రేపు రైతులు తలపెట్టిన దేశవ్యాప్త బంద్ కు టీఆర్ఎస్ మద్దతునిస్తున్నట్లు మున్సిపల్,ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రేపు రైతులు ఇచ్చిన భారత్ బంద్ లో టీర్ఎస్ శ్రేణులు ప్రత్యక్షంగా పాల్గొంటాయని తెలిపారు. తెలంగాణ ప్రజలంతా రైతులు చేపట్టిన భారత్ బంద్ కు సహకరించాలని పిలుపునిచ్చారు. రైతులందరూ జాతీయ రహదారుల పైకి వచ్చి భారత్ బంద్ కు మద్దతు తెలపాలని అన్నారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేవిధంగా ఉన్న వ్యవసాయ చట్టాలను పార్లమెంట్ లో టిఆర్ఎస్ వ్యతిరేకించిందని అన్నారు. రైతు వ్యతిరేక చట్టాలపై ఓటింగ్ సమయంలో ఎంపీలు మా వాదనను బలంగా వినిపించామని అన్నారు. ఢిల్లీలో రైతులు ఎముకలు కొరికే చలిలో ధర్నాలు చేస్తున్నారని అయినా కేంద్ర ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంబిస్తోందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యాపారస్తులకు విజ్ఞప్తి :
టీఆర్ఎస్ మద్దతు తెలిపిన సందర్భంగా వ్యాపారస్తులు కూడా మద్దతు తెలపాలని కేటీఆర్ కోరారు. కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించే వరకు టీఆర్ఎస్ రైతుల పక్షాన పోరాడుతుందన్నారు. బంద్ కు అన్ని వ్యాపార సంస్థలు సహకరించాలని మంత్రి అన్నారు.