- దిల్లీలో టీఆర్ఎస్ మహాధర్నా
- సుదీర్ఘంగా హిందీలో కేసీఆర్ ప్రసంగం
- సంఘీభావం ప్రకటించిన రాకేశ్ టికాయత్
ధాన్యం కొనుగోలు విషయంలో దేశమంతా ఒకే విధానాన్ని అవలంబించాలని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) విజ్ఞప్తి చేశారు. ‘‘తెలంగాణలో రైతులు పండించిన వరిధాన్యాన్ని కొనుగోలు చేయవలసిందిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకీ, ఆహారమంత్రి పియూష్ గోయెల్ కీ చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా,’’అంటూ కేసీఆర్ అన్నారు. దేశంమొత్తానికి వర్తించే ఒక విధానాన్ని రూపొందించి అమలు చేయకపోతే, అటువంటి విధానాన్ని అమలు చేసే ప్రభుత్వాన్నిదేశ ప్రజలు ఎన్నుకుంటారని ఆయన హెచ్చరించారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు బండి సంజయ్ లు రైతులను వరి పండించవలసిందిగా ప్రోత్సహించారనీ, వారు సిగ్గులేకుండా రాష్ట్రప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ హైదరాబాద్ లో ధర్నా చేస్తున్నారనీ కేసీఆర్ అవహేళన చేశారు. జాతీయ రైతు సంఘాల సమాఖ్య నాయకుడు రాఖేష్ టికాయత్ ఈ సభలో ఆసాంతం కూర్చొని ఉన్నారు. తెలంగాణ రైతుల సమస్యను జాతీయ స్థాయిలో రైతుల, రాజకీయ పార్టీల దృష్టికి తీసుకొని వచ్చేందుకు దిల్లీలోని తెలంగాణ భవన్ లో ఈ ధర్నాకార్యక్రమాన్ని నిర్వహించామని కేసీఆర్ వివరించారు.
ఈ ధర్నాలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు టీఆర్ఎస్ కు చెందిన ఎంపీలూ, మంత్రులూ, ఎంఎల్ఏలూ, ఇతర నాయకులూ పాల్గొన్నారు. వరి ధాన్యం, కేసీఆర్ ఫొటోలతో ఫ్లెక్సీలు తయారు చేసి పెట్టారు. హిందీలో సుదీర్ఘ ప్రసంగం చేసిన కేసీఆర్ ప్రధాని మోదీపై ధ్వజమెత్తారు. తెలంగాణ రైతులను అవమానించారనీ, వారిని వరి పండించమని ప్రోత్సహించి తీరా పండించిన తర్వాత కొనుగోలు చేయకుండా మడతపేచీలు పెడుతున్నారనీ, ఇరవై నాలుగు గంటల సమయంలో యాసంగి వరిధాన్యం కొనుగోలును కేంద్రప్రభుత్వం ప్రారంభించకపోతే తమ నిర్ణయం తాము తీసుకుంటామనీ కేసీఆర్ హెచ్చరించారు. ‘‘రైతులతో ఆటలు ఆడవద్దు. వారు కేంద్రాన్నిభిక్ష అడగడం లేదు. వారు యాచకులు కారు. తమ హక్కును డిమాండ్ చేస్తున్నారు,’’ అంటూ ఎలుగెత్తి చాటారు. నూకల బియ్యం తినాలంటూ తెలంగాణ ప్రజలను అవమానించిన పీయూష్ గోయెల్ కు ప్రజలే బుద్ధిచెబుతారని అన్నారు. బియ్యం విక్రయిస్తామంటూ తెలంగాణ ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఇచ్చిందంటూ ఆహార మంత్రి పీయూష్ గోయెల్ అబద్ధాలు చెబుతున్నారనీ, రైతులను వంచిస్తున్నారనీ కేసీఆర్ అన్నారు.
అంతకు ముందు రాకేశ్ టికాయట్ ప్రసంగిస్తూ, తెలంగాణ రైతులకు సంఘీభావం ప్రకటించారు. దేశంలో రైతులు ఎక్కడ ఉద్యమించినా వారికి అండగా తాము ఉంటామనీ రైతు నాయకుడు టికాయత్ అన్నారు.