సబ్బం హరిగారికి ఎందుకో నేనంటే చాలా ఇష్టం. తొలుత, వృత్తిలో భాగంగా నాకు పరిచయమైనా, అతి తక్కువకాలంలోనే మా ఇద్దరి మధ్య మంచి స్నేహం చిగురించింది. ఆ స్నేహం చివరి క్షణం వరకూ అలాగే కొనసాగింది. వ్యక్తిగతంగా కలిసినా, ఫోన్ లో మాట్లాడుకున్నా మా ఇద్దరి సంభాషణ కొన్ని గంటలు సాగేది. వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని మొట్టమొదటిసారిగా వాళ్ళింట్లోనే కలుసుకున్నాను. జగన్ ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చినప్పుడు సబ్బం హరి ఇంట్లోనే విడిది చేశారు. ఆ సందర్భంగా సబ్బం హరి ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించి జగన్ కు పరిచయం చేశారు. నా గురించి ఆయనకు చాలా మంచి మాటలు చెప్పారు. ముగ్గురం అరగంటకు పైగా మాట్లాడుకున్నాం. అది నేను విశాఖపట్నంలో హెచ్ ఎంటీవీ రీజనల్ న్యూస్ బ్యూరో చీఫ్ గా ఉన్న సందర్భం.
విచిత్ర సందర్భం
ఒకసారి ఒక విచిత్ర సందర్భం ఏర్పడింది. సబ్బం హరిగారి పుట్టినరోజు సందర్భంగా సాక్షి దినపత్రిక వాళ్ళు ఆయనతో ప్రత్యేక ఇంటర్వ్యూ ప్రణాళిక చేశారు. నేను అప్పుడే హరిగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి వెనక్కు వచ్చాను. ఇంతలో హరిగారి నుంచి ఫోన్ వచ్చింది. ఎందుకో అనుకొని వెళ్ళాను. సాక్షివాళ్ళు నా ఇంటర్వ్యూ అడుగుతున్నారు… మీరు చేస్తానంటేనే వాళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తాను అన్నారు. అదేంటి సార్ ఆ సంస్థ వేరు.. మా సంస్థ వేరు కదా అన్నాను. అవన్నీ నాకు తెలియదు. మీరే చెయ్యాలి అన్నారు. అప్పుడు రామచంద్రమూర్తిగారు హెచ్ఎంటీవీ చీఫ్ ఎడిటర్ గా ఉన్నారు. వారు అనుమతి ఇస్తే.. నాకేమీ అభ్యంతరం లేదని చెప్పాను. హరిగారు రామచంద్రమూర్తిగారి నుంచి అనుమతి తీసుకున్నారు. అదే విధంగా సాక్షి పెద్దల నుంచి కూడా అనుమతి సంపాయించారు. అలా ఒక ఛానల్ లో పని చేస్తూ, ఇంకొక పెద్ద పత్రికకు ఒక నాయకుడిని ఇంటర్వ్యూ చేసే ప్రత్యేకమైన అవకాశం వచ్చింది. ఆ ఇంటర్వ్యూ కూడా బాగా వచ్చింది. సాక్షి పత్రికలో ప్రధానంగా ప్రచురించారు. నా కెరీర్ లో ఇదొక గుర్తుపెట్టుకొనే సందర్భం.
ఆత్మీయులు ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు
సరే! ఆ తర్వాత నేను హైదరాబాద్ వచ్చేశాను. హరిగారికి – జగన్ కు విభేదాలు వచ్చాయి. చివర్లో తెలుగుదేశం పార్టీలో చేరారు. అది వేరే కథ. ఆ రాజకీయాలతో నాకు ఎటువంటి సంబంధం లేదు. నాతో ఆత్మీయంగా ఉంటూ, నన్ను ఎంతో ఇష్టపడే నాయకులలో సబ్బం హరిగారు ఒకరు. ఈ మధ్యకాలంలో, ఒక్కొక్క ఆత్మీయుడిని కోల్పోతూ వస్తున్నాను.మొన్న గీతం అధినేత ఎంవివిఎస్ మూర్తిగారు, నిన్న ద్రోణంరాజు శ్రీనివాస్, నేడు సబ్బం హరిగారు. గొప్ప విషాదం.. జీవన ప్రయాణంలో… కన్నీటి చారలు…
(మాజీ పార్లమెంటు సభ్యులు సబ్బం హరి సోమవారం ఉదయం విశాఖపట్టణంలో కన్నుమూశారు)