Sunday, December 22, 2024

ఛత్తీస్ గఢ్ కాంగ్రెస్ లో ముసలం

  • సీనియర్ మంత్రి తిరుగుబాటు బావుటా
  • ముఖ్యమంత్రి పదవి కోసం మంత్రి సింగ్ దేవ్ మంకు పట్టు
  • భూపేశ్ బగేల్, సింగ్ దేవ్ లు సమవుజ్టీలు

దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కేవలం రెండే రెండు రాష్ట్రాల్లో. ఒకటి రాజస్థాన్, రెండోది ఛత్తీస్ గడ్. మరో ఏడాదిలో ఛత్తీస్ గడ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ బగేల్ పై మంత్రి టీ ఎస్ సింగ్ దేవ్ రాజీనామా రూపంలో తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఈ వివాదం ఎక్కడి దాకా తీసుకెళ్తుందో అనే చర్చ రాజకీయ క్షేత్రంలో వేడి పుట్టిస్తోంది. నిన్నకాక మొన్ననే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని బిజెపి హస్తగతం చేసుకుంది. శివసేన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ అతను పూర్తిగా బిజెపి పెద్దల చెప్పుచేతల్లోనే ఉన్నారన్నది బహిరంగ రహస్యమే.

Also read: మంకీ పాక్స్ ఏమిటో?

కాంగ్రెస్ కి రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ కీలక రాష్ట్రాలు

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్, ఛత్తీస్ గడ్ లో బిజెపి గెలుపుజెండాలు ఎగురవేస్తే.. కాంగ్రెస్ పార్టీ  అన్ని రాష్ట్రాల్లోనూ అధికారం కోల్పోతుంది. దానితో.. దక్షిణభారతం తప్ప, దాదాపు దేశంలోని అన్ని రాష్ట్రాలు బిజెపి పాలన కిందకు వచ్చేస్తాయి. దక్షిణాదిలో కర్ణాటకను మినహాయించుకోవాలి. అక్కడ బిజెపి ప్రభుత్వమే అధికారంలో ఉందన్న సంగతి తెలిసిందే. రాజస్థాన్ విషయం ఎలా ఉన్నా, బిజెపికి ఛత్తీస్ గడ్  ప్రతిష్ఠాత్మకం. 2018 వరకూ వరుసగా మూడు దఫాలు 15 ఏళ్ళపాటు ఆ రాష్ట్రం బిజెపి ఏలుబడిలోనే ఉంది. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రమణ్ సింగ్ ప్రభుత్వంపై వ్యతిరేకత రావడంతో 2018 ఎన్నికల్లో బిజెపి ఓడిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. అంతటి విజయాన్ని సొంతం చేసుకున్నా,అంతర్గత విభేదాలు కాంగ్రెస్ ను అతలాకుతలం చేస్తూనే ఉన్నాయి. ముఖ్యమంత్రి భూపేశ్ బగేల్ -మంత్రి టీ ఎస్ సింగ్ దేవ్ మధ్య ఉన్న విభేదాలే ప్రధానమైనవి. ఇద్దరూ   చెరి రెండున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవీ కాలాన్ని పంచుకోవాలన్నది వారిద్దరి మధ్య కుదిరిన ఒప్పందం. కానీ అది జరుగలేదు. భూపేశ్ దానికి ఒప్పుకోలేదు. అటువంటి ఒప్పందాలు ఏమీ లేవనే మాటలు కాంగ్రెస్ అధినేతలు అంటున్నారు. నిజానిజాలు వారికే తెలియాలి.

Also read: అధికార మదాంధులకు శ్రీలంక గుణపాఠాలు

సమానస్కంధుల మధ్య పోరాటం, ఆరాటం

ఈ నేపథ్యంలో మంత్రి టీ ఎస్ సింగ్  తన తిరుగుబాటు స్వరాన్ని వినిపించారు. 2021లో భూపేశ్ పాలనా కాలం రెండున్నరేళ్లు పూర్తయిన సందర్భంలో అది జరిగింది. కాంగ్రెస్ అధిష్టానం ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడంతో కాస్త చల్లారింది. తర్వాత చెలరేగిన ఆధిపత్యపోరులో ఈ ఇద్దరి మధ్య అంతరాలు పెరుగుతూ వచ్చాయి. టీ ఎస్ సింగ్ దేవ్ పలు శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నా, ఆయన మాట పెద్దగా చెల్లడం లేదు. దాదాపు అంతటా ముఖ్యమంత్రి మాటే చెల్లుబాటవుతోంది. చీఫ్ సెక్రటరీ, సీ ఎం ఓ అధికారగణం పెత్తనమే రాజ్యమేలుతోంది. ఈ నేపథ్యంలో, తాను బాధ్యత వహిస్తున్న పంచాయతీ -గ్రామీణాభివృద్ధి శాఖలకు సింగ్ మొన్న శనివారం నాడు రాజీనామా సమర్పించారు. మిగిలిన శాఖలు ఆయన దగ్గరే ఉన్నప్పటికీ, ‘రాజీనామాస్త్రం’ ఆ రాష్ట్ర ప్రభుత్వంలోనూ, కాంగ్రెస్ పార్టీలోనూ పెద్ద కలకలం సృష్టిస్తోంది. “ఆ ఉత్తరం అధికారికంగా ఇంకా నాకు అందలేదు, మీడియా ద్వారానే తెలుసుకున్నాను” అని ముఖ్యమంత్రి భూపేశ్ అంటున్నారు. ఆదివారం రాత్రి ముఖ్యమంత్రి అధికార నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేకమైన సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ ఛార్జ్పీ ఎల్ పునియా మాత్రం ఈ  సమస్య ప్రశాంతంగా సుఖాంతమవుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏం జరుగబోతుందో చూడాలి. ‘ప్రధానమంత్రి గృహ నిర్మాణ పథకం’ కింద పేదలకు ఇంతవరకూ ఒక్క ఇల్లు కూడా నిర్మించకపోవడం, ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా నిధులు కేటాయించక పోవడంపై సింగ్ దేవ్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ మ్యానిపేస్టోలో ఇది కీలకమైన హామీ. దీనిని నెరవేర్చకపోతే ఇటు పార్టీకి – అటు వ్యక్తిగతంగా తనకు ప్రజల్లో చెడ్డపేరు వస్తుందని ముఖ్యమంత్రి ఆరోపిస్తున్నారు. సుర్గుజా జిల్లాలోని హస్ దేవ్ అరంద్ అటవీ ప్రాంతంలో కోల్ మైన్ ప్రాజెక్టుల విషయంలోనూ సింగ్ దేవ్ కి ముఖ్యమంత్రితో విభేదాలు వచ్చాయి. ఇవన్నీ పైకి కనిపిస్తున్నప్పటికీ, ముఖ్యమంత్రి పదవీకాలాన్ని తనకు పంచలేదన్నదే ప్రధానమైన కారణమని భావించాలి. మరో ఏడాదిలోనే ముఖ్యమంత్రి భూపేశ్ పదవీకాలం ముగిసిపోతుంది. ఈ మూడునాళ్ల ముచ్చట కోసం సింగ్ దేవ్ ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నాడు ? దీని వెనకాల అదృశ్య శక్తులు ఇంకేమైనా ఉన్నాయా? భూపేశ్ ప్రభుత్వాన్ని కూల్చివేసే కుట్ర ఏమైనా జరుగుతోందా? తెలియాల్సి ఉంది.

Also read: హేయమైన హత్య

ఇద్దరూ కలహించుకుంటే బీజేపీకి లాభం

ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో వీరిద్దరూ పెద్ద నాయకులు. ముఖ్యమంత్రి భూపేశ్ ఓబీసీ వర్గానికి,కుర్మీ సామాజిక వర్గానికి చెందిన నేత. టీ ఎస్ సింగ్ దేవ్ సుర్గుజా రాజవంశానికి చెందిన రాజపుట్ సామాజిక వర్గీయుడు. వయస్సులో భూపేశ్ కంటే పదేళ్లు పెద్దవాడు.ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలలో అత్యంత సంపన్నుడు. 2018 ఎన్నికల్లో 15 ఏళ్ళ బిజెపి పాలనకు ముగింపు పలికి, అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని అందించడంలో వీరిరువురి పాత్ర గణనీయమైంది. ఇద్దరికీ కాంగ్రెస్ తో ఎంతో అనుబంధం ఉంది. ఎంతో రాజకీయ అనుభవం ఉంది. పంజాబ్ కాంగ్రెస్ పార్టీ తరహాలో.. వీరిద్దరూ కొట్టుకొని బిజెపికి రేపటి ఎన్నికల్లో తిరిగి అధికారాన్ని అప్పగించినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఇప్పటికీ అక్కడ బిజెపికి క్షేత్రస్థాయిలో మంచి బలం ఉంది. ఆ రాష్ట్రంలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ -71, బిజెపి – 14 సీట్ల బలంతో ఉన్నాయి. అసెంబ్లీ స్థానాల ప్రకారం చూస్తే, ప్రస్తుతానికి కాంగ్రెస్ చాలా బలంగా ఉంది. ఇంతటి సంఖ్యాబలాన్ని ఉంచుకొని అధికారాన్ని కోల్పోతే  కాంగ్రెస్ కు అంతకుమించిన పరాభవం ఇంకొకటి ఉండదు.  ముఖ్యమంత్రి భూపేశ్ – మంత్రి టీ ఎస్ సింగ్ దేవ్ మధ్య రగులుతున్న వివాదాలను తమకు అనుకూలంగా మలచుకుంటే అక్కడ బిజెపికి తిరుగుండదు. ఈ తరుణంలో,కాంగ్రెస్ అధిష్టానం వేసే అడుగులు కీలకంగా మారనున్నాయి.

Also read: ఎట్టకేలకు గద్దె దిగిన బోరిస్ జాన్సన్

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles