ఒక దుఃఖపూరిత భావావేశం
నిఖార్సైన కులనిర్మూలనవాదికి నివాళి
పదేళ్ళనాటి సంగతి. తిండెక్కువ కాలేదు కాన ఒళ్ళూ, తిరగడమే జీవితంగా ఉండేది కనుక కళ్ళూ ఇంతగా నెత్తికెక్కలేదు. కేసుల వల్ల యూజిలో ఉండేవాడ్ని. ఆహాఓహో కొట్టిన చాలామంది అసలు విషయాని కొచ్చే సరికి కలిసిరారని, మనిషి పోరాటం ఎప్పుడూ ఒంటరేనని ప్రాక్టికల్ గా తెలుస్తున్న కాలం. అలాంటి పరిస్థితుల్లో నా పోరాటాన్ని తన పోరాటంగా చేసుకున్న ప్రజా ఉద్యమకారుడు ఎవరైనా ఉన్నారంటే అది కెమేరా విజయకుమార్!
Also read: అజరామర అక్షరాగ్ని శిఖరం, అఖండమైన ప్రజా కవిత్వం అలిశెట్టి ప్రభాకర్!
“ప్రశ్న అధ్యయన వేదిక.” ఎలాంటి పేరది. పేర్లోనే ప్రశ్న ఉండేది. నాస్తిక, హేతువాద, కమ్యూనిస్టు, చివరాఖరికి విప్లవ సంఘాలనబడే వాటిల్లో కూడా కులతత్వాన్ని చూసిన ఆయన, ఇంటి పేరులో కులాన్ని వెతికే దేశంలో ఉండబట్టలేక తన హాబీ ఫొటోగ్రఫీ చిహ్నంగా కెమేరానే ఇంటి పేరు చేసుకున్నాడు. ఎంత మంది కుళ్ళుకున్నా సరే పట్టించుకోకుండా నేను లేకుండా నా పుస్తకాలెన్నో అన్నీ తానై చాలా ఇష్టంగా ఆవిష్కరణ కార్యక్రమాలు జరిపిన వాడు, నా అక్షరాల్ని నా కంటే ఎక్కువగా ప్రేమించి స్టాళ్ళు పెట్టి ప్రజల దగ్గరికి తీసుకు వెళ్ళినవాడు, ‘కులానికో సవాలు’ వంటి రచన ప్రచురించి దుమారం రేపిన యోధుడు!
అన్నీ కాదు కానీ ఒకట్రెండు సందర్భాలు కచ్చితంగా గుర్తుంచుకోవాలి.”మతానికి మరణ శాసనం, మనిషికి పునరు జ్జీవనం” చదివిన కీ. శే. ఎండ్లూరి సుధాకర్ గారు ఒక సాయంత్రం ఫోన్ చేసి అభినందించారు. తర్వాత కీ. శే. పుట్ల హేమలత నా ‘ధిక్కార స్వరాలు’ ఆవిష్కరించారు. సాంస్కృతిక రాజధానిగా పేరొందిన రాజమహేంద్రవరంలో మహ్మద్అఖ్లక్ హత్య తర్వాత నేనూ, రవికాంత్, కెమేరా విజయకుమార్ గారు కల్సి ఏకంగా బీఫ్ ఫెస్టివల్ కు పిలుపివ్వడం, అందుకోసం ప్రత్యేకంగా ఒక సంచిక ప్రచురించడం అప్పట్లో ఒక తిరుగులేని సంచలనం !
Also read: జీవితం మంచి కోసం వెచ్చించడమే మతం: శాస్త్రీయ, హేతువాద, సామ్యవాది వివేకానందుడు
అది కాదు అసలు విషయం. ఫెస్టివల్ కి అనుమతి లేదనీ మాష్టారు గారిని అరెస్టు చేసి డిఎస్పీ ఆఫీసుకి తీసికెళితే అక్కడ చారిత్రక కోలమూరు గ్రామంలో నిర్వహించడానికి అనుమతి ఇప్పించాల్సిందిగా అప్పటికప్పుడు పోలీసుశాఖకి అర్జీ ఇవ్వడంతో అక్కడున్న అధికారులు సైతం విస్తు పోయారు. అంతటి ధైర్యం ఉన్న వ్యక్తిని నేను చూడలేదు. ఎన్ని కేసులు, పిర్యాదులు, గొడవలు…దళిత బహుజనులు గుర్తుంచుకు తీరవలసిన మహా వ్యక్తాయన. అనేక అణగారిన శ్రామిక కులల ఆత్మబంధువు. డా. బి. ఆర్. అంబేద్కర్ ని వంద ఎడ్లబండ్ల మీద ఊరేగించిన చారిత్రక గ్రామం కృష్ణాజిల్లా అంగలూరులో పుట్టిన వ్యక్తి. కవిరాజు త్రిపురనేనిది కూడా అదే గ్రామం. సామాజిక కార్యకర్తగా కులనిర్మూలన కోసం నాకో దిక్సూచి అందించిన అసాధారణ ఉద్యమ కారుడు!
ఈరోజు వీర విప్లవ వీరంగాలు చేస్తున్న అనేక మంది మిత్రులు ఆరోజు అయిపూజాడా లేరు సరికదా, తర్వాత చాలా కాలం ఆ భయంతో మాకు దూరంగానే మసులుతూ వచ్చారు. We Don’t Care. ఇంకా మేం కల్సి చేద్దామని చేయలేకపోయిన అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ‘అంటరాని వసంతం’ పై ఒక సమాలోచన సమావేశం. Annihilation Of Caste గురించిన విస్తృత స్థాయి చర్చా కార్యక్రమం. మార్క్సిజం – కులసమస్యపై మీటింగ్. అలాగే బౌద్ధ దార్శనికత కోసం ఉద్దేశించిన ఒక విశిష్ట సదస్సు. దళిత బహుజనులపై జరిగిన దాడుల ఫొటోలు, వివరాలతో ఒక ఎగ్జిబిషన్. ఏదీ అవలేదు. ఒక రకంగా నన్ను ఒంటరిని చేసి హఠాత్తుగా ఆయన మరణించడంతో కార్యాచరణ కుంటుబడింది!
Also read: చీకటి రాత్రులు – వేకువ వెలుగులు
రోహిత్ వేముల హత్య జరిగాక తదనంతర కార్యక్రమాలు అన్నింటినీ ప్రత్యేకంగా హైదరాబాద్ మొదలుకొని ఢిల్లీ వరకూ వెళ్ళి రికార్డు చేశారు. కోల్ కతా నుండి ఝాన్సీ వరకూ కోరుకొండతో మొదలెడితే కోలమూరు దాకా ఆయన కెమేరా, నోటు పుస్తకం పట్టుకుని స్వయంగా వెళ్ళి వందలాది ప్రాంతాల చరిత్ర రికార్డు చేసిన తీరు ఫీల్డ్ వర్క్ అంటే ఎలా ఉంటుందో చెప్పకనే చెబుతుంది. దళిత బహుజనులపై ఎక్కడ దాడి జరిగినా ఆయన ముందుండేవాడు. శిరోముండనం కేసులో బాధితుల పక్షాన నిల్చి మొట్టమొదటి ఫొటో తీసిన వ్యక్తి. అంతేకాదు, కులగజ్జి ఎంతగా పాతుకుపోయిందో అక్షరాల్లో పెట్టి అద్భుతమైన కథలు, వ్యాసాలు రాసిన సాహిత్యకారుడు!
ఆయన ఇంటర్వ్యూ ‘ధిక్కార స్వరాల్లో’ రికార్డు చేయడం నాకో తృప్తి. కులనిర్మూలన తదితర అంశాల కోసం అడపా దడపా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నా, అంతటి సీరియస్నెస్, దార్శనికత, నిర్మాణాత్మకత ఉన్న మిత్రులు నాకెవరూ కనబడలేదు. ఈ దేశంలోని కుల సమస్యకి బహుముఖ పరిష్కారాన్ని సూచించిన అతి తక్కువ మంది మేధావుల్లో విజయకుమార్ గారొకరు. ఆయన నెగిటివ్ కథలు బ్రాహ్మణీయ కులతత్వంతో కంపు కొడుతున్న తెలుగు సాహిత్యకారుల వెలుగు ప్రసరించని విలువైన బతుకు వ్యథలు. ఏనాటికైనా ఆయన ఇతర రచనలు కూడా వెలుగుచూస్తే బావుణ్ణు!
Also read: అభివృద్ధి – ఆదివాసులు – హింస
అందరిచేత గొడవ మనిషనిపించుకున్న మార్క్స్, అంబేద్కర్, ఫూలే ధోరణులు మేలు కలయిక కెమేరా విజయకుమార్. ఈ మధ్య కాలంలో స్తబ్ధత నిండిన జీవితంలోని ప్రతీ పార్శ్వంలోనూ ఆయన గుర్తుకొస్తున్నాడు. ఇతర మిత్రులు కలిసొస్తే ప్రత్యేకంగా ఆయన కోసం ఒక బుక్లెట్ తీసుకువద్దామని ఉంది. ఇప్పుడా వ్యాసాలు, రచనలు ఎక్కడున్నాయో తెలీదు. ఆర్ధిక లావాదేవీలు మాత్రమే ప్రధానమైనచోట ఆత్మీయ విలువలకి తావుండదు. ఆయనతో ఉన్న అనేక విభేదాల సాక్షిగా I Miss Him A lot !
(ఈరోజు ప్రత్యేకంగా ఇదంతా ఎందుకంటే, ఈ జనవరి లో 70 వ జయంతిని పూర్తి చేసు కుంటున్న ఆయన గురించి ఏమీ చేయలేదనే బాధ మనసుని తొలిచేస్తోంది. రోహిత్ వేముల కోసం ఆయన నిర్మిద్దామనుకుని కష్టపడ్డ డాక్యుమెంటేషన్ కూడా అందుబాటులో లేదు. వాకింగ్ కోసం ప్రత్యేకంగా కరపత్రం వేస్తూ దాంట్లో నా స్పూర్తితో అంటూ కుల నిర్మూలన కోసం ఒక సూచన ప్రతిపాదించడం. అది చూసి పేరెందుకని నేను కోప్పడితే మళ్ళీ నా పేరు తీసేసి ఇంగ్లీషు లో కూడా ప్రచురించి ఉదయం పార్కుల్లోకి వెళ్ళి మరీ పంచడం. ఇదంతా తల్చుకుంటే ఈ రోజుకీ నాకు ఎంతగానో అబ్బురం, ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన సోషల్ మీడియా లో active గా ఉన్న కాలంలో నేనసలు FB ఈ మాత్రం కూడా వాడే వాడ్ని కాదు. ఇప్పుడు ఏం రాసినా చూడటానికి ఆయన లేరు. ఈ రోజు ఉదయాన్నే ఆయన FB లో దొరికిన పాంప్లెట్స్ తో పాటు కాస్త ఆలస్యంగా ఐనా, ఆయనకీ రోహిత్ వేములకీ చిరునివాళిగా పాత జ్ఞాపకాల గురించిన ఫొటోలతో ఈ చిన్న రైటప్ !)
Also read: ‘మతాతీత మానవత్వమే మన మార్గం’
– గౌరవ్