Sunday, December 22, 2024

త్రిముఖ పోరుకు సిద్ధమవుతున్న నాగార్జునసాగర్

  • అందరి చూపు సాగర్ వైపు   
  • జానా ఫ్యామిలీ చుట్టూ రాజకీయం
  • ప్రతిష్టాత్మకంగా మారనున్న ఉప ఎన్నిక

దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు నాగార్జునసాగర్ లో రాజకీయ ఉష్ణోగ్రతను పెంచాయి. నాగార్జునసాగర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న టిఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య హఠాన్మరణంతో అన్ని పార్టీల్లో జోరుగా ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. దానికి తోడు జిహెచ్ఎంసీలో ఫలితాలు మరింత ఉత్కంఠను రేకేత్తించాయి. దీంతో త్వరలో జరగబోయే నాగార్జునసాగర్ ఉపఎన్నికపై అన్ని పార్టీలూ దృష్టి సారించాయి. అధికార టిఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్, బిజెపీలకు ఈ ఉపఎన్నిక ప్రతిష్ఠాత్మకం కానుంది. 

తెలంగాణ శాసనసభకు ఈ దఫా మూడవ ఉపఎన్నిక అనివార్యమైంది. నాగార్జునసాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య మరణంతో ఆ స్థానం ఖాళీ అయింది.  అయితే అప్పటికే దుబ్బాక ఉపఎన్నిక ఇచ్చిన షాక్ టిఆర్ఎస్ ను వెంటాడుతుండగా తాజాగా జిహెచ్ఎంసీ ఫలితాలు అధికార పార్టీని ఇరుకున పెట్టాయి. వంద సీట్లు పక్కా అంటూ మొత్తం ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, మంత్రులను రంగంలోకి దించినా మ్యాజిక్ ఫిగర్ ను టిఆర్ఎస్ అందుకోలేకపోయింది. అదే సమయంలో బిజెపి తన బలాన్ని గణనీయంగా పెంచుకుంది. ఓ వైపు దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపు, తాజాగా జిహెచ్ఎంసీలో గణనీయంగా పెరిగిన సీట్లు బిజెపి జోష్ కు పగ్గాలు లేకుండా చేసింది. ఇదే సమయంలో రెండింటిలోనూ కాంగ్రెస్ అత్యంత పేలవ ప్రదర్శనతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది.

విభిన్న పరిస్థితులు

దుబ్బాక, జిహెచ్ఎంసీతో పోలిస్తే నాగార్జునసాగర్ లో భిన్న పరిస్థితులున్నాయి. నాగార్జునసాగర్ నియోజకవర్గం ఆదినుంచీ కాంగ్రెస్ కు, ప్రత్యేకంగా ఆ పార్టీ సీనియర్ నేత కుందూరు జానారెడ్డికి కంచుకోట. జానారెడ్డి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత రెండే రెండుసార్లు ఎమ్మెల్యేగా ఓడిపోగా అందులో 2018 ఎన్నికలు ఒకటి కావడం గమనార్హం. సుధీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించిన జానాపై సహజంగా ఉండే వ్యతిరేకతతో పాటు పలు అంశాలు జానారెడ్డి ఏడు వేల పైచిలుకు ఓట్లతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ నియోజకవర్గంలో తొలిసారి టిఆర్ఎస్ జెండా ఎగిరింది 2018 ఎన్నికల్లోనే. పూర్తి టెర్మ్ గడవకముందే నోముల ఆకస్మికంగా మరణించడంతో టిఆర్ఎస్ మరోసారి తీవ్ర పోటీని ఎదుర్కోవాల్సి ఉంది. ఇక్కడ సహజంగానే టిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఎన్నికలు జరగనున్నాయి. అయితే దుబ్బాక, జిహెచ్ఎంసీ ఇచ్చిన బూస్టప్ తో బిజెపీ తాడో పేడో తేల్చుకునేందుకు సిద్దమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ సారి త్రిముఖ పోటీ ఖాయంగా కనిపిస్తుంది.

దుబ్బాక నేర్పిన పాఠం

దుబ్బాక అనుభవంతో అధికార టిఆర్ఎస్ పార్టీ ఈ సారి చాలా పక్కాగా పూర్తి వ్యూహ రచనతో రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అభ్యర్థి విషయంలో పలు ఉహాగానాలు వినిపిస్తున్నా దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య తనయుడు నోముల భగత్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. తండ్రి సెంటిమెంట్ తో పాటు అధికార పార్టీ మద్ధతు, సామాజికవర్గ బలం భగత్ కు సానుకూల అంశాలుగా ఉన్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో యువకుడిని పెట్టి ప్రయోగం చేయవద్దని జానారెడ్డి వంటి సీనియర్ నేత ఓవైపు మరోవైపు బీజేపీ మరోవైపు మూకుమ్మడి వ్యూహాలతో భగత్ తలపడలేడని టిఆర్ఎస్ లోని మరో వర్గం అభిప్రాయపడుతోంది. దీంతో టిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, ఆ పార్టీకి చెందిన మరో నేత ఎంసీ కోటిరెడ్డి పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. దుబ్బాక, జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో నాగార్జునసాగర్ ఉప ఎన్నికను టిఆర్ఎస్ ఏమాత్రం తెలికగా తీసుకునే అవకాశం లేదు. అయితే ఇక్కడ ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తారనేది ఆసక్తిగా మారింది.

కాంగ్రెస్ కు విజయావకాశాలు

నాగార్జునసాగర్ నియోజకవర్గ రాజకీయం కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి చుట్టూనే తిరుగుతోందనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లోనూ ఆయన చూట్టూనే పలు ఉహాగానాలు రాజకీయవర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. గత ఎన్నికల్లో ఓడినా సుధీర్ఘకాలం రాజకీయం నడిపిన జానాకు నియోజకవర్గంలో గట్టి పట్టుంది. ఒకవేళ ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి జానారెడ్డి బరిలో దిగితే విజయావకాశాలు మెండుగా ఉన్నాయని కూడా చర్చ జరుగుతోంది. కాగా 2018 ఎన్నికల సమయంలోనే తాను పోటి చేస్తానంటూ పేచీ పెట్టిన జానా తనయుడు రుఘువీర్ రెడ్డి ఈ సారి బరిలోకి దిగేందుకు మరింత ఒత్తిడి చేస్తారని టాక్ వినిపిస్తుంది. పోటీకి ఆసక్తి చూపుతున్న రఘువీర్ తో బిజెపి టచ్ లోకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. రఘువీర్ కు టికెట్ ఇవ్వడంతో పాటు పెద్దాయనకు కేంద్రంలో సముచిత స్థానం ఇచ్చే ప్రతిపాదనను కూడా బిజెపి చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే  నిజమైతే జానారెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఆసక్తి ఆ పార్టీ క్యాడర్ లో కనిపిస్తోంది. ఇదే సమయంలో జానారెడ్డికి సీఎం కెసిఆర్ తో కూడా సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో టిఆర్ఎస్ నుంచి కూడా జానారెడ్డికి ప్రతిపాదన పంపితే బాగుంటుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే సీనియర్ నేత ఉత్తమ్ నియోజకవర్గాన్ని చేజార్చుకున్న కాంగ్రెస్ సాగర్ పై ఎలా వ్యవహరిస్తుందోనన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతుంది.

బిజెపి జోష్

ఇక దుబ్బాక, జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలతో వచ్చిన జోష్ ను కొనసాగించేందుకు బిజెపి ఉవ్విళ్లూరుతోంది. అందుకే సీనియర్ నేత జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి తమతో టచ్ లో ఉన్నారంటూ ఆ పార్టీ లీకులిస్తోంది. రఘువీర్ కు సాగర్ సీటు ఇవ్వడంతో పాటు జానారెడ్డికి కేంద్రంలో సముచిత స్థానం కల్పిస్తామని బిజెపి ప్రతిపాదన ఉంచినట్లుగా వార్తలు వస్తున్నాయి. అసలు బిజెపి అటువంటి ప్రయత్నం చేసిందా లేదా జానారెడ్డి దీనిపై ఎలా స్పందిస్తారనే అంశాలు పక్కకు పెడితే ఈ ప్రచారం కాంగ్రెస్ క్యాడర్ ను అయోమయానికి గురిచేస్తోంది. ఇది బెజెపి ఎత్తుగడగా కూడా ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో ప్రస్తుత జిల్లా పార్టీ అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి భార్య నివేదిత పోటీ చేసినా ఎటువంటి పోటీ ఇవ్వలేక డిపాజిట్ కోల్పోయారు. అయితే ప్రస్తుత జిల్లా అధ్యక్షుడి హోదాలో ఆయన వేరే వారికి అశకాశం కల్పిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. సామాజికవర్గం బలంగా ఉండడంతో టిడిపి నుంచి బిజెపిలో చేరిన కడారి అంజయ్యయాదవ్ పేరును కూడా ఆ పార్టీ పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన కడారి అంజయ్య 27 వేల పైచిలుకు ఓట్లు సాధించారు. ఇది ఆయనకు కొంత సానుకూలంగా మారే అవకాశం ఉంది. ఇక సాగర్ ఉపఎన్నికను మాత్రం బిజెపి అత్యంత ప్రాధాన్యంగా తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

ఏదేమైనా నాగార్జుసాగర్ ఉపఎన్నిక అన్నీ పార్టీలకు ప్రతిష్టాత్మకం కానున్నాయి అనేది సుస్పష్టం. ప్రత్యర్థులకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా బలమైన అభ్యర్థితో బరిలోకి దిగేందుకు అన్నీ ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఉత్తమ్ కంచుకోటను బద్దలు కొట్టిన టిఆర్ఎస్ ఆ స్పూర్తిని ఇక్కడ నిలుపుకుంటుందా లేదా దుబ్బాక లో అనూహ్య ఫలితాన్ని సాధించిన బిజెపి సాగర్ లోనూ తన సత్తా కొనసాగిస్తుందా లేక కాంగ్రెస్ పునర్ వైభవం సాధిస్తుందా అన్నది ఫలితాల తర్వాతే తేలనుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles