10 – జనవరి 10, 2021) ఆదివారం అర్ధరాత్రి దాటాక కన్ను మూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ, అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు.

తుర్లపాటి కుటుంబరావు ప్రముఖ పాత్రికేయుడు, రచయిత, వక్త. ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం వద్ద కార్యదర్శిగా పనిచేశారు. పాత్రికేయుడిగా, రచయితగా, వ్యాఖ్యాతగా, సభాధ్యక్షుడిగా, అనువాద ప్రాసంగికునిగా ప్రసిద్ధి కెక్కారు. 18 మంది ముఖ్యమంత్రులతో సన్నిహితంగా మెలిగినవారు. ఆయన రాసిన ‘18 మంది ముఖ్యమంత్రులతో నా ముచ్చట్లు’ అనే పుస్తకంలో అనేక ఆసక్తికర విషయాలు గ్రంథస్థం చేశారు. వండర్ బుక్ ఆఫ్ రికార్డు, అష్టాదశ సహస్రసభా కేసరి బిరుదు కూడా పొందారు. 2002 లో కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న తొలి తెలుగు జర్నలిస్టుగా నిలిచారు. రాజకీయ, సినీ తదితర రంగాల ప్రముఖులతో సన్నిహిత పరిచయాలు కలిగి, అక్కినేని నాగేశ్వరరావు కు ” నట సమ్రాట్ ” బిరుదుని ” ప్రతిపాదించినది తుర్లపాటే.

1933 లో విజయవాడ లో జన్మించారు. 1946లో 14 సంవత్సరాల వయసులోనే తుర్లపాటి పాత్రికేయ వృత్తిలోకి అడుగు పెట్టారు. 1947 లో రచనా ప్రస్థానంలో భాగంగా మాతృభూమి’ పత్రికలో ‘స్వరాజ్యంలో స్వాతంత్య్రం’ అనే ఆయ‌న‌ తొలివ్యాసం 1947 మార్చి 22న ప్రచురితమైంది.

1951లో ఆచార్య ఎన్‌జీ రంగారావు వాహిని పత్రికలో మొదటిసారిగా కుటుంబరావు ఉప సంపాదకుడిగా పనిచేశారు. తర్వాత చలసాని రామారాయ్‌ ‘ప్రతిభ’ పత్రికకు ఎడిటర్‌గా విధులు నిర్వర్తించారు. టంగుటూరి ప్రకాశం పంతులు ఆయన్ని చెన్నైకి పిలిపించి, తను నడుపుతున్న ప్రజాపత్రికలో సహాయ సంపాదకుడిగా నియమించారు. అంతే కాకుండా సహాయ సంపాదకుడితో పాటు ప్రకాశం పంతులుకు కార్యదర్శిగానూ ఏక కాలంలో పని చేశారు. అనంతర కాలంలో 1960 మే 21 నుండి 1963 జూన్ వరకు, 1965 నుండి 1991చివరి వరకు ఆంధ్రజ్యోతికి ఎడిటర్‌గా పనిచేసి తదుపరి స్వేచ్ఛా పాత్రికేయనిగా తన వ్యాసంగం కొనసాగించాడు. ప్రముఖ నాయకులు అంబేద్కర్‌, నెహ్రూ, రాజాజీలను ఇంటర్వ్యూ చేసే అవకాశాలు వచ్చాయి.1960 లో ప్రారంభించిన వార్తలలోని వ్యక్తి అనే శీర్షికను మొదటి నాలుగు సంవత్సరాలు రోజువారీ శీర్షికగా ఆ తరువాత వారంవారీ శీర్షికగా 1991 వరకు కొనసాగించి ఆ తరువాత వార్త పత్రికలో 2010 నాటికి 50 సంవత్సరాలు నిర్వహించిన ఘనత తుర్లపాటిదే. ఈ శీర్షికలో భాగంగా నాలుగు వేలకుపైగా వ్యక్తుల జీవిత రేఖాచిత్రాలు రచించాడు. స్వాతంత్య్ర సమర యోధులు, జాతీయ వాదులు, ప్రముఖ వ్యక్తులు దాదాపు 6 వేల జీవిత చరిత్ర లను రాసి, తెలుగు సాహిత్యంలో వ్యక్తుల జీవిత చరిత్రల రచయితగా ముద్ర వేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో, ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో వేలాది సమావేశాలకు అధ్యక్షునిగా,  దాదాపు  20 వేల సమావేశాల్లో వక్తగా ప్రసంగించారు.

ఇది చదవండి: వరిష్ఠ పాత్రికేయుడు తుర్లపాటి ఇక లేరు

1969లో నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ కమిటీలో సభ్యునిగా కేంద్రం ప్రభుత్వం తుర్లపాటి నియమితులు అయినారు. నేషనల్‌ ఫిల్మ్‌ అడ్వైజరీ కమిటీలో, సెంట్రల్‌ ఫిల్మ్‌ సెన్సార్‌ బోర్డులో సభ్యుడిగా విధులు నిర్వర్తించారు. సుమారు మూడు దశాబ్దాల పాటు ఏపీ ఫిల్మ్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీగా విధులు నిర్వహించారు.

1989లో ముట్నూరి కృష్ణారావు నుంచి ఉత్తమ ఎడిటర్‌ అవార్డు పొందిన కుటుంబరావు, 1990లో ఉత్తమ జీవిత చరిత్రల రచయితగా తెలుగు విశ్వవిద్యాలయం నుంచి అవార్డు అందుకున్నారు. ఉపన్యాస కేసరి బిరుదు వరించింది. ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్‌ పట్టా అందుకున్నారు. 1994లో కాశీనాథుని నాగేశ్వరరావు నుంచి ఉత్తమ జర్నలిస్టు అవార్డు అందుకున్నారు. 1993లో గిన్నిస్‌ బుక్‌ అవార్డు, 1998లో అమెరికా నుంచి వరల్డ్‌ లైఫ్‌ టైం అచీవ్‌ మెంట్‌ అవార్డు పొందారు. 2002లో పద్మశ్రీ అవార్డు పొందారు.2010 జూన్ 21 న ఆంధ్ర ప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు.

తుర్లపాటి కుటుంబరావుకు పాత్రికేయ వృత్తిలో సుదీర్ఘ అనుభవం ఉంది. దాదాపు ఏడు దశాబ్దాల పాటు అనేక విషయాలపై విశ్లేషణలు చేశారు. జర్నలిస్టుగా, రచయితగా, వ్యాఖ్యాతగా, సభ అధ్యక్షుడిగా, అనువాద ప్రసంగికునిగా ప్రత్యేక గుర్తింపు పొందారు.

పాత్రికేయ వృత్తిలో  విలువలను ఎప్పుడూ వదులు కోలేదు. జేబులో నిరంతరం  “రాజీనామ పత్రం” పెట్టుకుని ఉండేవారని చెపుతారు.

తుర్లపాటి గురించి ప్రముఖుల వ్యాఖ్యానాలు ఇలా ఉన్నాయి.

తుర్లపాటి కేవలం ప్రఖ్యాత జర్నలిస్టు మాత్రమే కాదు… మరెన్నో రంగాలలో ప్రతిభావంతుడు” – కె.ఆర్. నారాయణన్ , భారత మాజీ రాష్ట్రపతి

“గార్డియన్ ఆఫ్ తెలుగు” – రాజాజీ, భారత మాజీ గవర్నర్ జనరల్

“పత్రికానిర్వహణలో కుటుంబరావు దిట్ట, సభానిర్వహణలో దక్షుడు, జంకు గొంకూ లేకుండా మట్లాడే ఉపన్యాసకుడు”- ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు

“ఆధునిక రాజకీయ జర్నలిస్టులలో అందె వేసిన చెయ్యి, యువతరానికి మార్గదర్శకుడు”-నీలం సంజీవరెడ్డి, మాజీ భారత రాష్ట్రపతి

“ప్రెస్, పిక్చర్, ప్లాట్ ఫారం – ఈ మూడు తుర్లపాటి చేతిలోని పదునైన ఆయుధాలు. ఆయన అంతగా రాణించడానికి ఇవే కారణాలు.”- వందేమాతరం రామచంద్రరావు, అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles