Sunday, December 22, 2024

బొందితో కైలాసం, త్రిశంకు స్వర్గం

రామాయణమ్13

మహాదేవుడు ప్రసాదించిన వరములతో ఇనుమడించిన దర్పముతో, రెట్టించిన ఉత్సాహంతో మరల వశిష్ట మహర్షి ఆశ్రమం మీద దండెత్తాడు విశ్వామిత్రుడు.

వెళ్ళీ వెళ్ళడంతోటే మొత్తం తపోవనాన్ని బూడిదకుప్పగా మార్చేశాడు. ‌ఠారెత్తిన మునిగణం తలోదిక్కుకు పారిపోయారు!

ఆవరించిన నిశ్శబ్దముతో,  దైన్యాన్ని ప్రకటిస్తూ క్షణాలలో మరుభూమిగా మారిపోయింది వశిష్ట మహర్షి ఆశ్రమము.

Also read: వశిష్ట, విశ్వామిత్రుల సంఘర్షణ

ప్రాణిశూన్యమైన ఆశ్రమాన్ని చూసి వశిష్ట మహర్షి కోపంతో ‘‘మూర్ఖుడా! ఎంతోకాలం నుండీ పెంచిన ఆశ్రమాన్ని, పోషించిన జీవజాలాన్ని అనాలోచితంగా నాశనం చేసావుగదా! రా! నీ ప్రతాపం నా పైచూపించు అని బ్రహ్మదండాన్ని ఎత్తిపట్టి మహోగ్రరూపం దాల్చి విశ్వామిత్రుడికి ఎదురుగా నిలబడ్డాడు!

విశ్వామిత్రుడు అవకాశం వచ్చింది కదా అని ఆగ్నేయ, వారుణ, రౌద్ర, ఐంద్ర, పాశుపత, ఐషికాస్త్రములన్నిటినీ ప్రయోగించాడు. అవి అన్నీ వశిష్ట మహర్షి బ్రహ్మదండంచేత నిలువరింపబడి నిర్వీర్యము చేయబడ్డాయి!

అప్పుడు విశ్వామిత్రుడు పట్టరాని క్రోధంతో సకల ప్రపంచాలనూ భస్మీపటలం చేయగల బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. దానిని కూడా వశిష్టుని బ్రహ్మదండం నిష్ప్రయోజనం చేసింది.

ఆ విధంగా సృష్టిలోని సకలాస్త్రములు, విశ్వామిత్రుని క్షాత్రము, వశిష్టుడి బ్రహ్మతేజం ముందు వెలవెల పోయినవి.

అప్పుడు మరొక సారి భంగపాటు పొందిన విశ్వామిత్రుడి మదిలో ఆలోచన మొదలయ్యింది! అన్ని శస్త్రములు వికలమయినవి, అన్ని అస్త్రములు విఫలమయినవి!

Also read: అహల్య శాపవిమోచనం

‘‘ఆహా! బ్రహ్మర్షి ఎంత శక్తివంతుడు! ఇక నుండీ నా సర్వ శక్తులూ వినియోగించి బ్రహ్మర్షి పదం సిద్ధింపచేసుకుంటాను’’ అని సంకల్పించుకు‌న్నాడు.

ఆ ఆలోచన రావడమే తరువాయి అమలులో పెట్టేశాడు విశ్వామిత్రుడు. తీవ్రమైన తపస్సు వేయి సంవత్సరములు చేశాడు! అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ‘‘నీవు ఈ తపస్సువల్ల రాజర్షివైనావు’’ అని పలికాడు! అదేమిటి నేను బ్రహ్మర్షిని కానా? అని ప్రశ్నించాడు విశ్వామిత్రుడు. ‘‘కావు!’’ అని సమాధానమిచ్చి అంతర్ధానమయినాడు బ్రహ్మదేవుడు.

సిగ్గుతో చితికి పోయిన విశ్వామిత్రుడు మరల తీవ్రమైన తపస్సు చేయనారంభించాడు! ఇలా తపస్సు చేస్తుండగా ఒక రోజు ఆయన వద్దకు త్రిశంకువు అనేరాజు వచ్చాడు. త్రిశంకువు ఇక్ష్వాకు వంశపు రాజు! ఆయనకు తన శరీరంతో స్వర్గానికి వెళ్ళాలనే కోరిక కలిగింది. ఆ కోరిక తీర్చటానికి యజ్ఞం చేయమని కులగురువు వశిష్ట మహర్షిని అడిగాడు!

Also read: భగీరథయత్నం, గంగావతరణం

అందుకు ఆయన నిరాకరించి ఇది సాధ్యమయ్యే పనికాదు అని చెప్పిపంపేశాడు. త్రిశంకువు వశిష్టుడి కుమారులవద్దకు వెళ్ళి మీతండ్రి నిరాకరించగా వేరే మార్గము కానరాక మీ వద్దకు వచ్చాను నన్ను బొందితో స్వర్గానికి పంపండి అని అడిగాడు అందుకు వారు కూడా నిరాకరించి కులగురువు మాట పాటించని నీకు భయంకరమైన, జుగుప్సాకరమైన రూపం కలుగుగాక అని శాపం ఇచ్చారు. ఆ రూపాన్నిచూసి బెదిరిపోయి అప్పటివరకు ఆయనను అంటి పెట్టుకున్న మంత్రి, సామంత, పురోహితులు, అందరూ దూరమయ్యారు. అప్పుడు ఆయనకు విశ్వామిత్ర రాజర్షి మదిలో మెదిలాడు.

 ఆయనను ఆశ్రయించి వశిష్టుడు తనను ఎలా నిరాదరించిందీ, ఆయన పుత్రులు ఏవిధంగా శపించిందీ తెలియచెప్పి ‘‘ఆయన చేయలేని పని నీవు చేయగలవు అని నీవద్దకు వచ్చాను. నన్ను సశరీరంగా స్వర్గానికి పంపగలవా!’’ అని తన కోరిక వెలిబుచ్చాడు.

తన శత్రువు వశిష్టుడు నిరాకరించాడు కాబట్టి తాను చేయాలి అనే భావనతో సకల మునిగణాలనూ బెదిరించి తన ఆశ్రమానికి పిలిపించి యజ్ఞానికి శ్రీకారం చుట్టాడు విశ్వామిత్రుడు. ఈయన బెదిరింపులకు లొంగని వశిష్ట పుత్రులను శపించి నాశనం చేశాడు. అంత నష్టపరచినా కూడా వశిష్టమహర్షి శాంతంగానే ఉన్నాడు.

యజ్ఞపరిసమాప్తి రోజు త్రిశంకువును శరీరంతో స్వర్గానికి పంపాడు విశ్వామిత్రుడు.

Also read: కపిల మునిపై సగరుల దాడి

కానీ అందుకు ఇంద్రుడు నిరాకరించి అతనిని స్వర్గం నుండి పడదోశాడు. త్రిశంకువు గింగరాలు తిరుగుతూ భూమిని సమీపిస్తూ కాపాడమని కేకలు వేశాడు. తన దండం ఎత్తిపట్టి అతనిని ఆకాశంలో ఉన్నచోటునే నిల్పిన విశ్వామిత్రుడు తీవ్రమైన కోపంతో భూమికి దక్షిణదిక్కుగా ఇంకొక స్వర్గాన్ని, ఇంకొక ఇంద్రుడిని, గ్రహ తారకలను సృష్టించబూని మొదట కొన్ని గ్రహతారకలను సృష్టించాడు.

ఈయన తలపెట్టిన కార్యం చూసిన దేవతలు పరుగుపరుగున వచ్చి మహర్షిని శాంతపరచి త్రిశంకువు చిరకాలం అలాగే తలక్రిందులుగా రోదసిలో ధృవముగా ఉండేటట్లు అనుగ్రహించి వెళ్ళిపోయారు.

తను ఎంత తపఃశక్తి  నష్టపోయాడో గ్రహింపుకొచ్చిన ఆయన మరల తపస్సు మొదలుపెట్టాడు.

 ఒక వేయి సంవత్సరములు మరల తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీవు ఋషివయినావు అన్నాడు. తరువాత మరల ఏవో భావావేశాలకు లోనయి తన తపస్సును పాడు చేసుకున్నాడు విశ్వామిత్రుడు.

మరల కధ మొదటికొచ్చింది. పట్టువీడక తిరిగి తపస్సుచేశాడు.
Also read: మారీచ, సుబాహుల సంహారం

ఈసారి బ్రహ్మగారు నీవు మహర్షివయినావు అని అన్నాడు. తను చేరుకోవలసిన గమ్యం చాలా దూరమున్నది అని గ్రహించిన ఆయన మరల తపస్సుకు కూర్చున్నాడు.

ఈయన తపస్సువలన తనపదవికి ఎక్కడ మూడుతుందో అని భయపడిన ఇంద్రుడు తపస్సు చెడగొట్టమని మేనకను పంపిచాడు.

మేనక అందానికి వశుడయ్యాడు విశ్వామిత్రుడు! పదివేల సంవత్సరాలు సర్వం మరచి ఆవిడే లోకంగా బ్రతికాడు.

తను దారి తప్పిన విషయం ఒకరోజు అన్నిసంవత్సరాల తరువాత హఠాత్తుగా గుర్తుకు వచ్చింది ఆయనకు! మేనకను పంపివేసి మరల తపస్సు మొదలు పెట్టాడు విశ్వామిత్రుడు.

Also read: తాటకి వధ

N.B

ఇప్పటి దాక అయిన విశ్వామిత్ర చరిత్ర మనకు చెపుతున్నదేమిటి?

1). మనిషికి భావావేశం కలిగినప్పటికీ వాటిని తన అదుపులో ఉంచుకోగల సమర్ధత కలిగి వుండాలి. భావావేశం అదుపులో ఉంచుకోవడం అంత తేలికేం కాదు. అందుకు నిరంతర సాధన కావాలి. అదే తపస్సు!

 విశ్వమిత్రుడిలో మదం, ఆతరువాత కోపం, ఆ తరువాత అసూయ, అహంకారం, కామం ….ఇలాంటి గుణాలన్నీ ప్రకటితమయి తానేం నష్టపోతున్నాడో వాటివల్ల గ్రహింపుకొచ్చి మరల మరల తపస్సు చేయసాగాడు! అంటే ప్రతిసారీ  

Self Introspection…,Reconciliation ..చేసుకొని తనను తాను మెరుగు పరచుకొన్నాడు. ఇదే ప్రతిమనిషికి కావలసినది!

2) మన విశ్వానికి ఆవల ఎన్నో విశ్వాలున్నవి అని నేటి శాస్త్ర వేత్తలు మొన్నమొన్ననే కనుక్కున్నట్లుగా చెపుతున్నారు. కానీ మన విశ్వానికి ఆవల ఇంకొక విశ్వముండవచ్చు అనే భావన భారతీయులకు రామాయణం కాలం నాటికే ఉన్నది అని త్రిశంకువు కధచెపుతున్నది …ఇదీ భారతీయమంటే!

Also read: విశ్వామిత్రుని వెంట రామలక్ష్మణులు

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles