Sunday, December 22, 2024

తుంగభద్ర పుష్కర సంరంభం

పవిత్ర తుంగభద్ర పుష్కర సంరంభం ఆరంభమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి  వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి రంగ రంగ వైభవంగా ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా శుభారంభం పలికారు. పవిత్ర కార్తీకమాసంలో తెలుగునేలపై జరుగుతున్న ఉత్సవం ఇది. కాలం ఎంత గొప్పదో, ఎంత చిత్రమైందో ఈ పుష్కరాలు  చెబుతున్నాయి. గత పుష్కరాలు 2008లో జరిగాయి.

కాలమహిమ

అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉంది. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా పుష్కరాలను ఆవిష్కరించడమే కాక, తెలంగాణ సీమలోని అలంపూర్ పుష్కర ఘాట్ దగ్గర తుంగభద్రమ్మ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. మళ్ళీ పుష్కరాలు వచ్చే సరికి కాలప్రవాహంలో అనేక దృశ్యాలు మారిపోయాయి. రాష్ట్రం రెండుగా విడిపోయింది. రాజశేఖర్ రెడ్డి భౌతికంగా ఈ లోకమే వీడి వెళ్ళిపొయ్యారు. రాష్ట్రం రెండు ముక్కలవ్వడమే కాదు, తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ముక్కలుచెక్కలై పోయింది. అందులో ఒక పెద్ద ముక్క  వై ఎస్ ఆర్ పార్టీగా అవతరించింది. రాజశేఖర్ రెడ్డి తనయుడే దానికి నిర్మాత, నేత అయ్యారు. నేడు ముఖ్యమంత్రి అయ్యారు.

కొత్త రాష్ట్రం పురిటినొప్పులు

తెలంగాణ ఉద్యమ ప్రధాన సారథి కె సి ఆర్ ఆ రాష్ట్రానికి  ముఖ్యమంత్రి అయ్యారు. ఒకప్పుడు మన  నీటి పోరాటాలు కర్ణాటకతో జరిగాయి. ఇప్పుడు మనలో  మనమే కొట్టుకునే పరిస్థితులు  వచ్చాయి . రెండుగా తెలుగు రాష్ట్రాలు పురుడుపోసుకున్నా,  కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇంకా పురిటినొప్పులు పడుతోంది. ఈ పుష్కర కాలంలో ఇన్ని మార్పులు జరిగాయి. రాబోయే పుష్కరం 2032లో వస్తుంది. అప్పటికి ఎన్ని చిత్రాలు, విచిత్రాలు జరుగుతాయో కాలమే చూపిస్తుంది. తుంగ, భద్ర ఇవి రెండు నదులు. వీటిని ఏకీకృతం చేసి తుంగభద్రగా పిలుచుకుంటున్నాం. అలాగే, నేడు రాష్ట్రాలు రెండైనా, మన భాష ఒక్కటే. మనల్ని ఏకీకృతం చేసేది  తెలుగు సంస్కృతి ఒక్కటే.

మనుషులను కలిపేవి పండుగలు

పండుగలు మనుషులను కలుపుతాయి.ఆ స్పృహ  మనం ఎప్పటికీ మదిలో నిలుపుకుంటే చాలు. నిజం చెప్పాలంటే, మొన్న మొన్నటి వరకూ కన్నడ, తెలుగు ఒకే లిపిలో ఉండేవి. నేడు కూడా తెలుగువారు కన్నడం చదువగలుగుతారు. ఈ ప్రాంతాలన్నింటినీ, కర్ణాటరాజ్యంగానే పిలుచుకొనేవారు. ఎవడేమని అనుకున్నా, నాకు ఎటువంటి భయం లేదు, నాది కర్ణాటభాష, అని కవిసార్వభౌముడు శ్రీనాథుడు ఢక్కా మోగించి  చెప్పాడు. మన సంగీతాన్ని కర్ణాట సంగీతం అంటాము. కర్ణములకు, అంటే చెవులకు ఇంపైనదే కర్ణాటము అని అర్థం.

దేశభాషలందు తెలుసు లెస్ప’

అది భాషైనా, సంగీతమైనా ఇంపుగా ఉండడమే ప్రధాన లక్షణం.ఆ ఇంపు, కవ్వింపు మన సంగీతంలో, సాహిత్యంలో ఉన్నాయి కాబట్టే “దేశ భాషలందు తెలుగు లెస్స” అని కవిరాయలు శ్రీకృష్ణ దేవరాయలు అన్నాడు.ఆయన పితృభాష తుళు. కానీ, ఆయన మాతృభాష తెలుగు అని చరిత్రకారులు అంటారు. ఇంతగా  నదీప్రవాహాలతోపాటు, సంస్కృతి ప్రవహించింది. మనల్ని ఎప్పటికీ ఏకం చేసేది, ఏకాకిగా మిగలకుండా చేసేదీ ఈ భాషా, సంస్కృతులే. ఇవన్నీ విరాజిల్లింది నదుల ఒడ్డునే. అటువంటి చారిత్రక వైభవం కలిగిన నదులలో తుంగ,భద్ర చాలా గొప్పవి. అంతటి నదీమ తల్లుల  పండుగలను  పవిత్రంగా, స్వచ్ఛంగా జరుపుకోవడమే సంస్కారం. 

కరోనా కట్టడిలో లేదు

కరోనా ఇంకా కట్టడిలోకి రాలేదు. సెకండ్ వేవ్ ఎప్పుడొస్తుందో తెలియదు. వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చి, కరోనా వ్యాప్తి పూర్తిగా, మన నుంచి దూరమయ్యేంత వరకూ చాలా జాగ్రత్తగా ఉండాలి. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, పుష్కరాల సందర్బంగా జరిగిన సంఘటనల్లో  ఎందరో ప్రాణాలు కోల్పోయారు. హంగామా కోసం కోట్లాది రూపాయల ప్రజాధనం మంచినీళ్లలాగా ఖర్చుపెట్టి, నీళ్లపాలు చేశారు. నేడు,  కరోనా  ప్రమాదకరంగా రాజ్యమేలుతున్న కాలం. అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు ఎంతో ఏమరపాటుతో ఉండాల్సిన సందర్భం. ప్రవహిస్తోంది నీళ్ళే కానీ, డబ్బు కాదనే స్పృహతో, ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 

ముఖ్యమంత్రికి అభినందన

ఎటువంటి హడావిడి లేకుండా, హంగుఆర్భాటాలకు పోకుండా ఉత్సవాలను జరుపుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ఈ దిశగా నిర్దేశం చేసిన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని అభినందిద్దాం.ఇది మొదటి రోజు మాత్రమే.ఇంకా 11రోజుల పాటు ఈ పండుగ జరుగనుంది.జాగ్రత్త, స్పృహల మధ్య 12రోజులూ  వైభవంగా ఈ వేడుకలు జరగాలని, ముగియాలని  కోరుకుందాం. తుంగభద్ర అత్యంత ప్రాచీనమైంది. రామాయణ కాలంలో పంపానదిగా పిలిచేవారని ఐతిహ్యం ఉంది. ఈ నది ఒడ్డున అద్భుతమైన చారిత్రక విజయనగర సామ్రాజ్యం వెలిసింది. ఇక్కడే రాజధాని నిర్మాణం జరిగింది.

విడదీయలేని అనుబంధం

కృష్ణానదికి ఉపనదియైన  తుంగభద్రా పరీవాహక ప్రాంతంలో పరమాద్భుతమైన సంస్కృతి, దేవాలయాలు నిర్మాణం జరిగాయి. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తుంగభద్రతో విడదీయలేని అనుబంధం ఉంది. భారతదేశంలోని పంచ గంగల్లో తుంగభద్రను ఒకటిగా చెబుతారు. హంపి, మంత్రాలయం, శృంగేరి పీఠం, అలంపురం ఎన్నో ఈ నది వెంటే ఉన్నాయి.ఐదవ శక్తి పీఠం, పురాతన దేవాలయాలు అలంపూర్ లో ఉన్నాయి. “తుంగభద్రా సముత్తుంగ వీచీ ఘటా గంభీర ఘుమ ఘుమారంభములకు” అన్నాడు శ్రీనాథుడు. అంటే, తుంగభద్ర నదిలోని ఎత్తైన అలలు ఘుమ్ ఘుమ.. అంటూ నాదాలు చేస్తుంటాయి.బుధ్ధికి గురువైన బృహస్పతి మకరరాశిలో ప్రవేశించినప్పుడు తుంగభద్ర పుష్కరాలు జరుపుకుంటారు.ఇంతటి సందర్భం కలిగిన ఈ ఉత్సవాలను శ్రద్ధ,భక్తులతో  జరుపుకోవడమే మన విధి. బృహస్పతి అందరికీ సద్బుద్ధి ప్రసాదించుగాక. తుంగభద్ర సద్గతి కలిగించుగాక. మన భాషా, సాంస్కృతిక  ప్రవాహం నిరాఘాటంగా సాగుగాక.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles