- పదవీ విరమణ సందర్భంగా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి
- అవినీతి ఆరోపణలకు ఆస్కారం లేకుండా నిజాయితీగా పని చేశాం
- అతి తక్కువ సిబ్బందితో వేలపోస్టులు భర్తీ చేశాం
- అర్ధరాత్రి వరకూ పని చేసిన రోజులున్నాయి
హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందనీ, విప్లవాత్మకమైన సంస్కరణలు ప్రవేవపెట్టిందనీ, ఉద్యోగాల భర్తీ విషయంలో సైతం నంబర్ ఒన్ స్థానంలో నిలిచిందనీ టీఎస్ పీఎస్ సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటాచక్రపాణి తెలియజేశారు. పదవీ విరమణ సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ, తన అరేళ్ళ పదవీ కాలంలో ఎటువంటి రాజకీయ ఒత్తిళ్ళు లేకుండా, స్వేచ్ఛగా తన కార్యక్రమాలు అమలు చేయగలిగాననీ, పారదర్శకతతో ఉద్యోగాలు భర్తీ చేయగలిగానని చెప్పారు.
35 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం
తన సహచరుల సహకారం, తెలంగాణ ప్రభుత్వం మద్దతుతో 110 నోటిఫికేషన్లు జారీ చేశామనీ, 35,000 పోస్టులను భర్తీ చేశామనీ, స్టాఫ్ నర్సుల, ఇతర ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మరో వారం, పది రోజుల్లో ముగుస్తుందనీ డాక్టర్ చక్రపాణి తెలిపారు. గురువారంనాడు ప్రొఫెసర్ చక్రపాణి పదవీ విరమణ చేయనున్నారు. తనకు ఇంతటి మహదవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్)కు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వ యంత్రాంగానికీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులకూ, ఇతర సిబ్బందికీ ధన్యవాదాలు చెప్పారు.
టీఎస్ ఫీసీ సభ్యులుగా గర్విస్తున్నాం
టీఎస్ పీసీ సభ్యులుగా సేవలందించడం గర్వంగా ఉన్నదని పదవీకాలం ముగించుకంటున్న సీ. విఠల్, బి. చంద్రావతి, మహమ్మద్ ఎం ఖాద్రీ అన్నారు. నీళ్ళు, నిధులూ, నియామకాలు లక్ష్యంతో ఏర్పడిన తెలంగాణలో విధులు నిర్రవహించేందుకు అవసరమైన సిబ్బందిని భర్తీ చేయడంలో టీఎస్ పీఎస్ సీ కీలకమైన పాత్ర పోషించిందని వారు అన్నారు.
రాజకీయ ఒత్తిళ్ళు అసలే లేవు
ప్రభుత్వం నుంచి ఎటువంటి ఒత్తిళ్ళూ ఉండబోవని బాధ్యతలు స్వీకరించిన సమయంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారనీ, రాజకీయ నాయకుల పైరవీలకు అవకాశం ఉండదని కూడా అన్నారనీ ప్రొఫెసర్ చక్రపాణి అన్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం కానీ, అధికారపార్టీకి చెందిన నాయకులు కానీ జోక్యం చేసుకున్న సందర్భం ఒక్కటి కూడా లేదని ఆయన వివరించారు. తమపైన కోర్టు కేసులు వచ్చాయి కానీ అవినీతి జరిగిందనే ఆరోపణ మాత్రం రాలేదనీ, అందుకు మేము పరమనిజాయితీగా వ్యవహరించడమే కారణమనీ చక్రపాణి వ్యాఖ్యానించారు.
మళ్ళీ ప్రొఫెసర్ గా పనిచేస్తాను
కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో సిలబస్ కూర్చడం, నియమనిబంధనలను తయారు చేయడం, తదితర అంశాలన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించి, పరిశోధించి మార్గదర్శకాలను నిర్ణయించామని చక్రపాణి చెప్పారు. అతి తక్కువ సిబ్బందితో వేలపోస్టులు భర్తీ చేశామనీ, కొన్ని సందర్భాలలో అర్ధరాత్రివరకూ పనిచేసే వాళ్ళమని కూడా ఆయన వివరించారు. ఉద్యోగ విరమణ తర్వాత ఫ్రొఫెసర్ గా బాధ్యతలు నిర్వహిస్తానని ఆయన తెలియజేశారు.
సుప్రీంకోర్టు అభినందించింది
‘‘ఒక ప్రభుత్వ టీచర్ గా రూ. 398ల వేతనానికి పని చేశాను. టీఎస్ పీఎస్ సీ చైర్మన్ గా వేలకొలది ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియ చేపట్టాను. గ్రూప్-2 పరీక్ష నిర్వహణ ఒక పెను సవాలుగా స్వీకరించాం, కోర్టులలో ఎన్ని కేసులు వేసినా ఎదుర్కొన్నాం, చివరికి సుప్రీంకోర్టు టీఎస్ పీఎస్ సీని అభినందించింది. ఇంతకంటే గొప్పగా పరీక్ష నిర్వహించడం ఎవరి వల్లా కాదంటూ వ్యాఖ్యానించింది. దేశంలో ఎవ్వరూ నిర్వహించనంత పారదర్శకంగా ఇంటర్వ్యూలు నిర్వహించాం. అర్హులకు ఉద్యోగాలు దక్కేలా చేయడం కోసం అహరహరం శ్రమించి విజయం సాధించాం,’’ అని చక్రపాణి అన్నారు.