నేను పుట్టిన మరుక్షణం నుంచీ
కాలం నాతోనే వుంది.
అంతకు ముందు కూడా
ఉందేమో తెలియదు.
నిజానికి
కాలం ఒక కదలిక
మార్పు కలిగినప్పుడల్లా
అనుభూతమయ్యే తికమక,
మొగ్గను
పువ్వుగా చీలుస్తున్న కాలరేఖ.
గడియారంలోని కాలం
అందరిది కావచ్చు గాని
ఒకరకంగా
ఎవరి కాలం వారిదే.
వారి వారి కాలాల నిర్ధారణ
గడియారంలో పట్టని నిష్కారణ.
ముల్లు ఆగేది కాదు
అసలు ఎక్కడ ఆగాలో
దానికి తెలియదు.
గడియారంలో గంటల సంగీతం
ఏ భావనకు సంకేతమౌతుందో
ఊహించడం కష్టం
కాలమూ శరీర ఘటనలూ
కలిసిపోయిన ఉద్రిక్త క్షణం
అదొక నైష్పత్తిక జీవకణం.
హాస్పిటళ్లలో, జైళ్లలో
క్షణమొక యుగమౌతుంది.
ఆనంద కుటిలో మాత్రం
త్రుటిగా ఎగిసి పోతుంది.
అప్పుడప్పుడు
కాలం కదలదు
గాలికీ కాలానికీ
జరిగే అనుసంధానం
కళ్లకు కనపడదు.
కాలం
ఒక రహస్యేంద్రజాలం
ఎప్పుడెవరికి తగుల్తుందో
తెలియని గాలం.
స్నేహితుడా!
కాలాన్ని బంధించే ప్రయత్నమే
ఈ కవితకు మూలం.
Also read: మారాము
Also read: మా ఊరు తప్పిపోయింది
Also read: ఒక రోజు
Also read: ప్రేమ తత్త్వం
Also read: పరామర్శ