ప్రస్తుత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెరాస అభివృద్ది మంత్రం ఏ మాత్రం పని చేయలేదు. చైతన్య వంతులైన ఓటర్లు తలపండిన విశ్లేషకులకూ అంతుచిక్కని రీతిలో విలక్షణ తీర్పు నిచ్చారు. ఈ ఎన్నికల్లో జాతీయ కాంగ్రెస్ ఉనికే ప్రశ్నార్థకం కాగా, ఎంఐఎం తన స్థానాలను నిలబెట్టుకోవడం లో సఫలీకృతం కాగా, భాజపా అనూహ్య రీతిలో ముందుకు దూసుకు పోయి అధికార పార్టీకి భారీ షాక్ ఇచ్చింది.
వ్యూహాత్మకంగానే వ్యవహరించారు
దుబ్బాక ఉప ఎన్నికల్లో ఊహించని ఫలితాన్ని చవి చూసిన తెరాస అధినేత, రానున్న పరిస్థితులను ముందే ఊహించి, శాసన సభ సాధారణ ఎన్నికల కు మల్లే ముందస్తు ఎన్నికలనే కోరుకున్నారు. ప్రతిపక్షాలకు అభ్యర్థుల ఎంపిక కు తగిన సమయం ఇవ్వకుండా, వ్యూహాత్మకంగా వ్యవహరించి ముందుకు వెళ్లారు. దుబ్బాక ఉప ఎన్నికలలో పూర్తి బాధ్యత మేనల్లునిపై మోపిన గులాబీ బాస్, ఈ ఎన్నికలలో ఎలా తనయుని పైనే వదిలేయక, రాష్ట్ర మంత్రులను రంగంలోని దించి, ఇంచార్జి లుగా నియమించి, అందుబాటులో ఉన్న వనరుల వినియోగానికి పూనుకున్నారు. అభివృద్ది తమతోనే సాధ్యమని, అభివృద్ధి చేశామని, చేయనున్నామని పదే పదే చెపుతూ వచ్చారు. కాంగ్రెస్ ను కాదని, భాజపాయే తమ ప్రత్యర్థిగా ప్రోజెక్ట్ చేశారు. మత కల్లోలాలు జరగ వచ్చు ననే అంశం తెర పైకి తెచ్చారు.
సిట్టింగ్ సభ్యులకే టిక్కెట్టు ఇవ్వడం పొరపాటేమో
అధికశాతం సిట్టింగ్ సభ్యులే పోటీ చేయడం, తెరాస నేతల బంధువులకు టిక్కెట్లు ఇవ్వడం, వరద బాధితుల సమస్యలు, అదిగా తెరాస అభ్యర్థులకు ప్రతికూల అంశాలు గా మారాయి. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, వైయక్తిక సేవలు, స్థానిక అపరిష్కృత సమస్యలు, సానుభూతి, స్థానికంగా ఆయా అధికార పార్టీ నాయకత్వాలపై, స్వ విపక్ష నేతల వ్యతిరేకత, ప్రధానాంశాలుగా పని చేశాయి. ప్రస్తుత ఎన్నికలలో పోటీ రసవత్తరంగా సాగింది. ఓటింగ్ కు ముందూ, అనంతరం ఎవరు గెలుస్తారనేది చివరి లెక్కింపు ఫలితం ప్రకటితమయ్యే వరకూ ఉత్కంఠ భరితమైంది. అభ్యర్థులు తమ అమ్ముల పొదిలోని సకల అస్త్ర, శస్త్రాలను సంధించు కుని నువ్వా-నేనా? అన్న రీతిలో తమ సర్వశక్తులనూ సమీకరించుకుని, కదన రంగంలో అమీతుమీకి సిద్ధపడగా, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఇక్కడి ఓటర్లు వ్యవహరించారు. వాస్తవానికి తెలంగాణేతర నగర సెట్లర్లు ఆదుకోకుంటే అధికార పార్టీ కి ఇంకా దుర్భరమైన పరిస్థితులు వుండేవి అనడంలో సందేహానికి తావే లేదు. వచ్చిన ఫలితాలను బట్టి ఇక్కడి ఓటర్లకు తెరాస అభివృద్ధి మంత్రం, యుద్ధతంత్రం పనిచేయ లేదనేది సుస్పష్టం, నిర్వివాదంశం.
ఊహించని పరిణామం
భాజాపా కు ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో తెరాస కీలక పాత్ర వహించేందుకు తాను సిద్ధం అవుతున్నానని ప్రకటిస్తున్న తెరాస అధినేత కు, స్వరాష్ట్రంలోనే భాజపా ప్రత్యామ్నాయ పార్టీగా ఎదుగుతున్న క్రమం ఊహించని పరిణామం. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఫలితాలపై ఇక తెరాస అధినేత లోతుగా అధ్యయనం చేసి, సమగ్ర విశ్లేషణ చేసుకోవాల్సిన తక్షణ అవసరం అనివార్యంగా ఉంది. శతాధిక వత్సరాల సుదీర్ఘ చరిత గల కాంగ్రెస్ కు కూడా మినహాయింపు ఉండదని గ్రహిం చా ల్సిన తరుణం. భాజపాకు రానున్న ఎన్నికలకు ఈ నేపథ్యం ఉపయోగ పడుతుంది అనడంలో అతిశయోక్తి లేదనేది ఎవరూ కాదనలేని వాస్తవం.