My Confession
————————-
By Leo Tolstoy
————————
నా సంజాయిషీ
——————–
లియో టాల్స్టాయ్
————————–
తెలుగు అనువాదం:
డా. సి. బి. చంద్ర మోహన్
డా. బి. సత్యవతీ దేవి
చాప్టర్ 16
————–
నేను చేరిన మతంలో, అంతా సత్యమే లేదని — ఏ మాత్రం సందేహించకుండా ఒప్పుకున్నాను. ఇంతకు ముందు అయితే అదంతా అబద్ధం అనేవాడిని. ఇప్పుడు అలా చెప్పలేకపోతున్నాను. ప్రజలందరూ సత్యంపై జ్ఞానం కలిగి ఉన్నారు. లేకపోతే వారు జీవించగలిగే వారు కాదు. పైగా ఆ జ్ఞానం నాకు అందుబాటులో ఉంది. ఎందుకంటే — అది నా భావనలో ఉంది. నేను దానిపై జీవించాను. కానీ దానిలో సత్యదూరమైనవి ఉన్నాయని చెప్పడానికి నేనేమాత్రం సందేహించడం లేదు. ఇంతకు పూర్వం ఏదైతే నేను తిప్పి కొట్టానో అదే ఇప్పుడు నాకు స్పష్టంగా కనబడుతోంది. చర్చి ప్రతినిధుల కన్నా రైతుల్లో కొంత తక్కువ అబద్ధం అనేది సత్యంతో కలిసి ఉన్నదని నేను అనుకున్నాను. ప్రజల నమ్మకంలో కూడా కొంత అసత్యం — సత్యంతో కలిసి ఉన్నదని నేను గ్రహించాను.
కానీ సత్యం ఎక్కడినుండి వచ్చింది? అసత్యం ఎక్కడినుండి వచ్చింది? అబద్ధమూ, సత్యమూ — రెండూ కూడా — పవిత్రమైన ఆచారాలు అనుకునే వాటిలోనూ, గ్రంథాల్లోనూ కనిపిస్తాయి. అబద్ధము, సత్యము — రెండూ చర్చి ద్వారానే తర్వాతి తరాలకి అందజేయబడుతున్నాయి.
Also read: అన్ని మతాలలో ప్రలోభం
నాకు నచ్చినా , నచ్చకపోయినా — ఈ రచనలను, ఆచారాలను చదివి పరిశోధన చేయాలనుకున్నాను.(ఇప్పటివరకు వాటిని పరిశోధించడానికి చాలా భయపడ్డాను)
అనవసరంగా ద్వేషంతో — నేను ఇంతకు పూర్వం తోసిపుచ్చిన తత్వశాస్త్రాన్ని మరలా పరిశీలించ సాగాను. ఇంతకుముందు స్పష్టంగాను, తెలివిగాను ఉన్న జీవన వ్యక్తీకరణలు నా చుట్టూ ఉన్నప్పుడు — అవి అన్నీ అనవసరమైన అసంబద్ధతలు అనిపించింది; ఇప్పుడు, ఆరోగ్యకరమైన మనసులోకి అనవసరపు ఆలోచనలు రాకుండా తోసి పుచ్చినందుకు నేను చాలా ఆనంద పడి ఉండి ఉండాలి. కానీ నాకు ఇంకో దిక్కు లేకపోయింది. దీని మీదనే మత సిద్ధాంతం నిలబడి ఉంది (లేక) నేను కనిపెట్టిన జీవితార్థపు జ్ఞానము దీనితో విడదీయరానంతగా కలిసిపోయింది. ప్రాచీనమైన, దృఢమైన నా మనస్సుకి ఇది ఎంత అసహజంగా తోచినా గాని — ఇది ఒకటే మోక్షానికి ఆశ. దీనిని అర్థం చేసుకోవడానికి బహు జాగ్రత్తగా, శ్రద్ధగా పరిశీలించాలి. నేను సైన్స్ యొక్క ప్రతిపాదనలు అర్థం చేసుకున్నట్లుగా కాదు: నేను దానిని కోరుకోవడం లేదు, మత జ్ఞానం యొక్క ప్రత్యేక గుణాన్ని బట్టి కూడా నేను దానిని కోరుకోను. ప్రతీ దాని యొక్క వివరణ కూడా నేను కోరను. ప్రతీ దాని వివరణ — ప్రతీ దాని ప్రారంభం లాగానే — అనంతంలో దాచబడి ఉంటుందని నాకు తెలుసు. తప్పనిసరిగా వివరించలేని స్థితికి తీసుకురాబడేటట్లు నేను అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. వివరించలేనిది ఏదైనా ఉంటే అది నేను గుర్తిస్తాను — నా హేతువు యొక్క డిమాండ్లు తప్పు అని కాదు (అవి సరైనవే. అవి లేకుండా నేను ఏదీ అర్థం చేసుకోలేను) — నా మేధస్సుకు ఉన్న పరిమితులు నేను గుర్తించాను కాబట్టి, వివరించలేనిది ఏదైనా ఉంటే, దానిని అలాగే అర్థం చేసుకోవాలని నా కోరిక. అంతేగాని ఏకపక్షంగా, విధిగా నమ్మాలని కాదు.
Also read: బ్రతకడానికి విశ్వాసం అవసరం
బోధనలో సత్యం ఉంది అనేది నిస్సందేహం. అలాగే అసత్యం కూడా ఉందనేది ఖచ్చితం. సత్యం ఏది? — అసత్యం ఏది? అనేది నేను కనుగొనాలి. ఆ రెండింటిని విడదీయాలి. నేను ఆ పని మీదే ఉండదలుచుకున్నాను. బోధనలో నేను కనుగొన్న అసత్యమేదో, సత్యమేదో, నేను ఏ ముగింపుకు వచ్చానో — అవన్నీ ఈ తర్వాత చేసే భాగాలలో వస్తాయి. అవి విలువైన వైతే, ఎవరైనా కావాలని కోరితే, ఏదో ఒక రోజు ఎక్కడో అక్కడ ముద్రింపబడతాయి.
లియో టాల్స్టాయ్ 1879
Also read: జీవిత అవగాహన అసత్యం కాదు
ముగింపు వచ్చే వారం
———— ———– ————