- స్వరబ్రహ్మ 75వ జయంతినాడు గొప్ప నివాళి
- ఉదయం పది నుంచి రాత్రి పది వరకూ నిరవధికంగా గానామృతం
- తెలుగు చిత్రపరిశ్రమ అతిరథమహారథుల సన్నాహాలు
హైదరాబాద్: స్వరబ్రహ్మ ఎస్ పీ బాలసుబ్రహ్మణ్యం 75వ పుట్టిన రోజు జూన్ 4వ తేదీ. వజ్రోత్సవం సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ బాలూకి స్వరనీరాజనం ఏర్పాటు చేస్తున్నది. తెలుగు సినిమా హీరోలూ, దర్శకులూ, సంగీత దర్శకులూ, పాటల రచయితలూ పాల్గొనే ఈ సుదీర్ఘ కార్యక్రమాన్ని ఆసాంతం ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
‘‘జూన్ మొదటి వారాన్ని బాలూగారి 75వ జన్మదినం సందర్భంగా ఆయన స్మృతికి కేటాయించాలని సినిమా పరిశ్రమలో మేము నిర్ణయించుకున్నాం. తెలుగు సినిమా ప్రముఖులే కాకుండా భారత సినిమా ప్రపంచానికి చెందిన ఇతర ముఖ్యులు కూడా హాజరవుతారు. బాలూగారు భారతీయ సినిమాకి చేసిన సేవలను స్మరించుకోవడానికి ఇది ఒక చక్కని అవకాశంగా ఉంటుంది. ఇది 12 గంటలపాటు కొనసాగే కార్యక్రమం. సంగీత ప్రియులంతా ఇందులో పాల్గొనాలని మా ఆకాంక్ష,’’ అని తెలుగు డైరెక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.ఎస్.శంకర్ అన్నారు.
జూన్ 4న బాలుగారికి గొప్పగా నివాళి చెప్పాలని అనుకున్నాం. తెలుగు సినిమా పరిశ్రమ యావత్తూ ఇందులో పాల్గొనబోతోంది. మా సంగీత దర్శకుల సంఘం, దర్శకుల సంఘం, నిర్మాతల సంఘం, సినిమా పాటల రచయితలూ, అందరూ ఈ సభలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం గురించి వివరాలు మరోసారి తెలియజేస్తాం,’’ అని ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్ అన్నారు.
ఈ కార్యక్రమం ఎక్కడ జరిగేదీ, ఇతర వివరాలన్నీ త్వరలో తెలియజేస్తారు. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం కరోనాకి బలైన సంగతి విదితమే. గానగంధర్వుడు ఈ లోకం విడిచిపోయి చాలా మాసాలు అయినప్పటికీ కోవిద్ కారణంగా ఆయనకు సరైన నివాళి తెలుగు చిత్ర పరిశ్రమ కానీ తెలుగు సమాజం కానీ ఇవ్వలేకపోయింది. బెంగళూరులోకన్నడ చిత్ర పరిశ్రమం నివాళి ఘనంగా ఏర్పాటు చేసింది. తెలుగులో చిన్న ఎత్తున బాలూ సంస్మరణ కార్యక్రమాలు జరిగాయి కానీ ఆయన స్థాయికి తగిన విధంగా జరగలేదు. రేపు జూన్ మొదటి వారంలో జరగబోయేది పెద్ద నివాళి సభ అవుతుంది.