బండారు రాం ప్రసాద్ రావు
దుబ్బాక ఓటమి, జి హెచ్ ఎం సి ఎన్నికల్లో భారీ సీట్లు కోల్పోయిన టీఆర్ఎస్ ఇప్పుడు ఆత్మ రక్షణ గేమ్ ఆడుతోంది! ధరణి వైఫల్యాలు, ఐ ఎ ఎస్ ల నిరాశావాదం, కోర్టుల అక్షింతలు కేసీఆర్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి! మరో వైపు బిజెపి దూకుడు.ఇక్కడ ఎం ఐ ఎం తెరచాటు పొత్తు. ఇవన్నీ కేసీఅర్ ను నిజాయితీ గల నేతగా నమ్మడానికి ఏ రాజకీయ పార్టీ సంసిద్దంగా లేదు! మొదటి ఐదేళ్లు తెలంగాణకు కేసీఆర్ దిక్కు అనుకున్న ప్రజలు ఇప్పుడు కేసీఅర్ లేకున్నా తెలంగాణ కు ఢోకా లేదు అనే దిశగా మైండ్ సెట్ మార్చుకున్నారు! అగ్రవర్ణాలు ముఖ్యంగా రెడ్లు కేసీఆర్ నియంతృత్వ వైఖరి పై మండి పడుతున్నారు. కానీ వాళ్ళలో ఐక్యత లేక పోవడం వల్ల కేసీఅర్ ఆటలు సాగుతున్నాయని వారు భావిస్తున్నారు.
వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న రెడ్డి సామాజికవర్గం
అయితే రెడ్డి అగ్రనేతలు ఐక్యత కోసం వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు! ఇక బ్రాహ్మణ వర్గంలో కూడా నిరాశ నిస్పృహలు అలుముకుంటున్నాయి. మేధావి వర్గంగా చెప్పుకునే బ్రాహ్మణ వర్గం లో రాజకీయ ఎదుగుదల లేక పోవడం, రాజకీయాల్లో పోటీ చేసే ఆర్థిక స్థోమత లేకపోవడం వల్ల ఓసీ సమీకరణలో బ్రాహ్మణ వర్గం పదవులు తీసుకోవడం లో వెనుక బడిపోయింది. కనీసం ఏమ్మెల్సే, కార్పొరేషన్ పదవులు అడగడానికి కూడా బ్రాహ్మణులు జంకుతున్నారు. కేసీఅర్ మూడ్ ను బట్టి యెక్కడ ఆగ్రహం వ్యక్తం చేస్తారో అని మదన పడుతున్నారు. ప్రగతి భవన్ మెట్లు ఎక్కడానికి కూడా వారికి అపాయింట్ మెంట్ దొరకని స్థితిలో ఉన్నారు. నల్గొండ కు చెందిన ఒక బ్రాహ్మణ నాయకుడికి ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఉండి కూడా ఆయనకు మొండి చెయ్యి చూపించినా కూడా అడగలేని దీన స్థితిలో బ్రాహ్మణ వర్గం ఉంది. ఇక వైశ్య వర్గంలో ఈ మధ్య ఎమ్మెల్సీ టికెట్, మరో ఇద్దరికి కార్పొరేషన్ లు కట్టబెట్టి సంతృప్తి పరిచినా, రెడ్డి సామాజిక వర్గం కదుపుతున్న పావుల్లో వైశ్యుల అగ్రశ్రేణి నాయకులు మద్దతు తెలిపే అవకాశాలు ఉన్నాయి.
అప్పటికి కిషన్ రెడ్డి రంగంలో దిగుతారా?
ఇదిలా ఉంటే..కేసీఆర్ హస్తిన యాత్ర లో బిజెపి తో దోస్తీ కోసం ప్రయత్నించారని అంటున్న మాటలు అర్థరహితం. బిజెపి తో కేసీఅర్ స్నేహం నమ్మ శక్యం గానీ ఎండమావే. ఎందుకంటే దేశ రాజకీయాల్లో జరుగుతున్న అనూహ్య మార్పుల్లో కేసీఆర్ ను అక్కున చేర్చుకునే ఉదార గుణం బిజెపి కి లేదు. రాష్ట్రంలో ఎలాగూ కాంగ్రెస్ గల్లంతు అయింది కాబట్టి కాంగ్రెస్ స్థానాలపై ఇపుడు బిజెపి దృష్టి పెట్టింది. అయితే గ్లామర్ గల నాయకుడు బిజెపిలో లేడు. కేసీఆర్ రెచ్చగొట్టినట్టు బిజెపిలో ప్రజల్ని రెచ్చగొట్టే నాయకుడ కరువయ్యాడు. విషయ పరిజ్ఞానం, దూకుడుతనం గల నాయకుడు బిజెపిలో పుట్టుకు వస్తే టీఆర్ఎస్ కు చెక్ పెట్టవచ్చు. వచ్చే శాసన సభ ఎన్నికల నాటికి కనీసం ముప్ఫై సీట్లు గెలుచుకునేలా బిజెపి వ్యూహం రచిస్తోంది. కిషన్ రెడ్డి లాంటి నాయకుణ్ణి అప్పటి కల్లా రాష్ట్రానికి పంపాలనే ఆలోచన బిజెపి చేస్తోంది. జమిలి ఎన్నికలు వైపు బిజెపి దృష్టి సారిస్తే బహుశా సమీకరణలు వేగ వంతం కావచ్చు. ఇక పోతే టీఆర్ఎస్ లో కేసీఆర్ తప్ప మరో నాయకుడు మాట్లాడలేక పోవడానికి కారణం ఆయన ఎప్పుడూ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో ఎవరికి తెలియని పరిస్థితి. ఆయన తనయుడు కేటీఆర్ కూడా తండ్రి మూడ్ ఎలా ఉంటుందొ తెలియని పరిస్థితిలో ఉన్నాడు. దుబ్బాక ఓటమి కి బాధ్యత వహిస్తూ హరీష్ రావు రాజీనామా చేసి ఉంటే రాష్ట్ర రాజకీయాలు పెను మార్పులకు గురి అయ్యేవి. కానీ మామ మనసెరిగిన హరీష్ రాజీనామా అస్త్రాన్ని ప్రగతి భవన్ వరకే ఉంచాడు. కొడుకుకు ముఖ్య మంత్రి పీఠం అప్పజెప్పి ఫార్మ్ హౌజ్ కు పరిమితం అవుదామనుకున్న కేసీఅర్ కు బిజెపి రూపేణా కొత్త సవాల్ ఎదురైంది. జి యెచ్ ఎం సి ఎన్నికల్లో కనీసం ఎనభై సీట్లు వస్తే కేసీఆర్ దూకుడు మరి ఎక్కువగా ఉండేది.
బీసీ సామాజికవర్గం వైపు బీజేపీ అడుగులు
భవిష్యత్ తెలంగాణ దిశగా వేస్తున్న బిజెపి అడుగులు ఇప్పుడు బిసీ సామాజిక వర్గం పై పడింది..దానికి తోడు భూ ఆక్రమణలు, అసహనం తో టి అర్ ఎస్ ఎమ్మెల్యేలు చేస్తున్న అర్థరహితమైన వ్యాఖ్యల వల్ల టి ఆర్ ఎస్ పరపతి మసగబారుతోంది. ఆలాంటి ఎమ్మెల్యేల ను పక్కన బెట్టే ఆలోచన టీఆర్ఎస్ చేస్తోందనే పుకార్ల వల్ల ఆ ఏమ్మెల్యేలు బిజెపి లో టచ్ లో ఉంటున్నారని వార్తలు గుప్పు మంటున్నాయి. ట్రబుల్ షూటర్ గా పేరు గాంచిన హరీష్ రావును మళ్ళీ రంగంలో కి దించితే పరిస్థితులు చక్క బడవచ్చు. కానీ ఆ పని కేసీఆర్ చెయ్యరు. ఎందుకంటే వారసత్వం కొడుకుకు కావాలనే బలమైన దృక్పథం తో ఉన్నారు. హరీష్ కూడా మామ గారి మాటను జవదాటరు. ఇంకా పదేళ్లు టీఆర్ఎస్ రాష్ట్రం లో అధికారం లో ఉంటుంది అని చెప్పు కుంటున్న టీఆర్ఎస్ అగ్ర నాయకులు కూడా ఇటీవల జరుగుతున్న పరిణామాల్లో బెంబేలెత్తి పోతున్నారు. ఐ ఏ ఎస్, ఐ పీయెస్ వర్గాలు కూడా టీఆర్ఎస్ రాజకీయ వ్యవహార శైలి పట్ల నిశీతంగా పరిశీలన చేస్తున్నారు. టీఆర్ఎస్ తీసుకుంటున్న నిర్ణయాలను హైకోర్టు బ్యూరో క్రాట్లకు అక్షింతలు వేయడం వారు జీర్ణించుకోవడం లేదు.