అమెరికా ఖండంలోని అట్లాంటిక్ మహా సముద్రం నుండి, పసిఫిక్ మహా సముద్రం వరకు ఉన్న అతి పెద్ద దేశం అమెరికా. యాభై గణతంత్ర రాజ్యాలుగా విస్తరించి ప్రపంచంలో అతిపెద్ద విస్తీర్ణం కలిగి 32 కోట్ల జనాభా కలిగిన దేశం అమెరికా. మరో ఐదు రోజుల్లోనే గద్దె దిగనున్న అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రజాస్వామ్య వ్యవస్థకు పీఠమైన క్యాపిటల్ హౌస్ పై తన మద్దతు దారులను దాడికి ప్రేరేపించి ముగ్గురు పౌరుల, ఒక పోలీసు అధికారి మరణానికి కారణమయ్యారు. అధికార పీఠాన్ని వదలకుండా ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటెటీవ్స్) నుండి రెండు సార్లు అభిశంసనకు గురయ్యారు. ప్రపంచంలో అగ్రదేశంగా పేరు గాంచిన అమెరికా పరువును బజారున పడేశారు. రాజ్యాంగం ఆదేశాలను తన చేతుల్లోకి తీసుకొని ఇష్టారాజ్యాంగా వ్యవహరించడం వల్ల తన సొంత పార్టీ రిపబ్లికన్ నుండి కూడా తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొని ప్రపంచ దేశాలు నివ్వెర పోయేలా చేశారు. ఒక బిజినెస్ మెన్ దేశ అధ్యక్షుడు అయితే జరిగే అనర్థాలు వ్యాపార దృక్పథంలో ఎదుటి వాడిని దెబ్బ తీసే వ్యూహాలను ఏకంగా అగ్ర రాజ్యం నేతలపై ఎక్కు పెట్టడం వల్ల అమెరికా పరువు హడ్సన్ నదిలో కలిసింది. ఒక వైపు కరోనా తో పిట్టల్లా రాలిపోతున్న జనం, దేశంలో శాంతి భద్రతలు క్షీణించడం, మరో వైపు ఈనెల ఇరవైన అధికార బదిలీ జరగనున్న తరుణంలో దేశంలో ఎమర్జెన్సీ ఛాయలు నెలకొనడం అమెరికా పౌరుల్లో ఆందోళన కు దారి తీస్తున్నాయి.
ఇది చదవండి: ట్రంప్ అభిశంసనకు ఆమోదం తెలిపిన ప్రతినిధుల సభ
అంతర్యుద్ధం, ఉగ్రవాదుల దాడి తర్వాత పెద్ద కుదుపు:
గ్రేట్ బ్రిటన్ నుండి 3 సెప్టెంబర్ 1783 లో స్వాతంత్రం పొందిన దగ్గరి నుండి ఇలాంటి గడ్డు పరిస్థితి అమెరికా ఏనాడు ఎదుర్కొనలేదు. పోకిరీ వ్యవహారంతో ట్రంప్ చేస్తున్న వెకిలి చేష్టల వల్ల అధికార బదిలీ లో ఎన్ని అపశ్రుతులు ఎదుర్కొననున్నామో అని అమెరికా ప్రజాస్వామ్య వాదులు ఆందోళన చెందుతున్నారు. ప్రచ్ఛన్న యుద్ధం ముగిశాక సోవియట్ యూనియన్ పతనం తరువాత ప్రపంచ దేశాలకు పోలీసై కూర్చున్న అమెరికా ను బిన్ లాడెన్ వణికించాడు. అమెరికా లోని న్యూయార్క్ ట్విన్ టవర్స్ పైన, 11 సెప్టెంబర్ 2001 న ఇస్లామిక్ ఉగ్రవాదులు దాడి చేసి అగ్రరాజ్యానికి ముచ్చెమటలు పట్టించారు. నాలుగు ప్రయాణికుల విమానాలను పెంటగాన్, పెన్సిల్వేనియా, ట్విన్ టవర్స్ వైపు హైజాక్ చేసి ఆ విమానాలతో విధ్వంసం సృష్టించి మూడు వేల మందిని ఆహుతి చేశారు. బిన్ లాడెన్ అంతమయ్యే వరకు అమెరికా భయబ్రాంతులకు లోనయ్యింది.
‘విద్రోహ’ అధ్యక్షుడు:
అమెరికా సంయుక్త రాష్ట్రాల ఐక్యత కోసం జరిగిన అంతర్యుద్ధం 1861 నుండి 65 వరకు సాగిన తరువాత అంతటి ప్రకంపనలను 2001 లో బయటి నుండి అమెరికా కు ఎదురయ్యాయి. అంతర్యుద్ధంనాటి అధ్యక్షుడు అబ్రహం లింకన్ బానిసత్వ విమోచన కోసం పోరాడి మరణించారు. అబ్రహం లింకన్ రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష పీఠం అలంకరించి బానిసత్వాన్ని రూపుమాపితే అదే రిపబ్లికన్ నుండి ఎంపికైన అధ్యక్షుడు ట్రంప్ తన అనుచరుల చేత క్యాపిటల్ హౌస్ ను ముట్టడించి ‘విద్రోహ అధ్యక్షుడి’గా చరిత్ర పుటలలోకి ఎక్కాడు. ప్రపంచ దేశాల్లో ఆఫ్రికాను పక్కకు పెట్టి, మెక్సికన్లను రేపిస్ట్ లుగా, ఐరోపా నేతలను బలహీనులుగా ముద్ర వేసి, దూకుడుగా వ్యవహరించి ఆసియా దేశాలతో గిల్లి కజ్జాలు పెట్టుకున్న ఘనత ట్రంప్ ది.
ఇది చదవండి: అమెరికాలో ఎమర్జెన్సీ
ఓడినా గెలుపు నాదేనంటూ బుకాయింపు:
పోతూ పోతూ ఓడినా కూడా గెలుపు నాదే అని కోర్టు మెట్లు ఎక్కి కాబోయే అధ్యక్షుడు జోబైడెన్ కు చుక్కలు చూపించాడు. 270 పై చిలుకు ఎలక్రోరల్ కాలేజ్ ఓట్లు సాధించి మరో ఐదు రోజుల్లో అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కనున్న జో బైడెన్ గత అంతర్యుద్ధం ఛాయలు క్యాపిటల్ హౌస్ పై కనబడడంతో కలవరపడ్డారు. అమెరికా క్యాపిటల్ భవనంపై అరాచక శక్తులు దాడి చేసిన సమయంలో కన్ఫెడరేషన్ జెండా పట్టుకువచ్చిన ట్రంప్ అభిమాని ఆగడం ఇప్పుడు డెమొక్రాట్లకు పెద్ద ప్రశ్న అయి కుర్చుంది! శ్వేత జాతి ఆధిపత్యానికి, అమెరికా రాజకీయ సామాజిక రంగాల్లో శ్వేతజాతి వ్యతిరేకులు పట్టిన జెండాగా దాన్ని అభివర్ణిస్తున్నారు! క్యాపిటల్ భవనాల్లో ఆ జెండా మోసిన వ్యక్తి ఫోటోలను చూసి డెమొక్రాట్లు అమెరికా భవిష్యత్ పై ఆందోళన చెందుతున్నారు. జో బైడెన్ ముందున్న ప్రధాన సమస్య ల పరిష్కారానికి రిపబ్లిక్ లు కూడా మద్దతు తెలపడం విశేషం. ట్రంప్ అభిశంశనకు 231 ఓట్లు వచ్చాయి. రిపబ్లికన్లు కూడా అభిశంసనకు ఓటేయడం విశేషం.
ఇది చదవండి: పుట్టింటిలోనే ప్రజాస్వామ్య అపహాస్యం
చైనా, పాక్ లకు బైడెన్ స్నేహహస్తం?
అమెరికా 46 వ అధ్యక్షుడిగా 20 ఫిబ్రవరి 2021న జోబైడెన్ ప్రమాణం చేయబోతున్నారు. 2009 నుండి 2017 వరకు అమెరికా ఉపాధ్యక్షుడిగా అపార అనుభవం గడించిన ఈ డెబ్భై ఏడేళ్ల రాజకీయవేత్తకు ఎన్నో సవాళ్లు ఎదురు కాబోతున్నాయి. పాకిస్థాన్, చైనాలతో మైత్రి దిశగా కొత్త అధ్యక్షుడి ప్రయాణం ఉంటుందనీ, తద్వారా ముస్లిం దేశాల్లో పోయిన అమెరికా పరువును కాపాడే ప్రయత్నం చేస్తారనీ అంటున్నారు. చైనా దూకుడు కు కళ్లెం వేయడానికి స్నేహహస్తం అందించి మక్కువ చేసుకునే బైడెన్ ఆలోచనలకు భారత్ ఎలా స్పందిస్తుంది? భవిష్యత్ లో భారతీయ విద్యార్థులు, ఉద్యోగస్తులు విషయంలో బైడెన్ తీసుకునే చర్యలపై కూడా ఉత్కంఠ నెలకొంది. అయితే అమెరికా ఉపాద్యక్షురాలుగా ఎంపికైన కమల హ్యారీస్ ఇండో భారత సంతతికి చెందిన వ్యక్తి కావడం కొంత ఊరట. ఇక కరోనా ఉదృతికి అడ్డుకట్ట వేయడానికి టీకా ను పంపిణీ సత్వరం చేయడం బైడెన్ ముందున్న తక్షణ సమస్య. అమెరికా లోని చాలా నగరాల్లో లాక్ డౌన్ ప్రకటించి కరోనా నివారణ కు నడుం బిగించే ఆలోచనల్లో బైడెన్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అంతర్జాతీయ విమానాల పై ఆంక్షలు విధించారు. పోయిన అమెరికా పరువును పునరుద్ధరించి, పునర్వైభవం తీసుకు రావడానికి బైడెన్ తీసుకునే చర్యల కోసం ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.