ఆయన ఉన్న చోటు నవ్వుల తోట. నిత్యదరహాసం. కొన్ని సందర్భాలలో చికాకు పరిస్థితులు ఎదురైనా,`నవ్వు మన జన్మహక్కు` అన్నది ఆయన సిద్ధాంతం. మనుషులు సుఖంగా నవ్వుతూ, సుఖంగా బతికేయాలన్న రుషులు, చార్లిచాప్లీన్, భమిడిపాటి తదితర మహానుభావుల మాటను నిజం చేయాలన్నది ఆయన విధానం. ఆయనే ప్రముఖ రచయిత, పాత్రికేయుడు తురగా కృష్ణమోహన్ రావు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో 1929 ఫిబ్రవరి 21వ తేదీన పుట్టిన ఆయన ప్రాథమిక, ఉన్నత విద్య అక్కడే చదివి, మచిలీపట్నంలో బి.ఏ., హైదరాబాద్ ఉస్మానియా న్యాయకళాశాలలో `లా`, నాగపూర్ విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎ. ఇంగ్లీషు చేశారు. అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో కొన్నాళ్లు, భవాన్స్, ఉస్మానియా జర్నలిజం కోర్సులలో ఉపన్యాసకుడిగా కొంతకాలం, ఆంధ్ర జనత, హైదరాబాద్ బులిటిన్, ఆంధ్రపత్రికలలో పాత్రికేయుడిగా మరికొంతకాలం పనిచేశారు.
మేధాశక్తి, హాస్యప్రియత్వం రంగరింపు
కృష్ణమోహన్ విలేకరి మాత్రమే కాదు. మంచి రచయిత కూడా. మేధాశక్తిని, హాస్యప్రియత్వాన్ని రంగరించినట్లుండేవి ఆయన రచనలు. `ప్రవీణ్` అనే కలం పేరుతో ఎక్కువ రచనలు చేశారు. పాత్రికేయం, సాహిత్యాలను రెండు కళ్లుగా భావించి అసాధారణ సేవలు అందించారని ఆయన సహోద్యోగులు కొందరు ఇప్పటికీ గుర్తు చేసుకుంటుంటారు. పనిలోనూ, వ్యాపకంలోనే విశ్రాంతి అనుకునే ఆయన కడదాకా అవిశ్రాంతంగా ఎంతో చేసినా తృప్తిపడలేదు. `నలభై సంవత్సరాలు దాటిపోయినా ఇంతవరకు ఏమీ సాధించలేకపోయాను` అని ఎప్పుడూ అశాంతిగా అనుకునే వారని ఆయన సహధర్మచారిణి జానకీరాణిగారు చెప్పేవారు.
`రాజధాని కబుర్లు`
`ఆంధ్రపత్రిక` దినపత్రికలో 1960వ దశకంలో మూడేళ్ల పాటు నిర్వహించిన `రాజధాని కబుర్లు` శీర్షిక రాజకీయవర్గాలలో సంచలనం. రాజకీయ వ్యంగ్య రచనలు (పొలిటికల్ సెటైర్) బారినపడిన వారు వాటిని చదువుకొని సిగ్గుపడేవారట. ఆ రచనలు సార్వకాలీనం. తరాలు, పేర్లు, నాయకులు, అధికారగణం మారినా అదే రాజకీయం, అదే వ్యవస్థ. పుంఖానుపుంఖాలుగా రాసిన `కబుర్ల`లో వెటకారంతో పాటు కొన్నిసార్లు విసుగు, మరికొన్నిసార్లు కితకితలు చోటు చేసుకునేవి. ఆయన రచనలు తరువాతి తరాల ఈ తరహా కాలమిస్టులుకు స్ఫూర్తినిచ్చాయనడంలో సందేహం లేదు.
నవ్వుల గని
నవ్వుతూ నవ్వించాలన్నది కృష్ణమోహన్ రావు విధానమని ఆయనను బాగా ఎరిగున్నవారు అంటారు. అనుక్షణం చిరునవ్వు. పలువురిని పరవశింపజేసే సంభాషణా చాతుర్యం. మంచిని, ప్రతిభను చూసి హర్షించే తత్వం, ఆ దరహాసం ఆయన రచనలలోనూ కనిపిస్తుంది. నవ్వించడం అంత సులువు కాదు. ఆ కళ అందరికి అబ్బేది కాదు. నవ్వించే అంశాలనే మరికొంత హాస్యస్ఫోరకంగా చెప్పడం కంటే, జీవితసత్యాలు, మెట్టవేదాంతం లాంటి అంశాలకు నవ్వులను జోడించడం ఆషామాషీకాదు. ఏమాత్రం తేడా వచ్చినా ఆ రచన `నవ్వులపాలే`. ఆయన అలాంటి ప్రమాదాలను అధిగమించారు. అందుకు ఆయన రచనల సంకలనం `మాటకచ్చేరి` ఓ మ(మె)చ్చు తునక. `ఆ నవ్వుల పందిరి కింద కాలాన్ని మరిచిన వాడిని. కొంటెగా మెరిసే కళ్లు. తొందరలో అక్షరాలు ఒకదానికొకటి తోసుకొచ్చినట్టున్న సంభాషణ శైలి. అందమైన వ్యంగ్యాన్ని అలవోకగా జారవిడిచే చాతుర్యం. నవ్వు యెక్క విశ్వరూపం సాక్షాత్కరింపజేసిన మహానుభావుడు. నవ్వు పార్టీ అంటూ ఒకటి పెట్టుకుంటే ఆ పార్టీ పతాకం మధ్య తురగా కృష్ణ మోహనరావు బొమ్మ ఉండి తీరాలి` అని ఆయన మిత్రుడు, ప్రముఖ పాత్రికేయులు, రచయిత వాకాటి పాండు రంగారావు మాటలు గమనార్హం. `తురగా` అంటే కొంటె బొమ్మల బాపు గారికి ఎంతో ఇష్టం. ఈయన పుస్తకానికి ఆయనదే ముఖచిత్రం.
హాస్యాన్ని అమితంగా ఇష్టపడే కృష్ణమోహన్ రావు వృత్తిపరంగా (వార్తాసేకరణలో) ఎంత నిబద్ధతతో, ఎంత `సీరియస్` గా ఉండేవారో, ఇతర సమయాల్లో అంతకంటే మిన్నగా `హ్యూమరస్` (సరస దృష్టి)గా ఉండేవారని ఆయన సహోద్యోగులు, సన్నిహితులు గుర్తుచేసుకుంటుంటారు.
ఆకాశవాణితో అనుబంధం
ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రత్యేకించి ప్రాంతీయ వార్తా విభాగం ఎందరినో తీర్చిదిద్దినట్టే, దానికోసం అంకితభావంతో పనిచేసిన వారూ అంతే సంఖ్యలో ఉన్నారు. వారిలో కృష్ణమోహన్ రావు ముందు వరుసలో ఉంటారు. వార్తా సేకరణ, రచనల్లో విలక్షణ ప్రదర్శించే వారని ప్రముఖ వార్తాప్రయోక్త, ఆయన సహోద్యోగి దివి వెంకట్రామయ్య (ఇటీవల కాలం చేశారు) చెప్పేవారు.
1960లో కేంద్రం వార్తా విభాగంలో విలేకరిగా చేరిన కృష్ణమోహనరావు సుమారు పద్నాలుగేళ్ల ఈ ఉద్యోగ ప్రస్థానలో తన ఉద్యోగ బాద్యతలతో పాటు ఆకాశవాణి ప్రసారం చేసే అనేక కార్యక్రమాలలో పాలుపంచుకున్నారు. కార్మికుల కార్యక్రమా నికి హాస్య రూపకాలు అందించారు. కనీసం వంద వారాలపాటు శాసనసభ కార్యక్రమాల సమీక్షలు రాశారు. నాటక కళపై వ్యాసాలతో విశిష్ట కీర్తిని ఆర్జించారు. `చేతనైంత మేలు చేయాలి. అర్థవంతంగా బతకాలి` అనే విధానాన్ని కచ్చితంగా పాటిస్తూ, ఆ దిశలోనే, ఆకాశవాణి కళాకారుల, ఉద్యోగుల విషయంలో జాతీయ స్థాయిలో కృషి చేశారు. నవ్యసాహితీ సమితి, ఇండియన్ నేషనల్ ధియేటర్, వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్లలో క్రియాశీలకంగా వ్యవహరిం చారు. ప్రెస్ రిపోర్టర్స్ గిల్డ్ వ్యవస్థాపక సభ్యుడిగా పలు కార్యక్రము నిర్వహించారు.
విమర్శకుడిగా….
ఆయన మంచి రచయితతో పాటు నిశిత విమర్శకుడు కూడా. వాస్తవాన్ని నిర్మొహమాటంగా చెప్పడంలో వెనుకాడేవారుకారు అనేందుకు `తెలుగులో పత్రికా రచన` (`మహతి` సంకలనం…ఆగస్టు 1972) వ్యాసం ఓ ఉదాహరణ. అందులో ప్రస్తావించిన లోపాలు, పత్రికా సిబ్బందిలోని కొందరి అవగాహనా రాహిత్యరాతలు వర్తమానంలోని కొందరికి వర్తిస్తాయి. ఆ వ్యాసంలో విమర్శకంటే వారి అవగాహన లేమి పట్ల సానుభూతి, తెలుసుకోవాలనే హితవు కనిపిస్తుంది. `తెలుగు పత్రికల్లో కొందరు ప్రముఖులను మినహాయిస్తే చాలా మందికి విషయ పరిజ్ఞానం తక్కువ. ధవళేశ్వరం వద్ద గోదావరి బరాజ్ కు శంకుస్థాపన అంతర్వేది వద్ద జరిగిట్లు విజయవాడకు చెందిన ఒక పత్రికలో పతాక శీర్షికగా వచ్చింది. శీర్షిక రాసి ఇచ్చిన సంపాదక సిబ్బంది సభ్యుడికి బరాజ్ ఎక్కడ నిర్మిస్తారో తెలియకపోవడమే కాక అంతర్వేది ఎక్కడుందో తెలియదనుకోవాలి గదా`అని నిశితంగా ఎత్తి చూపారు. అలాంటివి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అంతేకాదు భాషలోని అపశ్రుతులను, పత్రికల్లో వ్యాపార ధోరణినీ ప్రస్తావించేవారు.
అకాలమృత్యువు
సికింద్రాబాద్ నుంచి ప్రారంభమైన కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలు వార్త సేకరణ యత్నంలో అసువులు బాశారు. 1974 అక్టోబర్ 2న ప్రారంభమైన రైలులో కృష్ణమోహన్ రావు సహా కొందరు పాత్రికేయ బృందం ఎక్కకుండానే కదిలి వెళ్లిపోయింది. దానిని ఖాజీపేటలో అందుకొందామనే ఉద్దేశంతో దక్షిణ మధ్య రైల్వే వారు ఏర్పాటు చేసిన వాహనంలో వెళుతుండగా నకిరేకల్ వద్ద ఆ వాహనం ప్రమాదం పాలై ఆయన కన్నుమూశారు.
జానకీ `కృష్ణీయం‘
కృష్ణమోహన్ రావుని, ఆయన సహధర్మచారిణి `రేడియో అక్కయ్య` జానకీ రాణిని (2014లో దివంగతులయ్యారు) విడివిడిగా ఊహంచలేం. ఒకరి కోసం ఒకరు అన్నట్లు పదహారున్నరేళ్లు గడిపారు. `గడిపారు` అనడం కంటే జీవితం పండించుకున్నారని చెప్పాలి. ఇద్దరూ శారదామూర్తులే. జానకీరాణి వివాహానికి ముందే కలం పట్టారు. ఆయనా అప్పటికే రచయిత.`ఆయన గొప్ప స్నేహితుడు. నేనంటే ప్రగాఢమైన ప్రేమ. ప్రేమించడం ఎంత అదృష్టమో అర్థమైంది`అని చెప్పేవారు ఆమె. ఇధ్దరు చిన్నారులకు అంతగా ఊహ తెలియని సమయంలోనే ఆ `అదృష్టం` తలకిందులైంది. ఆయన దాటిపోయి బతుకు చెదిరినా, గుండె దిటవుతో పిల్లలను పెంచి ప్రయోజకులను చేసి కచ్చితంగా నాలుగు దశాబ్దాలకు కోల్పోయిన `తోడు`ను వెదుక్కుంటూ వెళ్లిపోయారు.
`తురగా` పురస్కారాలు
`తురగా` దంపతులు పాత్రికేయ, సాహిత్య రంగాలకు చేసిన సేవలకు గుర్తింపుగా వారి తనయలు ఉషారమణి, వసంతశోభ `తురగా ఫౌండేషన్` పేరిట అమ్మానాన్నల స్మృత్యర్థం ఏటా పురస్కార ప్రదానం చేపట్టారు. కృష్ణమోహన్, జానకీరాణి పురస్కారాలను అందుకున్న ప్రముఖ పాత్రికేయ, సాహిత్య ప్రముఖులలో సి.రాఘవాచారి, పొత్తూరి వేంకటేశ్వరరావు, ఎంవీఆర్ శాస్త్రి, భండారు శ్రీనివాసరావు, ఈమని కృష్ణారావు, చీకోలు సుందరయ్య, యద్ధనపూడి సులోచనరాణి, పోచిరాజు సత్యవతి, పొత్తూరి విజయలక్ష్మి, కేబీ లక్ష్మి, కామేశ్వరి తదితరులు ఉన్నారు.
(ఫిబ్రవరి 21న తురగా కృష్ణమోహన్ రావు జయంతి)
ఆయనపేరిట పురస్కారం అందుకున్న వారిలో మీ సుధామ కూడా వున్నాడు
I am very happy to read this article about late Thuraga krishna mohan Rao