రామాయణమ్ – 138
ఆమె కన్నీరు వెల్లువైపొంగింది. అంతులేని బాధ. తీవ్రమైన వేదన. ఒక పక్క భర్తృవియోగము. ఇంకొకపక్క రావణుడి వేధింపులు. రాక్షసస్త్రీల సాధింపులు.
ఆమె క్షణమొక యుగము లాగ గడపసాగింది.
బ్రతుకు దుర్భరమైపోయింది.
ఒక్కసారిగా భర్త, మరిది, అత్తగారు అందరూ గుర్తుకు వచ్చి శోకము గంగానదిలాగ ఉప్పొంగి ఉప్పెనై ముంచెత్తింది.
Also read: సీతను దారికి తేవాలని రాక్షసస్త్రీలను ఆదేశించిన రావణుడు
సమయము రానంతవరకు ఆ కాలుడికి కూడా దయ కలుగదు కాబోలు. ‘‘అయ్యో నాకు మరణము రాదేమి?’’ అని పసిబాలలాగ విలపించసాగింది జనకరాజపుత్రి జానకీదేవి,
ఉన్మత్తతతో, ప్రమత్తతతో, భ్రాంతచిత్తముతో నేలపైపడి దొర్లుచూ రోదించసాగింది సీతామహాసాధ్వి.
‘‘ఇది హృదయమా లేక పాషాణమా? ఇంత జరిగినప్పటికీ బ్రద్దలగుటలేదు. ఇది గుండెయా లేక ఇనుపగుండుయా? వ్రయ్యలగుటలేదు. నా రామునకు దూరమయి కూడా బ్రతుకుచుంటినే.ఛీ ! నాదీ ఒక బ్రతుకేనా ! నన్ను ఖండఖండములుగా చీల్చనీ. నా శరీరభాగములు భక్షించనీ. ఇక నేను రామునికి దూరముగా యుండి బ్రతుకు పోరాటము సాగించలేను. ఆ ఆరాటము నాకెంతమాత్రమూ లేదు. ఆ దుర్మార్గుని ఎడమ కాలిగోటితో కూడా స్పృశించను. వాడు నన్ను కత్తి కొక కండగా కోసినా, రాతికేసి బ్రద్దలుకొట్టినా, నిప్పులపై పడవేసినా వానిని చేరనుగాక చేరను.
Also read: ‘నువ్వు గడ్డిపోచతో సమానం’ అని రావణుడికి స్పష్టం చేసిన సీత
‘‘అయ్యో, వీరాధివీరుడు! జగదేకశూరుడు! జనస్థానములో ఒంటరిగా పదునాల్గువేలమందిని మట్టుపెట్టిన నా నాధుడు ఇంకనూ రాలేదంటే నా అదృష్టము బాగుండనట్టే! నేను ఇక్కడ ఉన్నట్లు నా రామునికి బహుశా తెలియదేమో! తెలియుటకు అవకాశమెక్కడున్నది? నా ఆచూకీ చెప్పగల గృధ్రరాజు జటాయువును ఈ పాపాత్ముడు చంపి వేసినాడే!
‘‘నేనిక్కడ ఉన్నట్లు తెలిసిన మరుక్షణము లోకములో రాక్షసజాతిలేకుండగా నాశనము చేయగల సమర్ధుడు శ్రీరాముడు.’’
సీతమ్మ ఆలోచనలు అంతం లేకుండా సాగుతున్నాయి.
బ్రతుకు మీద ఆశపోయింది ఆ మహాఇల్లాలికి!
అప్పుడే నిద్రలేచిన ఓ వృద్ధరాక్షసి, త్రిజట అను పేరుగలది రాక్షస స్త్రీలు సీతమ్మను బెదిరించటం చూసి, వారి వద్దకు వచ్చి ‘‘ఓసీ, మీరు భక్షించవలసినది ఆమెను కాదు. మిమ్ములను మీరు భక్షించుడు. మీకు పోగాలము దాపురించినది.
Also read: సీతను సుముఖం చేసుకోవడానికి రావణుని ప్రేలాపన
ఇప్పుడే నాకు ఒక భయంకరమూ, రోమాంచితమూ అయిన కల వచ్చింది. అది రాక్షస నాశనము, రాముని అభ్యుదయమును సూచించుచున్నది.’’
అని పలుకగనే !
‘‘ఏమేమీ కలవచ్చినదా! ఎట్టెట్టా! మాకు చెప్పరాదా? ఆ కలలో ఏ విశేషాలు ఉన్నవి? మాకు కూడా చెప్పవే’’ త్రిజటాఅంటూ ఆమె చుట్టూ మూగారు.
‘‘ఆ కలలో…
లక్ష్మణసమేతుడై రాముడు తెల్లని వస్త్రములు, తెల్లని మాలలు ధరించి వెయ్యిహంసలు మోసే పల్లకి ఎక్కి వచ్చినాడు. సీతమ్మకూడా తెల్లని వస్త్రములు ధరించి చుట్టూ సముద్రమున్న తెల్లని పర్వతము మీద ఉన్నట్లుగా నాకు కలవచ్చింది.
‘‘అక్కడ సీతమ్మ రాముని కలసికొని మరల ఆ హంసల పల్లకి ఎక్కి రాముని అంకముపై కూర్చుండి ఉత్తరదిక్కుగా వెళ్ళినట్లు నాకు కనపడినది.
Also read: భీతిల్లే లేడికూన సీత
‘‘ఆ కలలో !
‘‘రావణుడు ఎర్రని వస్త్రములు, ఎర్రని పుష్పముల మాలలు ధరించి వంటినిండా నూనె కొంత పూసుకొని, కొంత త్రాగుతూ మత్తుగా నేలపై పడి ఉన్నాడు. ఆతని శిరస్సుపై ఉన్న వెంట్రుకలు గొరగబడి గుండు చేయబడి ఉన్నాడు. అతనిని ఒక స్త్రీ ఈడ్చుకొనుచూ దక్షిణ దిక్కుకు వెళ్ళినట్లు కూడా నాకు కనపడినది.
‘‘ఆ రావణుడు భయముచేత పీడితుడై, కంగారు పడుచూ, మదముతోవ్యాకులుడై, ఉన్మాదివలే ఏవేవో ప్రేలుతూ భరింపలేని దుర్గంధముతో నిండి ఉన్న మలపంకములో కూరుకొనిపోయెను.
‘‘ఇదే విధముగా కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు, ఇతర రావణకుమారులూ నాకు కనపడిరి. వారంతా దక్షిణదిక్కుకు ఈడ్చుకొని పోబడినట్లు కనపడినది. ఒక్క విభీషణుడు మాత్రము శ్వేతఛత్రము ధరించి తెల్లని మాలలు వస్త్రములు ధరించి నాలుగు దంతాల ఏనుగు నెక్కి నలుగురు మంత్రులతో కూడి ఆకాశము మీద యుండెను.
‘‘రాక్షసులందరూ గుమికూడి తైలము త్రాగుతూ ఎర్రని మాలలు ధరించినట్లు నేను కనుగొంటిని.
‘‘సీతమ్మ రాముని ప్రియ సతి. ఆమెనిక మీరు బాధించవద్దు. ఆమెను శరణు వేడండి. ఆవిడ కరుణాసముద్ర! అభయమివ్వగలదు’’ అని పలికి త్రిజట ఊరకున్నది.
Also read: ఆమె ఎవరు?
వూటుకూరు జానకిరామారావు