- సీఎం కేటీఆర్ అంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు విస్తృత ప్రచారం
- కంగ్రాట్స్ సీఎం అంటున్న డిప్యుటీ స్పీకర్ పద్మారావు
స్వామి భక్తి చాటుకోవడంలో టీఆర్ఎస్ నేతలు ఒకరి కొకరు పోటీపడుతున్నారు. అధికార దాహంతో పదవులు ఆశించి అధిష్ఠానాన్ని ప్రసన్నం చేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆయన కుమారుడు రాష్ట్ర మంత్రి కేటీఆర్ ను సీఎం చేయాలని భావిస్తున్నట్లు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీకి చెందిన పలువురు నేతలు కేటీఆర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార పగ్గాలను కుమారుడు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు అప్పగిస్తారంటూ గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో సీఎం మార్పుపై టీఆర్ఎస్ నేతలు చేస్తున్న సంచలన వ్యాఖ్యలు దీనికి మరింత బలం చేకూరుస్తున్నాయి. మంత్రులు, ఎమ్మేల్యేల వ్యాఖ్యలు చూస్తే త్వరలోనే సీఎం మార్పు తథ్యమనిపిస్తోంది. దీనికితోడు తాను జాతీయ రాజకీయాలపై దృష్టి సారిస్తానంటూ కేసీఆర్ గతంలో పలు మార్లు చేసిన ప్రకటనలు కూడా సీఎం మార్పుపై జరుగుతున్న ప్రచారానికి బలం చేకూర్చుతున్నాయి.
ఇది చదవండి: ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మంగా మారిన సాగర్ ఉపఎన్నిక
డిప్యుటీ స్పీకర్ పద్మారావు, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్, కరీంనగర్ ఎమ్మెల్యే, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి గంగుల కమలాకర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ లాంటి పలువురు నేతలు కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతూ స్వామి భక్తి చాటుకుంటున్నారు. మంత్రి ఎర్రబెల్లి ఓ అడుగు ముందుకేసి.. కేటీఆర్ సీఎం అయితే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. త్వరలో తెలంగాణ సీఎం మార్పు ఉండొచ్చని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సీఎం మారడంలో తప్పులేదని ప్రశ్నించారు. సీఎంగా కేటీఆర్ సమర్థుడంటూ బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ కూడా వ్యాఖ్యానించారు.
సికిందరాబాద్ రైల్వే ఉద్యోగుల సమావేశంలో పాల్గొన్న డిప్యుటీ స్పీకర్ పద్మారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో కేటీఆర్ సీఎం కాబోతున్నారని వ్యాఖ్యానించారు. సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ సమక్షంలోనే కాబోయే సీఎం కేటీఆర్ కు కంగ్రాట్స్ అని చెప్పారు. పద్మారావు వ్యాఖ్యలు ఇపుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి.
ఇది చదవండి: కమలం వైపు కదలికలా?
అంతకు మందు మంత్రి గంగుల కమలాకర్ కూడా కేటీఆర్ పై ప్రశంసలు కురిపించారు. కేటీఆర్ సమర్ధవంతమైన నాయకుడని, తండ్రికి తగ్గ తనయుడని కొనియాడారు. కేటీఆర్ ని ముఖ్యమంత్రి చేస్తే అందరం ఒకే మాటపై నిలబడి ఆయనకు మద్దతు తెలుపుతామన్నారు. సీఎం ఎవరో కేసీఆర్ నిర్ణయిస్తారని అన్నారు. సీఎం కేటీఆర్ అనేది తమ పార్టీ అంతర్గత వ్యవహారమని దీనిపై బీజేపీకి సంబంధంలేదని గంగుల అన్నారు.