Sunday, December 22, 2024

బీజేపీపై టీఆర్ఎస్ దళిత శాసనసభ్యుల ధ్వజం

* బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి బహిరంగ లేఖ

* దళితులంటే చెప్పులు కుట్టుకునేవారిగా, మొలలు కొట్టుకునేవారిగా వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్

* బీజేపీ సనాతనధర్మ, అంటరాని విధానాలకు సంజయ్ వ్యాఖ్యలు నిదర్వనమంటూ విమర్శ 

మంచిర్యాల: ‘నడిమంత్రపు సిరివస్తే.. కన్నూమిన్నూ గానకుండా విర్రవీగినట్టు ప్రవర్తిస్తున్నాడు రాష్ట్రబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అనీ, నోటికొచ్చినట్టు మాట్లాడుతూ సాటి మనుషులనే అవమానిస్తున్నారనీ అంటూ టీఆర్ఎస్ పార్టీకి చెందిన దళిత శాసనసభ్యులు ఒక బహిరంగలేఖలో ధ్వజమెత్తారు. వారు ఆదివారం విడుదల చేసిన లేఖలో ఈ కింది విధంగా బండి సంజయ్ ని విమర్శించారు:

‘‘ఇప్పటికే తలాతోకా లేని మాటలు మాట్లాడే వ్యక్తిగా సమాజంలో ముద్రపడ్డ బండి సంజయ్.. మరోసారి దళితుల పట్ల అమానుషపు వ్యాఖ్యలు చేశాడు. బండి సంజయ్ కు దళితులంటే చెప్పులు కుట్టుకునే వారుగా, మొలలు కొట్టుకునే వారుగా కనపడుతున్నారు. తన బీజేపీ పార్టీ ఆలోచన విధానాలకు ఇది అద్దం పడుతోంది. భారతీయ జనతాపార్టీ విధానాలు బూజు పట్టిన సనాతన ఆలోచనలకూ, అంటరానితనానికీ, దళితుల అణిచివేతకూ అద్దం పట్టేవి’ అని బండి సంజయ్ తన వ్యాఖ్యల ద్వారా మరోసారి రుజువు చేశారని ఒక బహిరంగ లేఖలో తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు విమర్శించారు. ‘‘దళితులకు చెప్పులు కుట్టడమే కాదు, మొలలు కొట్టడం కూడా వచ్చు అని వ్యాఖ్యానించడం ద్వారా.. ఈ ఆధునికయుగంలో కూడా  దళితుల స్థితిగతులు ఇంకా అలాగే ఉండాలని సంజయ్ కోరుకుంటున్నట్లు సుస్పష్టమవుతున్నది. దళితులు ఇంకా చెప్పులు కుట్టుకొనే బతకాలని కోరుకోవడం దుర్మార్గం,’’ అంటూ దుయ్యపట్టారు.  

Also Read : ఉద్యమాల శ్రేయోభిలాషి లింగయ్య మేస్త్రి ఇక లేడు

‘‘తరతరాలుగా అంటరానితనానికి అణిచివేతకు గురై విద్యకు దూరమైన దళితులకు..  డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా వారికి హక్కులు కల్పించి.. విద్య, ఉద్యాగాలలో అవకాశాలు దక్కేలా చూశారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కల్పించిన అవకాశాలతో.. దళితులు అన్ని రంగాలలో అందరితో పోటీ పడి.. ఉన్నత స్థానాలకు ఎదుగుతుంటే..  బండి సంజయ్ కి మింగుడుపడటంలేదు. అందుకే దళితులంటే చెప్పులు కుట్టుకునే వారు గా మొలలు కొట్టుకునే వారుగానే కనపడుతున్నట్లుంది. బండి సంజయ్ ఆ సనాతన బూజుపట్టిన ఆలోచనల నుండి బయటపడి.. దళితులంటే అందరితో సమానంగా అన్ని రంగాలలో పోటీపడుతున్నవారిగా గుర్తిస్తే మంచిది. లేదంటే బండి సంజయ్కి.. బీజేపీ పార్టీకి .. ప్రజలే మొలలు కొడతారు,’’ అంటూ హెచ్చరించారు.

Also Read : తెలంగాణ బాగుపడాలంటే బీజేపీ అధికారంలోకి రావాలి: సోయం బాబూరావు

‘‘తెలంగాణ రాష్ట్రం వచ్చాక గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు..  దళిత పిల్లలు ఉన్నత చదువులు చదవాలని వారు ఉన్నత స్థితికి ఎదగాలని ఆకాంక్షించారు. వందలాది  గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారు. వాటిలో చదువుకున్న, చదువుతున్న పిల్లలు అందరితో పోటీపడి టాప్ రాంకర్లుగా నిలుస్తున్నారు. ఉన్నతచదువుల్లో ఓపెన్ కేటగిరిలో కూడా సీట్లు పొందుతున్నారు. ఎవరెస్టు శిఖరాలను అధిరోహించి శభాష్ అనిపించుకుంటున్నరు.  ఐఐటీ, ఐఐఎం, నిట్, మెడిసిన్ లలో ర్యాంకులు సాధించడంతో పాటు.. దేశంలోని ప్రముఖ యూనివర్సిటీలలో సీట్లు సంపాదించి గోల్డ్ మెడల్స్ సాధించారు, సాధిస్తున్నారు. తెలంగాణ ఖ్యాతిని యావత్ దేశానికి, ప్రపంచానికి సగర్వంగా చాటుతున్నారు.

Also Read : కేసీఆర్ పై సంజయ్ వాగ్బాణాలు

సీఎం కేసీఆర్ సర్కారు.. తెలంగాణ గురుకులాల్లో ఒక్కో విద్యార్థిపైన సంవత్సరానికి లక్షా 20 వేల రూపాయలకు పైగా  ఖర్చు చేస్తున్నది. గురుకుల విద్యాసంస్థల్లో ఫైన్ ఆర్ట్స్ అకాడమీ, కోడింగ్ అకాడమీ, సైనిక్ స్కూల్స్, బిజినెస్ స్కూల్స్ ప్రారంభించింది. గురుకులాల్లోని విద్యార్థులు చదువుల్లోనే కాదు.. క్రీడల్లోనూ సత్తా చాటుతున్నారు. హైదరాబాద్ క్రికెట్ జట్టులోనూ చోటు సంపాదిస్తున్నారు. జాతీయ స్థాయిలో పలుక్రీడల్లో  పెద్దఎత్తున మెడల్స్ సాధిస్తున్నారు. భవిష్యత్ తెలంగాణకు, యావత్ దేశానికి.. అణిముత్యాల్లాంటి, వజ్రాల్లాంటి వనరులుగా రుపుదిద్దుకుంటున్నారు’’ అని గుర్తు చేశారు.

Also Read : ఇది కుమ్రం భీం పుట్టిన గడ్డ కేసీఆర్, జాగ్రత్త: తరుణ్ చుగ్ హెచ్చరిక

‘‘కానీ, ఇదంతా బూజుపట్టిన సంస్కృతి వివక్ష కళ్లద్దాలను తొడుక్కున్న బీజేపీకి కానరావట్లేదు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దురహంకారంతో.. ఒళ్లూపెయ్యి తెలియకుండా విషపు మాటలు వాగుడుతున్నడు. ఇందుకు తాజా ఉదాహరణ బండి సంజయ్ దుర్మార్గపు వ్యాఖ్యలే.  దళితులంటే చెప్పులు మొలలు గుర్తుకు రావడం .. బండి సంజయ్ దురహంకార పోకడకు నిదర్శనం. ఇందుకు తగిన మూల్యం తప్పదు. బండి సంజయ్, బీజేపీకి..  రానున్న రోజుల్లోప్రజలే తగిన శాస్తి చేస్తారు,’’ అంటూ విమర్శించారు.

Also Read : తీరనున్న లోవోల్టేజ్ కరెంటు సమస్య

ఈ బహిరంగ లేఖపైన కింది టీఆర్ఎస్ కి చెందిన దళిత శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుడూ సంతకాలు చేశారు: బాల్క సుమన్, గువ్వల బాలరాజ్, ఎంఎస్ ప్రభాకర్, రసమయి బాలకిషన్ , గాదరి కిశోర్, కాలె యాదయ్య , రమేష్, క్రాంతి కిరణ్ , చిరుమర్తి లింగయ్య, రాజేశ్వర్ , సుంకె రవిశంకర్ దుర్గం చిన్నయ్య.

Muneer MD
Muneer MD
Special Correspondent from Mancherial

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles