కమలాపూర్ : ‘‘వ్యక్తి స్వేచ్ఛను, ఓటు హక్కును శాసించే స్థాయికి తెరాసా వారు చేరుకున్నారు. ప్రలోభాల ప్రవాహాలు, లిక్కర్ బాటిల్స్, నోట్ల కట్టలు, కుట్రలు కుతంత్రాల పర్వం హుజురాబాద్ లో కొనసాగుతోంది. 5 నెలల 26 రోజులుగా ఇదే కొనసాగుతోంది’’ అని హుజూరాబాద్ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మంగళవారంనాడు ఆరోపించారు.
‘‘ప్రభుత్వఉద్యోగులు, ఆనరోరియంతో పని చేసే వారికి తెరాసా వారు హుకుం జారీ చేశారు. టీఆర్ఎస్ కి ఓటు వేయకపోతే ఉద్యోగం తీసివెస్తాం అని బెదిరిస్తున్నారు. పర్మినెంట్ గా ఉన్న ఉద్యోగులను ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇన్ని ప్రతిబంధకాల మధ్య హుజూరాబాద్ ప్రజలు నలిగిపోతున్నారు. 30న మా ఆత్మను ఆవిష్కరించి మా గుండెల్లో ఉన్న మీకు ఓటు వేసి గెలిపిస్తామని చెప్తున్నారు,’’ అని వివరించారు.
‘‘పత్రికా యాజమాన్యాలు, టీవీ ఛానళ్ల ఓనర్లు, ప్రజాస్వామ్య వాదులారా హుజూరాబాద్ వైపు చూడండి. ఇక్కడ జరిగేది మామూలు విషయం కాదు. ఇప్పటికే 5 వందల కోట్లు ఖర్చుపెట్టారు. ఇంకా ఎంత అయినా ఖర్చు పెడతాం అంటున్నారు. ఈటల రాజేందర్ ను ఓడించాలని చూస్తున్నారు. ఊరుకు ఊర్లు బార్లుగా మార్చారు. ఇప్పుడు ఓటుకు 20 వేల రూపాయలు పంచుతారట.
వీటన్నిటి నిలవరించకపోతే రాబోయేకాలంలో ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అవుతుంది. పౌరుల స్వేచ్ఛకూ, ప్రాథమిక హక్కులకూ భంగం కలుగుతుంది కాబట్టి ఆలోచన చేయాలి,’’ అంటూ విజ్ఞప్తి చేశారు.