- రాజకీయ లబ్ధి కోసమే బంద్ కు మద్దతు
- మౌనం వహిస్తున్న ఉద్యోగ సంఘాల నేతలు
- ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్న పోలీసులు
డా.ఆరవల్లి జగన్నాథ స్వామి
టీఆర్ఎస్ బంద్ విఫలం?
తెలంగాణలోని వివిధ వర్గాల సమస్యలు పరిష్కరించలేని ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖరరావు రైతు ఉద్యమానికి, భారత్ బంద్ కు మద్దతు ఇవ్వడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శిం చారు. బంద్ కు మద్దతు పలికిన ఆయన ఆ కార్యక్రమంలో ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ పరాజయం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే టీఆర్ఎస్ నేతలు బంద్ ఎత్తు వేశారని, ఇది ప్రభుత్వం అధికారికంగా చేయించిన బంద్ అని, అయినా పూర్తిగా విఫలమైందని అన్నారు. రైతుల శ్రేయస్సు కోసమే ప్రధాని మోదీ తెచ్చిన వ్యవసాయ చట్టాలను రైతులు ఆమోదించారు కనుకనే తెలంగాణలో బంద్ విఫలమైందని చెప్పుకొచ్చారు.
ఉద్యోగ సంఘాల నేతలు
ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రి, మంత్రుల మోచేతి నీళ్లు తాగుతున్నారని సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, ఎల్ఆర్ఎస్ పేరుతో అడ్డగోలుగా దోచుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ఉద్యోగ సంఘాల నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు . సంఘాల నాయకులు పట్టించుకోవడం లేదని ఉద్యోగులే తమకు ఫోన్లు చేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ త్వరలో అన్ని మున్సిపల్ కేంద్రాల్లో ఆందోళన చేపడతామని చెప్పారు.
Also Read: తెలంగాణకు మధ్యంతర ఎన్నికలు?
పోలీసుల అత్యుత్సాహం
పోలీసు వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదని కాని కొందరు పోలీసు ఉన్నతాధి కారులు అధికార పక్షానికి కొమ్ముకాస్తున్నారని బండి మండిపడ్డారు. అలాంటి వారు యూనిఫాం తీసేసి అధికార పార్టీలో చేరితే బాగుంటుందని సూచించారు. ప్రజలకు ఇబ్బంది కలిగేలా బంద్ లో పాల్గొన్న మంత్రులు, టీఆర్ఎస్ నేతలను ఎందుకు గృహనిర్బంధం చేయలేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వమే శాశ్వతం కాదన్న విషయాన్ని పోలీసులు, ఉద్యోగ సంఘాల నేతలు గుర్తుంచుకోవాలని అంటూ,తాము చేపట్టే ఆందోళనలకు కూడా పోలీసులు, ఉద్యోగులు సహకరిం చాలని కోరారు.
నిన్న ఉగ్రవాది నేడు మహానేత?
`తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయే.ఆ పార్టీని గద్దె దింపి బీజేపీని అధికారంలోకి తేవడమే ప్రధాన లక్ష్యం` అన్న నటి విజయశాంతి మాటలపై సామాజిక మాధ్యమాల్లో వ్యంగ్యాస్త్రాలు జోరుగా చక్కర్లు కొడుతు న్నాయి. 1998లో బీజేపీతోనే రాజకీయ జీవితం ప్రారంభించి, బయటికి వచ్చి సొంత పార్టీ పెట్టి,మరో రెండు పార్టీలు మారి రెండు రోజుల క్రితం తిరిగి `కమల` ధారిణి అయిన ఆమె వ్యాఖ్యలకు ప్రతిగా గతంలో నరేంద్రమోదీ పై చేసిన తీవ్ర వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్నాయి.`నరేంద్రమోదీ ఒక టెర్రరిస్టులా కనబడుతున్నాడు. ఆయన ఎప్పుడు ఏ బాంబు వేస్తాడోనని ప్రతి ఒక్కరిని భయపెడుతుంది. దడపుడుతుంది. ప్రజలను ప్రేమించాల్సింది పోయి వారిని భయపెడుతున్నాడు. ఇది ప్రధాన మంత్రికి ఉండవలసిన లక్షణం కాదు`అని గత ఏడాది లోక్ సభ ఎన్నికల ప్రచారసభలో ఆమె ఆవేశంతో చేసిన ప్రసంగం వీడియోకు ప్రతిస్పందన కనిపిస్తోంది.`నాటి ఉగ్రవాది నేడు మానవతావాదిగా కనిపిస్తున్నాడా? మొన్న మోదీని టెర్రరిస్టు అని, నిన్న కేసీఆర్ ను మోసగాడు అని విమర్శించిన ఆమె రేపు సోనియా, రాహుల్ ను ఏమంటారో అని ఆమె రాకను స్వాగతించలేని సొంతపార్టీ వారే స్పందిస్తున్నారు. నాయకులు పార్టీలు మారడం సహజమే అయినా మరీ అంత దారుణంగా విమర్శించిన వారిని తిరిగి ఎలా చేర్చుకున్నారని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి, రాజకీయంగా విభేదించి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలను తరచూ ప్రస్తావిస్తూ ప్రతి విమర్శలు చేసే బీజేపీ నాయకులకు విజయ శాంతి పట్ల అంత ఉదారత ఎందుకో అని ప్రశ్నిస్తున్నారు.
అందులో చేరితే పునీతులవుతారా?
తమ పార్టీలోని అవినీతిపరులని విమర్శించే బీజేపీ అదే పార్టీలోని వారిని ఎలా చేర్చుకుంటోందని కాంగ్రెస్ నాయకలు ప్రశ్నిస్తున్నారు. విజయశాంతితో పాటు పీసీసీ కోశాధికారిగా పనిచేసిన గూడూరు నారాయణరెడ్డి బీజేపీలో చేరడాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. గూడూరు పీసీసీ కోశాధికారిగా ఉన్నప్పడు పార్టీకి అందిన విరాళాలపైనా, ముఖ్యంగా ఎన్ఆర్ఐల నుంచి వచ్చిన సొమ్ముకు లెక్కలేదని ఆ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆరోపించారు. ఆ సొమ్మును దుర్వినియోగం చేశారంటూ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. కాంగ్రెస్ లో అవినీతిపరులు బీజేపీ తీర్థం పుచ్చుకోగానే నీతిమంతులు అవుతారా? అని ఎద్దేవా చేశారు.