సరిగ్గా పదేళ్ళ క్రితం నాటి సంగతి. సోషలిస్టు సంఘాలన్నీ కలిసి తలపెట్టిన కార్యక్రమానికి ముంబయి దగ్గర్లో గ్రామానికి రావెల సోమయ్య గారితో వెళ్ళాం. అక్కడే పరిచయం ప్రేమనాథ్. అసలాయన కలుపుగోపుతనం చూసినవారెవరైనా కేరళలో ఆయనొక పేరెన్నికగన్న ప్రజానేతనీ, లోక్ యంత్ర జనతాదళ్ నుండి శాసన సభ్యుడిగా (M L A) చేసిన వ్యక్తనీ అనుకోరు!
రాజకీయ నాయకులంటే మన మనసుల్లో పాతుకుపోయిన చిత్రం ‘ప్రేమ్ నాథ్’ వంటి ప్రజాపక్ష నాయకుల్ని చూసినప్పుడు పటా పంచలై పోతుంది. తెల్లటి పంచ, చొక్కా, కండువా వేసుకుని స్వచ్ఛందంగా వచ్చి పలకరించి పరిచయం చేసుకున్న ఆ వ్యక్తిని అదే కలవడం మొదటిసారి, చివరిసారి కూడా!
అక్కడున్న మూడ్నాలుగు రోజులు ఆయన ఎంతో అభిమానంతో పంచుకున్న ఎన్నో సంగతులు విన్నాను. ఆయన ధైర్యంగా మళయాళంలో నడుపుతున్న పత్రిక మొదలు, ఆధిపత్య విధానాలకు వ్యతిరేకంగా నిర్మిస్తున్న ఉద్యమం వరకూ ఎన్ని విషయాలు చెప్పారో. తర్వాత ఒకట్రెండు సార్లు ఫోన్లో మాట్లాడు కోవడమే. అంతటి ప్రజాదరణ ఉన్న నేత కాసేపటి క్రితమే మరణించారని తెలిసింది!
చిన్న వయసులోనే సమాజవాద స్వప్నాన్ని కాంక్షించీ, ప్రజానేతగా ఎన్నికయ్యీ, ప్రజాసేవలో జీవితాన్ని సార్ధకం చేసుకుని, ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం తపించిన వ్యక్తి ప్రేమ్ నాథ్. అలాంటి మనిషి లేకపోవడం దేశంలోని సమతావాద శ్రేణులన్నింటికీ తీరని లోటు. కనీసం నేనే కాల్ చేసి ఓసారి పలకరించుంటే బావుండేదనే భావన సేవైన ఆయన నంబరు చూసి నప్పుడు కలిగింది. ఆయన ఆశయాల సాధన కొన సాగుతుందని ఆశిస్తూ, ప్రేమనాథ్జీ కి హృదయపూర్వక కన్నీటి నివాళులు!
– గౌరవ్