Monday, January 6, 2025

నిజమైన ప్రేమ …

కథ

సింగపూర్ లో ఫ్లైట్ దిగగానే శ్రీకర్ సావిత్రి అనుష్కలను హోటల్ మదీనాకు తీసుకు వెళ్ళాడు.  ‘ఐ బాబోయ్  కదా ఇది’ అని పాట పాడింది సావిత్రి పరవశంతో తన శ్రీవారిని చూస్తూ తాము బసచేసే హోటల్ గదిలోకి అడుగు పెడుతూనే. అను తల్లి ‘‘చూసావా సింగపూర్ మహిమేనా ఇది’’ అన్నాడు కొంటెగా తన కూతురు అనుష్కకు జోకొడుతూ శ్రీకర్.  ‘‘ఈ హోటల్ లోమనకు కావలసిన  వెజిటేరియన్ దొరకదు’’ అని అన్నాడు శ్రీకర్ సావిత్రితో. వారు వుండే హోటల్ నుండి ఒక అరగంట నడిచి వెళ్లే అంత దూరంలో మధ్యాహ్నానికి వారిరువురికి కావలసిన భోజనానికి  ఒక రెస్టారెంట్  ను వెతికి  దారి చూపించాడు శ్రీకర్ సావిత్రికి. ఆరోజు రాత్రికి శ్రీకర్ తమ భోజనానికి అన్నలక్ష్మికి టాక్సీలో తీసుకువెళ్ళాడు వాళ్ళని. రోజూ సాయంత్రం భోజనానికి నేను ఆఫీస్ నుండి రాగానే ఇక్కడికె వద్దాము అని చెప్పాడు సావిత్రితో.

శ్రీకర్ మరుసటి రోజు  ఉదయాన్నే ఆఫీస్ కి వెళ్ళాడు. భర్త వెళ్ళగానే కూతురు లేవడానికి మునుపే తన పనులన్నిటినీ ముగించుకుని తయారయింది సావిత్రి.  అనుష్క లేవగానే స్నానం చేయించింది. నెమ్మదిగా స్ట్రోలర్లో అనును కూర్చోబెట్టి హోటల్ నుండి బయటకు వచ్చింది.  శ్రీకర్ చూపించిన దారిని గుర్తు చేసుకుంటూ నడిచి వెళ్లి తమకు కావలసిన భోజనాన్ని తెచ్చుకుంది సావిత్రి.

ఓ ఆదివారం  అన్నలక్ష్మి నుండి వారు భోజనం ముగించి బయటకురాగానే పట్టపగలే మెరిసే ఎత్తైన భవంతులను చూసి ఆర్చర్యపోయింది సావిత్రి.  వాటిని  ఆకాశం నుండి భూమిపైకి  వేళ్ళాడే శిఖరాలుగా తలపోసింది సావిత్రి. వాటి నడుమ నీరు ఇంకని కాలిబాటలు పలకరించాయి వారిని.  ఆ కాలి బాటలో వీచే చల్ల గాలిలో నడుస్తున్నారు వారు.  ‘‘సావిత్రీ,  భార్యగా నువ్వు ఎమి త్యాగం చేశావు నాకోసం?’’ అని అడిగాడు శ్రీకర్.  మాటలు కరువై చూస్తున్న సావిత్రిని శ్రీకర్ మళ్ళీ అడిగాడు, ‘‘అదే భార్యలు తమ భర్తల  కోసం త్యాగాలు చేస్తారని అంటారుకాదా! నువ్వేం చేశావు?’’ అని అడిగాడు. శ్రీకర్ అడిగిన  ప్రశ్నకు సావిత్రి తానేమి త్యాగం చేయలేదని  చెప్పకనే చెప్పే తన కళ్ళతో శ్రీకర్ కళ్లలోకి చూస్తూ నిలబడిపోయింది.  ఇంతలో స్ట్రోలర్ లో కూర్చున్న అను గుక్కపెట్టి ఏడిచింది. అనును తన భుజాన ఎత్తుకుని సముదాయిస్తూ ముందుకు వడివడిగా వేసే శ్రీకర్ అడుగులలో తన అడుగులను కలిపి వేస్తుంది సావిత్రి.  అలా శ్రీకర్ వెనక వేసిన తన తొలి నాటి అడుగుల జ్ఞాపకాల లోగిళ్లను గుర్తుచేసుకుంటుంది సావిత్రి.

Also read: బాయ్ కాట్ …?!

ముహూర్తం టైం అవుతోంది. పెళ్ళి పీటలపైకి పెళ్ళి కుమార్తెను తీసుకురమ్మన్నాడు  పురోహితుడు. వనజమ్మ తన తోటి పరివారంతో పెళ్ళి కుమార్తె గదిలోకి వెళ్ళింది. సావిత్రి కట్టుకున్న చీరను చూసి ‘‘ఈ చీర ఎందుకు  కట్టుకున్నావు?’’ అని ప్రశ్నించింది సావిత్రిని వనజమ్మ. ‘‘ఇది మా అమ్మమ్మ పెట్టిన చీర’’ అని మురిపెంగా అన్నది సావిత్రి. ‘‘పీటలపై నేను పెట్టె చీరనే నువ్వు కట్టుకుని రావాలి’’ అని ఆజ్ఞాపించింది వనజమ్మ.  ‘‘వాళ్ళు కట్టుకోమన్నదే కట్టుకొమ్మా’’ అని జానకమ్మ నచ్చచెబుతుంది సావిత్రికి. సావిత్రి తన తల్లి చెప్పిన మాట విని  అత్తగారు పెట్టిన చీరను కట్టుకుని వచ్చింది. జ్యోతుల పళ్ళెము పట్టుకుని నిలబడివున్న సావిత్రి పక్కగా జానకమ్మ నిలుచున్నది. జానకమ్మని వనజమ్మ పక్కకు నెట్టి పద అని సావిత్రికి చెప్పింది. సావిత్రి నెమ్మదిగా మండపం దగ్గరకు వెళ్లే దిశగా వనజమ్మతో కలసి నడిచింది. అప్పటి దాకా తన ముఖంపై మెరుస్తున్న చిరునవ్వును ఎవరో లాక్కెళ్లిన అనుభూతిని పొందింది సావిత్రి.

పురోహితుడు చదువుతున్న మంత్రాలు సావిత్రి  చెవిన పడుతున్నాయి.  ఆ క్షణంలో సావిత్రికి తన పక్కన కూర్చున్న శ్రీకర్ పెద్ద సాగర గర్భంలో… పెండ్లి పీటలపై కూర్చున్న వాడిలా కనిపిస్తాడు. తలంబ్రాలు పోయమని అందరు అరుస్తున్నారు. తాను శ్రీకర్ తలపై తలంబ్రాలు పోయబోయింది సావిత్రి. శ్రీకర్ ని అందరు పట్టి పైకి ఎత్తేసారు ఆ క్షణ లో. సావిత్రి తన దోసిటలో వున్న తలంబ్రాలను శ్రీకర్  తలపై పోయలేక  నేలపై పోసింది. ఒక్కసారిగా అందరు గేలిగా నవ్వారు సావిత్రిని చూసి. సావిత్రిని లేచి నుంచుని తలంబ్రాలు పోయమని మగపెళ్ళి వారు అరిచారు. సావిత్రి లేచి నుంచుని తలంబ్రాలు శ్రీకర్ తలపై పోయబోయింది. మగపెండ్లి వారు చేసే హడావిడికి సావిత్రి పీటలపై జారీ పడబోయింది. 

శ్రీకర్  సావిత్రి కాళ్లకు మెట్టెలు పెడుతున్నాడు. ‘‘నా కొడుకు మగవాడు నీకాళ్ళు తాకేదేమిటి’’ అని వనజమ్మ అడ్డుకుంటుంది శ్రీకర్ ని మెట్టెలు పెట్టకుండా.  వనజమ్మ పెండ్లి కొచ్చిన ఓ ముత్తైదువచేత్తో సావిత్రికి మెట్టెలు పెట్టిచ్చింది. చుట్టూ ఉన్న మగపెండ్లి వారు సందడిచేస్తున్నారు. పురోహితుడు గట్టిగా మేళం అన్నాడు. సావిత్రి  మెడలో తాళి పడింది  సంసారం సాగరం అన్న ఓ కవి మాటలు గుర్తుకొచ్చాయి ఆ క్షణంలో … సావిత్రికి!

కాసేపటికి గట్టిగా అరుపులు వినిపిస్తున్నాయి మగపెండ్లి వారి విడిది నుండి. ఆడ పెళ్ళివారంతా హడావిడిగా మగ పెళ్ళి వారిదగ్గరకు పరుగులు తీశారు.  అక్కడ  పెండ్లికొచ్చిన మామ్మ గారు బాత్ రూమ్ లో జారీ పడిపోయారు. ఆమె పడిపోవడానికి కారణం ఆడ పెళ్ళివారే అని వనజమ్మ మొగుడు కాంతయ్య చంద్రయ్యపై అగ్గిలం మీద గుగ్గిలం అయ్యాడు. కాంతయ్యను సముదాయించడానికి చంద్రయ్య చివరికి కాంతయ్య  కాళ్ళు పట్టుకున్నాడు. చంద్రయ్య మామ్మను కల్యాణ మండపం పక్కనే ఉన్న ఆసుపత్రికి తీసుకు వెళ్ళాడు. మామ్మ తిరిగి క్షేమంగా కల్యాణమండపం తిరిగి వచ్చేవరకూ  తాము పచ్చి గంగైనా ముట్టం అని శపథం చేసింది వనజమ్మ. 

పెళ్ళి కోసం వనజమ్మ చెప్పిన అన్నిరకాల వంటకాలు చేయించింది జానకమ్మ. జానకమ్మ చంద్రయ్యలకు సావిత్రి ఒక్కగానొక్క కూతురు. శ్రీకర్ సాఫ్ట్ వేర్ ఉద్యోగస్థుడు. అందునా పట్నం సంబంధం. తన కూతురుని బాగా చూసుకుంటారు అని వాళ్ళు ఏది అడిగినా కాదనలేదు చంద్రయ్య. మగపెళ్ళి వారి ప్రతిజ్ఞకు జంకి ఆడపెళ్ళివారు కూడా మిన్నకుండిపోయారు. పెళ్ళికి  చేసిన భోజన పదార్థాలు అన్ని చెత్త కుప్పలో పడేసింది జానకమ్మ. అర్ధరాత్రికి వనజమ్మకు ఆకలి వేసి కేకలు పెట్టింది. ఏమైందని జానకమ్మ వెళ్లి అడుగుతుంది వనజమ్మను. షుగర్ డౌన్ అయింది నీవల్లే అని జానకమ్మపై రంకెలు వేసింది వనజమ్మ.

Also read: అభ్యుదయ సీత

వంటవాళ్ళనులేపి మళ్ళీ మగ పెళ్ళి వాళ్లకు ఫలహారాలు చేయించి పెట్టింది జానకమ్మ. ఇంతలోతనకు మంచి నీళ్లు అందిస్తున్న సర్వర్ని ‘‘చేత్తో అందిస్తావా ట్రెతో కాకుండా నాకు’’ అని సర్వర్ ని కసిరాడు కాంతయ్య. మంచినీళ్లు నేలకు విసిరి కొట్టాడు. ‘‘మేము ఉండేది పల్లె. ఇక్కడ వీళ్లకు పట్నం నాగరికతలు పూర్తిగా తెలియదు’’ అని  చంద్రయ్య కాంతయ్యతో చెప్పాడు. కొత్త ట్రే తెప్పించి మంచినీళ్ల గ్లాసును అందులో ఉంచి  తాగమని కాంతయ్యను చంద్రయ్య బతిమాలాడాడు. నాలుగు రోజులకి ఆసుపత్రి నుండి పడిపోయిన మామ్మ తిరిగి క్షేమముగా వచ్చింది విడిది ఇంటికి. విడిది వారింట శ్రీకర్ చేతిలో సావిత్రి చేయిని ఉంచి అప్పగింతల కార్యక్రమం పూర్తి చేశారు జానకమ్మ చంద్రయ్యలు.

సావిత్రి…సావిత్రి… అంటూ వనజమ్మ గట్టిగా కేకలు పెట్టింది వంట గది నుండి. ముంగిట్లో ముగ్గు పెడుతున్న వనజమ్మ కేకలు విని అదిరి పడింది సావిత్రి. భయపడుతూనే .. ముగ్గు చిప్ప తన చేత పట్టుకుని ఇంట్లోకి పరుగుతీసి వనజమ్మ ఎదురుగ్గా నిలబడింది సావిత్రి. ‘‘నీ మొగుడెక్కడ?’’ అని రంకె వేస్తుంది సావిత్రిపై వనజమ్మ. వనజమ్మ హడావిడికి ముసుగుదన్ని పైన గదిలో నిద్ర పోతున్న శ్రీకర్ పరుగున వచ్చాడు కిందికి. ‘‘ఈ గిన్నెలు చూడు’’ అని సావిత్రి తోమిన గిన్నెల్ని శ్రీకర్ కి చూపించింది వనజమ్మ.  శ్రీకర్ గిన్నెలు వైపు తేరిపారా చూశాడు.  ‘‘గిన్నెలు భలే మెరుస్తున్నాయి’’ అన్నాడు శ్రీకర్ వనజమ్మతో.  ‘‘మెరుపు రా…! అవును… జిడ్డు మెరుపు’’ అని అరిచింది వనజమ్మ. ఆ అరుపుకి శ్రీకర్ ‘‘అమ్మ చెప్పినట్లు మెరవకుండా తోమడం నేర్చుకో…’’ అని సావిత్రి వైపు తిరిగి చెప్పి అక్కడనుండి జారుకుంటాడు.

ఓ రోజు వనజమ్మ తాను షాపింగ్ కి వెళుతూ సాయంగా రమ్మని సావిత్రిని పిలిచింది. నువ్వు కూడా నీకు నచ్చినవి కొనుక్కోమని సావిత్రికి శ్రీకర్ డబ్బులు ఇచ్చాడు. సావిత్రి శ్రీకర్ ఇచ్చిన డబ్బులని వనజమ్మకు ఇచ్చింది. షాపింగ్ చేసే సమయంలో వనజమ్మ ‘‘నీకు   అన్ని మేమె కొని ఇవ్వాళా? మీ పుట్టింటి నుండి ఏం తెచ్చుకోలేదా?’’ అంది సావిత్రితో. ఆ మాటలకు సావిత్రి కన్నీటి పర్యంతం అవుతుంది. ‘నాకు చిన్నప్పటి నుండి అన్నిీ అమ్మే చూసుకునేది. నాకేమీ వద్దు,’ అని ఏమీ కొనుక్కోకుండానే ఇంటికి తిరిగి వచ్చేసింది.

ఒకనాటి సాయంత్రం సావిత్రి ‘‘మిమ్మల్ని నాన్నను చేస్తాను త్వరలో’’ అని తియ్యగా శ్రీకర్ చెవిలో చెప్పింది. అది విన్న శ్రీకర్ అనందంతో ఉప్పోంగిపోయాడు. సావిత్రి  వేవిళ్ళతో బాధపడుతూ ఉంటుంది. ఏమి  తినలేకపోయేది. నీరసం వల్ల తూలి పడిపోతూ ఉండేది. ఓరోజు ఉదయాన్నే తూలిపడిపోతూ ఉన్న సావిత్రిని పట్టుకుంటాడు శ్రీకర్. ‘‘తినకపోతే ఇలాగే అవుతుంది. నీ ఆరోగ్యం క్షిణిస్తుంది. బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే నువ్వు బాగా బతినాలి’’ అని సావిత్రి పై కేకలు వేస్తాడు శ్రీకర్.

శ్రీకర్ ఉదయాన్నే ఆఫీసుకు వెళ్లిపోయేవాడు. మామగారు తినకుండా మనం తినకూడదు అని వనజమ్మ చెప్పేది సావిత్రికి. కాంతయ్య వనజమ్మలు వంట చేసుకుని వారి  భోజనం పూర్తి చేయడానికి రెండు గంటలు దాటేది. వారి భోజనం అయి గదిలోకి వెళుతూ త్వరగా మిగతాపని పూర్తి చేసి భోజనం చెయ్యమనేది సావిత్రితో  వనజమ్మ. సావిత్రికి నీరసం వల్ల సరిగ్గా పనిచేయలేక పోయేది. వనజమ్మ సావిత్రిని ‘‘తిండికి మహారాణి పనికి నాటకాల రాణి’’  అని తన మూతిని తిప్పుతూ సావిత్రిని సూటిపోటి మాటలు అనేది . 

సావిత్రి సొమ్మసిల్లి పడిపోయింది ఒకరోజు తనగదిలో. అక్కడే ఇల్లు తుడుస్తున్న పనిమనిషి రంగి అది చుసి బయటనుండి టిఫిన్ కొనుక్కొచ్చి ఇస్తుంది సావిత్రికి. నాటి నుండి సావిత్రి తన దగ్గర ఉన్న డబ్బులు రంగికి ఇచ్చిఉదయాన్నే పనికి వచ్చేటప్పుడు టిఫిన్స్ తెచ్చి పెట్టమని కోరింది.  ఒకనాడు రంగి తనకు ఒంట్లో బాగాలేక పనికి రాలేదు. సావిత్రి నెలల మనిషి పస్తులుండటం మంచిది కాదని తన భర్తతో పండ్లు ఇచ్చి పంపుతుంది రంగి. గోపన్న వెళ్లేసరికి వనజమ్మ పంచలో కూర్చుని ఉంటుంది. గోపన్న వనజమ్మ చూడకుండా ఏవో సైగలు చేసి చెప్పబోతాడు సావిత్రితో. గోపన్న చేసే సైగలను చూసి వనజమ్మసావిత్రిని  అపార్థం చేసుకుంటుంది. వంటింట్లో నుండి వస్తున్న సావిత్రి నెత్తిపై చెంబుతీసి కొట్టింది వనజమ్మ.

సావిత్రి ఎదురు తిరిగి వనజమ్మ చేతిలోని గిన్నె తీసుకుని నేలపైకి విసిరి కొడుతుంది. ‘‘నేను మిమ్మల్ని తిరిగి కొట్టడం ఎంతసేపు పడుతుంది’’ అని వనజమ్మను సావిత్రి హెచ్చరిస్తుంది. తనతో సావిత్రి ఆలా ఎదురుతిరిగి మాట్లాడటం చూసి నిర్ఘాంత పోయింది వనజమ్మ.

సాయంత్రం శ్రీకర్ రాగానే వనజమ్మ శ్రీకర్ ను  తన గదిలోకి తీసుకు వెళ్ళింది.  సావిత్రిపై వనజమ్మ ఉన్నవి లేనివి చెప్పినూరిపోసింది. శ్రీకర్ వనజమ్మ చెప్పిన మాటలు విని సావిత్రి పై అగ్గిలం మీద గుగ్గిలం అయ్యాడు. నమ్మకం లేని చోట తాను నిలబడలేనని శ్రీకర్ తో చెప్పి సావిత్రి ఇంటి గడప దాటింది.

శ్రీకర్ వెంట లేకుండా వచ్చిన సావిత్రిని చూసి జానకమ్మ చంద్రయ్యలు కలత చెందారు. కొంతకాలానికి సావిత్రి ఆడపిల్లను ప్రసవించింది. సావిత్రిని పుట్టిన బిడ్డను తీసుకుని వెళ్లి శ్రీకర్ కి అప్పజెప్పారు జానకమ్మ చంద్రయ్యలు. తమ కూతురు సావిత్రికి ఓర్పుగా ఉండమని చెప్పి తమ ఇంటి దిశ పట్టారు వారు. కరిగే కాలచక్రంలో శ్రీకర్ నెమ్మదిగా తనకు పుట్టిన బిడ్డ అనుష్క ముద్దు మురిపాలతో మురిసిపోసాగాడు.

శ్రీకర్ ఆఫీసు ట్రయినింగ్ నిమిత్తం సింగపూరు వెళ్లాల్సి వస్తుంది. సావిత్రినీ, కూతురినీ కూడా తీసుకుని సింగపూరు వెళతాడు. తనకు, తన భర్తకు మథ్య అలుముకున్న దూరాన్ని తరిమికొట్టాలని తలబోసింది సావిత్రి. 

ఒకరోజు శ్రీకర్ తన ఆఫీసునుండి వస్తూ ఉండగా కార్ యాక్సిడెంటుకు గురి అవుతుంది. ఆ యాక్సిడెంట్ లో శ్రీకర్ వెన్నుపూసకు బలంగా గాయమైంది. సావిత్రి శ్రీకర్ కి దగ్గరుండి ఉపచర్యలు చేసింది. శ్రీకర్ నడవలేకపోయాడు. అందువల్ల ఆఫీస్ పని ఇంటి నుండే చేసేవాడు. ఒక్కోసారి ఆఫీస్ పనిలో కూడా సావిత్రి శ్రీకర్ కి సాయం చేసేది. ఆరునెలలకు శ్రీకర్ నెమ్మదిగా లేచి నడవగలిగి కోలుకున్నాడు. శ్రీకర్ సావిత్రి సహనానికి కరిగిపోయాడు.

 ఓరోజు శ్రీకర్ ఆనందంతో సావిత్రిని దగ్గరకు తీసుకుంటాడు. సావిత్రి శ్రీకర్ కి దూరముగా జరిగి శ్రీకర్ ని తోస్తుంది. సావిత్రి చేసిన ఆ పనికి శ్రీకర్ నొచ్చుకున్నాడు. ‘‘ఆ రోజు నువ్వు నా తల్లిని ఎదిరించినప్పుడు నీపై అరిచానే కానీ నీ అనురాగాన్ని శంకించ లేదు. ఇదే విషయం తెలియచేశాను నాడు అమ్మకు. తాను చేసిన పొరపాటుకు అమ్మ  పశ్చత్తాప పడింది  కానీ, నువ్వు అప్పటికే మన ఇంటి గడప దాటేశావు. నీకై నిరీక్షించిన నా గుండెకి  తెలుసు నా వ్యథ’’ అని  వగచాడు శ్రీకర్ సావిత్రికి చెప్పి. ‘‘కారణం  నీపై నాకు ఉన్నది అమితమైన ప్రేమే. నేటి నీ చర్యకు కారణాలేమిటో నాకు తెలియడం లేదు. ఇదేనా నాపై నీకు గల ప్రేమ?’’ అని శ్రీకర్ అడిగాడు సావిత్రిని. శ్రీకర్ మాటలకు భోరున విలపిస్తూ ఇలా అన్నది శ్రీకర్ తో ‘‘డాక్టర్లు మీకు జరిగిన యాక్క్సిడెంట్ కి మీరు బ్రతకడమే కష్టం అన్నారు. ఒకవేళ కోలుకున్నప్పట్టికి మీరు నాతో ఒక స్నేహితుడిగా మాత్రమే మనగలరని చెప్పారు. మీరు నాకు దక్కితే చాలు అనుకున్నాను’’ అని చెప్పింది సావిత్రి. శ్రీకర్ సావిత్రి చేతులను తన చేతులలోకి తీసుకుని.. ‘‘నీకు ఒక రహస్య శుభవార్త చెబుతాను’’ అని సావిత్రి చెవిలో ఇలా చెప్పాడు, “నాడు నాకు నిన్నటి వరకు తెలియని నా ఆరోగ్య రహస్యాన్ని నీకు చెప్పినది నా ఆరోగ్యాన్ని కాపాడిన డాక్టర్ నా ప్రాణస్నేహితుడే. నీకు చెప్పిన విషయానికి మరొక వార్త జోడిస్తూ నిన్న ఇలా చెప్పాడు నాతొ. నేను పూర్తిగా కోలుకున్నాను’’ అని శ్రీకర్ డాక్టర్ తనకు ఇచ్చిన రిపోర్ట్స్ చూపిించాడు సావిత్రికి. ‘‘నిజమైన ప్రేమ త్యాగం చేయడానికి సిద్ధపడుతుంది ఎప్పుడూ. నేడు నీ ప్రేమ కోసం నిరీక్షిస్తూ నీ ఎదుట ఉన్నాను’’ అన్నాడు శ్రీకర్. శ్రీకర్ మాటలకు సావిత్రి కళ్ళ వెంట అమృతవర్షం కురిసింది. ‘సింగపూరు శ్రీవారు’ అని ఆలపిస్తూ తన శ్రీవారిని ఆలింగనం చేసుకుంది సావిత్రి.

Also read: నడిచే దారి ….!?

Radhika Phani Vangara
Radhika Phani Vangara
అమెరికాలో కేటీ నగరంలో నివాసం. వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. గార్డెనింగ్, కథానికలు రాయడం ఇష్టం. రేడియోకోసం ప్రముఖులను ఇంటర్వ్యూలు చేస్తుంటారు. పిల్లలు అంటే ఇష్టం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles