- వెంటాడిన కరోనా అనంతర సమస్యలు
- అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూత
తెలంగాణ మాజీ (మొదటి) హోం మంత్రి నాయిని నర్శింహారెడ్డి కన్నుమూశారు. కరోనా పాజిటివ్ రావడంతో జూబ్లీ హిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఇటీవల నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగటివ్ వచ్చినా ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. పరీక్షలు నిర్వహించిన వైద్యులు న్యూమోనియా సోకినట్లు తెలిపారు. అనంతరం తలెత్తిన సమస్యలతో చికిత్స పొందుతూ రాత్రి 12. 24 (గురువారం ఉదయం) నిమిషాలకు తుదిశ్వాస విడిచినట్లు ఆపోలో ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. నాయిని వయస్సు 76 సంవత్సరాలు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని దేవరకొండలో 23 మే 1944లో జిన్మించారు. 1970 నాటికి హైదరాబాద్ చేరుకున్న నాయిని తిరుగులేని కార్మిక నేతగా ఎదిగారు. ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి జనతా పార్టీ తరపున ఒకసారి టీఆర్ఎస్ తరపున రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడిన నాయిని ఏనాడూ కాంగ్రెస్, బీజేపీలకు మద్దతు ఇచ్చిన దాఖాలలేదు.
తిరుగులేని రాజకీయ ప్రస్థానం
2001 లో నాయిని నర్శింహారెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. 2005-2008 మధ్యకాలంలో కాంగ్రెస్, టీఆర్ ఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 2014 లో తెలంగాణ రాష్ట్రం ఉర్పడ్డాక కేసీఆర్ కేబినెట్ లో తెలంగాణ తొలి హోంమంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వహించారు. సీఎం కేసీఆర్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి కేటీఆర్, రాజ్య సభ ఎంపీ సంతోష్, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు నాయిని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీఎం కేసీఆర్ కు నాయిని అత్యంత ఆప్తుడు. నాయిని అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ కార్యదర్శిని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
కడదాకా కార్మికులకు అండగా
తన రాజకీయ భవితవ్యానికి మూలస్తంభమైన కార్మికుల పట్ల ఏనాడూ నిర్లక్ష్యం వహించలేదు. తుది శ్వాస విడిచే వరకూ కార్మికలోకానికి సేవలందించారు. జనతాపార్టీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన నాయిని 30 సంవత్సరాల తరువాత టీఆర్ఎస్ లో చేరి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా మారారు. నాయిని తనకిష్టమైన బుల్లెట్ పై తిరుగుతూ ముషీరాబాద్, చిక్కడ పల్లి పరిసర ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండేవారు. వారికి ఏ సమస్య వచ్చినా ముందుండేవారు.