తెలంగాణలో అధికారపక్షానికి కళ్లెం వేసేందుకు భారతీయ జనతాపార్టీ దూకుడు ప్రదర్శిస్తుండగా, కాంగ్రెస్ మాత్రం రాష్ట్ర సారథి ఎంపిక విషయంలోనే తర్జనభర్జన పడుతోంది. ఈ పదవి కోసం కనీసం పది మంది ప్రముఖులు పోటీ పడుతూ అధిష్ఠానం వద్ద వారివారి ప్రయత్నాలలో ఉన్నారు. ఇటీవల హైదరాబాద్ లో నాలుగు రోజులు మకాం వేసిన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మణిక్కం ఠాకూర్ పీసీసీ అధ్యక్షుడి ఎంపికకు సంబంధించి నాయకుల నుంచి అభిప్రాయాలు సేకరించి అధిష్ఠానానికి అందచేసిన సంగతి తెలిసిందే. నాయకులు, ఆశావహులు తమ అభిప్రాయాలు తెలియజేస్తూనే సాధ్యమైనంత వరకు ఏకాభిప్రాయం మేరకు అధ్యక్షుడిని నియిమించాలని కోరారు. అయినా కొందరు నాయకులు ఢిల్లీలో మకాం వేశారని సమాచారం
ఆశావహుల జాబితా:
.పీసీసీ ప్రస్తుత కార్యనిర్వాహక అధ్యక్షులు రేవంత్ రెడ్డి (ఎంపీ), పొన్నం ప్రభాకర్ (మాజీ ఎంపీ)తో పాటు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఎంపీలు వి.హనుమంతరావు, మధుయాష్కీ, శాసనసభ్యులు శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, ఎమ్మెల్యే మర్రి శశిధరరెడ్డి ఈ పదవి ఆశిస్తున్నారు.
రేవంత్ రెడ్డికి పార్టీ పగ్గాలు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయని మొదట నుంచి ప్రచారం జరుగుతుండగా, ఆయన అభ్యర్థిత్వాన్ని ఎక్కువ మంది వ్యతిరేకిస్తున్నారు. ఆది నుంచి పార్టీలో ఉన్నవారు ఆ పదవిని ఆశిస్తున్నారు. అలా ఇవ్వడానికి కుదరకపోతే తాము సూచించిన వారికి అవకాశం ఇవ్వాలంటున్నారే కానీ రేవంత్ రెడ్డి ప్రస్తావన తేవడంలేదంటున్నారు.
రేవంత్ పై వీహెచ్ గుర్రు:
మరీ ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా చేసిన వి.హనుమంతరావు ఎంపీ రేవంత్ రెడ్డి అభ్యర్ధిత్వాన్ని బాహాటంగానే వ్యతిరేకిస్తున్నారు. ఆ మధ్యకాలంలో మిర్యాలగూడ సభలో ఇద్దరూ వేదికపైనే మాటలు రువ్వుకున్నారు. నిన్న గాక మొన్న పార్టీలోకి వచ్చి నేరుగా పీసీసీ పీఠం కావాలనడం సరికాదని, అలాంటి వారితో పనిచేయడం కుదరదని వీహెచ్ మీడియా ముందే తేల్చి చెప్పేస్తున్నారు. చిన్నపాటి ఉద్యోగానికే అభ్యర్థి చరిత్రను పరిశీలి స్తారని, అలాంటిది పార్టీలో సీనియర్లను కాదని ఇతర పార్టీ నుంచి వచ్చిన వారిని ఎలా ఆమోదిస్తామని ప్రశ్నించారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి వాదన కూడా ఇంచుమించు అలాగే ఉంది. అర్హతల ప్రాతిపదికగా, ఏకాభిప్రాయంతో చేసే ఎంపికను హర్షిస్తామని, అందుకు భిన్నంగా జరిగితే తమ అభిప్రాయాలు తమకు ఉంటాయని ఒక మీడియాతో ముచ్చటిస్తూ అన్నారు. డబ్బుతో పదవి కొనాలనుకోవడం సాధ్యం కాదని, ఒకవేళ అధిష్ఠానం అలాంటి వారివైపే మొగ్గు చూపితే భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని అన్నారు.
ఇది చదవండి: తెలంగాణ పీసీసీపై తర్జనభర్జన
ఒకరికి ఒకే పదవి…
ఈ వివాదానికి తెరదింపాలంటే `ఒకరికి ఒకే పదవి`అనే నిబంధన తెస్తే బాగుం టుందని పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులు అభిప్రాయపడుతున్నారు.అవి ఎంపీ, సీఎల్సీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కావచ్చంటున్నారు. ఈ లెక్కన ఆశావహుల జాబితా నుంచి ఆరుగురు పక్కకు వెళ్లినట్లవుతుంది.ఇది సలహాగా బాగుంటుందేమో కానీ పార్టీని గెలుపు తీరంవైపు నడిపించేందుకు సరిపోదని అంటున్నారు. అటు అధికారపక్షాన్ని,ఇటు బలం పుంజుకుంటున్నబీజేపీని ఎదుర్కొనేందుకు గట్టి సారథి కావాలని అధిష్ఠానం ఆలోచనగా ఉందని,అందుకే ఆచితూచి అడుగులు వేస్తోందని అంటున్నారు.
ఇది చదవండి: టీపీసీసీ అధ్యక్షుడి ఎన్నిక: ఏకాభిప్రాయం కుదిరేనా?
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికార పక్షం తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) కు సవాల్ విసురుతూ ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు దూసుకు పోతుంటే, కాంగ్రెస్ నాయకులు పీసీసీ పీఠం కోసం కోసం పెనుగులాడడం ఆ పార్టీ ప్రతిష్ఠను మసకబారుస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ వైఖరి పట్ల పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి రేగుతుండగా, అధిష్ఠానమే తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర పీసీసీ పదవి కోసం పైరవీలకు ప్రయత్నిస్తున్నవారిని కట్టడి చేయడానికి హస్తినకు రావద్దని చెప్పే పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.
రేవంత్ రెడ్డి ప్రస్తుతం పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఉన్నారు కనుక సహజంగానే పదోన్నతి ఉంటుందనుకుంటున్నారు. అదీకాకుండా, ఆయన తెలుగుదేశ పార్టీ నుంచి `హస్తం` నీడకు చేరే సమయంలోనే భవిష్యత్ లో మంచి పదవి దక్కేలా హామీ పొందారని చెబుతున్నారు. ఆయన అభ్యర్థిత్వం విషయంలో ఇతర నాయకుల మాటెలా ఉన్నాకోమటిరెడ్డి వెంకటరెడ్డి, హనుమంతరావు, జగ్గారెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అధిష్ఠానవర్గం ఇష్టపూర్వకంగా నిర్ణయించిన వారు ఎవరైనా అంగీకరిస్తానని, అలాకాకుండా డబ్బుతో పదవి కొనుక్కోవాలనుకుంటే ఒప్పుకునే ప్రసక్తి లేదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.
ఇది చదవండి: ఢిల్లీకి రావాలని రేవంత్ రెడ్డికి పిలుపు