- ప్రచార ఘట్టంలోకి త్వరలో కిషన్ రెడ్డి!
- వాణీ కారు జోరు
- కమలం వికసించడానికి రామచంద్రుడి ముమ్మర యత్నం!
ఎమ్మెల్సీ ఎన్నికలు వేడెక్కాయి. ఎండాకాలం మొదలు అయిందో లేదో ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న అభ్యర్థులకు చెమటలు పట్టిస్తోంది. పీవీ పుత్రిక వాణిదేవికి ఎన్నికల రంగం కొత్త. టీఆర్ ఎస్ అభ్యర్థి వాణి అరవై ఏడేళ్ల వయసులో రోజూ రెండొందల కిలోమీటర్ల దూరం కారులో తిరుగుతున్నారు. ఇక అపార అనుభవం గల బీజేపీ అభ్యర్థి నారపురాజు రామచందర్ రావు నిన్నటి వరకు గెలుపు నల్లేరు మీద బండిలా ఉందనుకున్నారు. టీఆర్ఎస్ ప్రయోగించిన పివీ ఆయుధం వల్ల అడుగడుగునా ఆయనకు మంచినీళ్లు తాగే పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ మార్చి రెండో వారం వరకు ఈ ఉత్కంఠభరితమైన సన్నివేశాలలో ఎన్ని సీన్లు మారతాయో! ఈ వ్యాస రచయిత నైన నేను ఈ రోజు రెండు పార్టీల ఎన్నికల ప్రచార సరళిని పరిశీలించాను.
రంగంలో ప్రకాశ్ జావదేకర్
ఒక వైపు ప్రకాష్ జవదేకర్ నేరుగా ఎన్నికల రంగంలోకి దిగి తమ బిజెపి పార్టీ అభ్యర్థి రామచందర్ రావు గెలవడానికి శ్రేణులను ఉత్తేజ పరిచాడో లేదో టిఆర్ఎస్ తమ ఆయుధ పొదిలో ఉన్నా ఎన్నికలు “ట్రబుల్ షూటర్” హరీష్ రావును రంగంలోకి దించింది. ఒక ఎనిమిది రోజుల్లో హరీష్ రంగారెడ్డి జిల్లా పట్టభద్రుల ఓట్లను తమ పార్టీకి వేయించడానికి పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఓట్లలో ఎక్కువ శాతం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయి కాబట్టి వ్యూహాత్మకంగా హరీష్ ను టిఆర్ఎస్ రంగంలోకి దించింది. పార్టీ కోసం అహర్నిశలు అలసట ఎరగకుండా శ్రమించడం అలవాటైన హరీష్ రావు ఫిబ్రవరి 28 న (ఆదివారం) వికారాబాద్ లో, కుత్భుల్లా పూర్ లో భారీ పట్ట భద్రుల బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. వికారాబాద్ సభను నేను ప్రత్యక్షంగా చూశాను.
Also Read: బహుజన బంధువు పీవీ
వికారాబాద్ సభ విశిష్టత
దాదాపు పదిహేను వందల మంది హాజరైన ఈ సభను హరీష్ రావు ప్రతిష్ఠాత్మకంగా జిల్లా మంత్రులను సమన్వయం చేసి నిర్వహించారు. హుందాగా పివీ కుటుంబ నేపథ్యాన్ని ఓట్ల దిశగా మార్చే ప్రయత్నాన్ని సూటిగా సుత్తి లేకుండా హరీష్ చెప్పగలిగారు. విచిత్రం ఏమిటంటే టిఆర్ఎస్ అభ్యర్థిగా రంగంలో ఉన్నా వాణీ దేవిని మొత్తం సభ అయ్యే వరకు ఉంచకుండా సభకు పరిచయం చేసుకొని తన తండ్రి ఆశయ సిద్ధి కై తనకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యర్థి పార్టీల పై అనవసరమైన రాజకీయ బురద చల్లకుండా మాట్లాడి ఆమె మరో సభకు వెళ్లిపోయేలా షెడ్యూల్ రూపొందించారు. తరువాత స్థానిక రాజకీయ నాయకులు సభ ఆసాంతం ఇతర పార్టీలను దుమ్మెత్తి పోసేలా, పివీ కుటుంబానికి ఏ మచ్చ అంటకుండా హరీశ్ చేస్తున్న యత్నాలు ఇప్పుడు బిజెపిని కలవర పెడుతున్నాయి.
పీవీ కుటుంబాన్ని తిట్టలేరు
ఈ దశలో పివీ కుటుంబాన్ని తిడితే ఓట్లు ఎక్కడ గల్లంతు అవుతాయో అనే భయం బిజెపికి పట్టుకుంది. కేవలం పివీ కుటుంబాన్ని రంగంలోకి లాగి వాణి దేవి ఒడిపోయేలా, తద్వారా పివి పరపతిని పూర్తిగా ధ్వంసం చేయడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడనే విమర్శ బిజెపి వాళ్ళకే ఎదురు తిరిగేలా అవుతుంది. నారపరాజు రామ చందర్ రావుకి ఒక న్యాయవాదిగా మంచి పరిపాలనా దక్షుడిగా పేరు ప్రఖ్యాతులు ఉన్నా అధికార పార్టీకి ఒక సారి అవకాశం ఇద్దామని ఆలోచన ఇప్పుడు హరీష్ వల్ల వచ్చింది. ఒక వైపు పివీ శత జయంతి ఉత్సవాలు తెలంగాణ బిడ్డ, భూసంస్కరణలు తెచ్చి పేద వారి కుటుంబాలకు పెద్దన్నగా నిలిచిన పివీ కుటుంబానికి ఒక అవకాశం ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచన మాత్రం టిఆర్ఎస్ పట్టభద్రుల్లో వచ్చింది.
Also Read: కేసీఆర్ వ్యూహం లో పీవీ ఓటు బ్యాంక్…?
కిషన్ రెడ్డి రంగప్రవేశం
ఇక బిజెపి కూడా బహుజన పట్ట భద్రులు ఓట్లను తేగలిగే సత్తా ఉన్న కిషన్ రెడ్డి ని ఎన్నికల బరిలోకి దించ బోతుంది అనే సంకేతం ఇచ్చింది. రాత్రికి రాత్రే కిషన్ రెడ్డి, సంజయ్ ల పోస్టర్లు మూడు జిల్లాల్లో అడుగడుగునా పార్టీ మీటింగ్ ల్లో నింపేశారు. ఇక పివీ మనవడు పివీ పెద్ద కుతూరి కుమారుడు నచ్చరాజు సుభాష్ ఇప్పుడు బిజెపి ఎన్నికల పొదిలో ఆయుధం అయ్యాడు. అయితే ఆయన ఎన్నికల బరిలో నిలిచిన తన చిన్నమ్మను తిట్టలేక అవస్థలు పడుతున్నారు. ఈ సున్నితమైన విషయంలో సుభాష్…కేసీఆర్ పై పరుషమైన భాష వాడలేక పోతున్నారు. నిజానికి సుభాష్ వివాదం లేని రాజకీయ నాయకుడిగా తన తాతకు కాంగ్రెస్ చేసిన ద్రోహాన్ని చెప్పడానికి బీజేపీలో చేసిన ప్రయత్నం సఫలం అయింది. ఇటీవల జరిగిన హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గల్లంతు కావడానికీ, తద్వారా బిజెపి మెజారిటీ సీట్లు గెలుచుకోవడానికీ సుభాష్ కూడా తన వంతు పాత్ర పోషించారు. ఇప్పుడు సీన్ బిజెపి- టీఆర్ఎస్ గా మారడం తో సుభాష్ కు పచ్చి వెలక్కాయ నోట్లో పడింది. గత పదహారేళ్లుగా తన తాత వర్ధంతి, జయంతి ఉత్సవాలను ఏ పార్టీ నిర్వహించలేని స్థితిలో, అన్ని పార్టీల నాయకులు బేషజం లేకుండా పిలిచిన ఘనత సుభాష్ ది.
పీవీని సొంతం చేసుకున్న కేసీఆర్
ఈ సారి పివీ శత జయంతి ఉత్సవాలు నిర్వహించ తలపెట్టి పివీని కేసీఆర్ తన పార్టీకీ సొంతం చేసుకొని అన్ని పార్టీలను ఆత్మరక్షణలో పడేశారు. ఈ ఏడాది పివీ వర్ధంతి, జయంతి ఉత్సవాలు ప్రభుత్వం ముందుండి నడిపించడం తో సుభాష్ తో సహా అన్ని పార్టీల నాయకులు ప్రేక్షక పాత్ర వహించారు. దానికి తోడు పివీ మా వాడంటే మా వాడు అంటూ పోటీలు పడ్డారు. వెంటనే కేసీఆర్ పివీకి భారతరత్న ఇవ్వాల్సిందే అని అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేయడంతో టీఆర్ఎస్ పార్టీ కి తిరిగి క్రెడిట్ వచ్చేసింది.
Also Read: రాష్ట్ర కాంగ్రెస్ లో మూడు ముక్కలాట
కాంగ్రెస్, బీజేపీలకు చిక్కని పీవీ బంధువులు
ఇదిలా ఉంటే పివీ మిగతా కుటుంబ సభ్యులను కూడా కాంగ్రెస్, బిజెపి వల వేసి పట్టుకుందమనుకున్నా వారు చిక్కలేదు! బిజెపి తీర్ధం పుచ్చుకున్న పివీ మనవడు ఇప్పుడు బిజెపికి పెద్ద అసెట్ అయ్యాడు. ఇదిలా ఉంటే గత ఆర్నెళ్లుగా మూడు జిల్లాల్లో ఆహర్నిశలూ శ్రమించి ఓటు బ్యాంకు ఏర్పాటు చేసుకున్న రామచందర్ రావుకి ఇప్పుడు టెన్షన్ పట్టుకుంది. వాణి దేవీ రంగంలో లేకుంటే ఆయన ఇంత హైరానా పడవలసిన అవసరం ఉండేది కాదు. పిలిస్తే పలికే నాయకుడిగా పేరు ఉన్న రామచందర్ రావుకు ఇప్పుడు ముఖం చాటేస్తున్న వారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం ముమ్మరం చేసి అమ్మవారి దయకోసం అలంపురం వెళ్ళారు.
రెండుగా చీలిపోయిన బ్రాహ్మణులు
ఇక ఈ ఎన్నికల్లో బ్రాహ్మణులు రెండుగా చీలిపోయారు. దాదాపు మూడు జిల్లాల్లో పాతిక వేలు ఉన్న బ్రాహ్మణ ఓట్లు వాణి, రామచందర్ రావులకు చెరిసగం అయ్యాయి. బిజెపి – టీఆర్ఎస్ గా చీలిపోయిన బ్రాహ్మణ ఓట్లను ఒడిసిపట్టుకునే దిశగా అటు వాణీ దేవీ, ఇటు రామచందర్ రావు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఈ బ్రాహ్మణ ఓట్ల రాజకీయం ఏమిటంటే పాతిక వేల మంది ఇతర కులాలకు చెందిన మరో పాతిక వేల మంది పట్టభద్రుల ఓట్లను ప్రభావితం చేస్తారు. ప్రతి కులంలోని వారు బ్రాహ్మణ పట్ట భద్రులు చెబితే మిత్రత్వం పరంగానో లేదా పార్టీ అభిమానం పరంగానో ఓట్లు వేయించే సత్తా వారికి ఉంటుంది.. రావు గారు, పంతులు గారు, శాస్త్రి గారు, శర్మ గారు, ఆచార్య గారు చెబితే వేద వాక్కు గా భావించే వారు ఉంటారు కాబట్టి ఇరు పార్టీ అభ్యర్థులు ఇప్పుడు బ్రాహ్మణ ఓట్ల పై పడ్డారు.
చాలా మంది బ్రాహ్మణ సంఘాల ప్రతి నిధులు బహిరంగంగా తమ అభిమానాన్ని ఆయా అభ్యర్థులకు చాటు కోవడం ఇక్కడ గొప్ప విషయం. చాటుమాటుగా కాకుండా బహిరంగంగా ఫలానా పార్టీ అభ్యర్ధికి ఓటు వేస్తామని ప్రకటించారు. ఎవరూ గెలిస్తే వేరే వారికి కంటు ఎందుకు కావాలని ఒక బ్రాహ్మణ సంఘం డిప్లొమాట్ గా “అంతరాత్మ ప్రబోధం” ప్రకారం ఓటు వేయమని చేతులు దులుపుకుంది.
Also Read: రాజకీయ పునరావాస కేంద్రాలుగా శాసన మండళ్లు
కేసీఆర్ కొత్త హామీ ఏమైనా ఇస్తారా?
ఇక ఇప్పుడు ఎన్నికల తేదీ దగ్గరయ్యే కొద్దీ పివీని ఎలా ఓన్ చేసుకుంటే ఓట్లు రాలుతాయి అనే ఆలోచనలో అన్ని పార్టీలూ పడ్డాయి..చివరి నిముషంలో పివీ పేరిట ఒక జిల్లా ఏర్పాటు చేస్తామనే హామీ కూడా టిఆర్ఎస్ నుండి వచ్చినా ఆశ్చర్యం లేదు. ఒక వేళ ఓటమి ఎవరిదైనా అభ్యర్థులకు ఉన్నా సత్తా మేరకు ఆయా పార్టీలు ఎదో పదవి కట్టబెడతాయని గతంలో పోటీ చేసి ఓడిపోయిన దేవీ ప్రసాద్ గారికి ఒక సంస్థకు ఛైర్మెన్ ను చేసిన వైనాన్ని టీఆర్ఎస్ గుర్తుకు తెస్తోంది. ఇక రామచందర్ రావు ఆహర్నిశలూ నిద్రాహారాలు లేకుండా తిరుగుతున్నారనే సానుభూతిని ఆయన ఓట్లుగా మల్చు కోగలుగుతారా? హరీష్ కు దీటుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక ప్రచార బాధ్యత మొత్తం మోస్తారా? లేక టిఆర్ఎస్ వేసేన ఎత్తులకు దీటైన ఎత్తులు వేస్తారా? ఇంతకీ మరో గట్టి అభ్యర్థి, మాజీ ఎంఎల్ సీ కె. నాగేశ్వర్ పరిస్థితి ఏమిటి? ఆయన ఆత్మవిశ్వాసం వెనుక ఉన్న కారణం ఏమిటి? ఈ లోపే కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం పివీకి భారత రత్న ప్రకటిస్తే కేసీఆర్ వ్యూహం ఎలా ఉంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు!