\
మతకలహాల్లో దెబ్బతిన్న నన్ను ఆదుకున్న మిత్రుడు
హైదరాబాద్, నవంబర్ 1979. పాతబస్తీలో మతకలహాలు ప్రారంభమైనాయి. నేను సమాచార భారతిలో ఇంచా ర్జ్ చీఫ్ సబ్ ఎడిటర్ గా, రిపోర్టర్ గా పనిచేస్తున్నాను. డైనమిక్ జర్నలిస్టు ఆదిరాజు వెంకటేశ్వరరావు మా అధినేత. నేను చంద్రాయణ గుట్టకు వెళ్లాల్సి వచ్చి పొద్దున్నే 7 గంటలకు బయలుదేరాను. నాతో పాటు మా మామయ్య కందుకూరు ఆయుర్వేదవైద్యులు యాదగిరాచార్యులు ఉన్నారు. ఆయన ధోవతి, కుర్తా, పిలకతో వైష్ణవుడిగా సులువుగా గుర్తించేట్లు ఉంటారు.
ఇద్దరం ఆటోలో వెళ్తున్నాం. చార్మినార్ దాటి లాల్ దర్వాజ దాటి, సయ్యదలీ చబూత్ర నుంచి వెళుతున్న దశలో యాదగిరాచార్యులను ఆటోలోంచి కొందరు ముస్లింలు లాగి కొట్టబోతుంటే ఆపబోయాను. నన్ను బయటకు లాగి కొట్టడం మొదలు పెట్టారు. వారి చేతుల్లో కత్తులు అప్పడికి రాలేదు. లేకపోతే మేం చనిపోవడం ఖాయం. దాదాపు 25 మంది దెబ్బలు భరించాల్సి వచ్చింది. మామయ్య చేతిలో ఛత్రీని లాక్కుని నన్ను కొడుతున్నారు.
నా షర్ట్ బనీన్ చిరిగిపోయాయి. వళ్లంతా నెత్తురు. ముఖం తల మీద దెబ్బలతో నెత్తురు నిండింది. తల వంకరటింకరగా వాచిపోయింది. అంగీ బనీను పీలికలు వంటి మీంచి రాలిపోతూ ఉన్న నన్ను అప్గుడు గుర్తుపట్టడం ఎవరికీ సాధ్యం కాదు. ఆ గుంపునుంచి నేను ఎట్లా తప్పించుకున్నానో చెప్పలేను. వాళ్లే వదిలిపెట్టలేదు.అంతలో కర్ఫ్యూ పెట్టారు. చంద్రాయణ గుట్ట మూడు నాలుగు కిలోమీటర్లు, చార్మినార్ కూడా అంతే దూరం. అల్లరి మూకలు అటువైపు ఉండడం వల్ల నేను చార్మినార్ వైపు పరుగెత్తి వస్తున్నాను.
ఒక్క వాహనం లేదు. పోలీసులు గాయపడిన నన్ను ఎక్కించుకోవడం లేదు. పైగా ‘‘కర్ఫ్యూ హై జాన్తే నహీ క్యా. ఛలో భాగో’’ అని తిడుతూ లాఠీ ఝళిపిస్తున్నారు. నాకు ఆశ్చర్యమైంది. అక్కడినుంచి నడిచిరావడం తప్ప నాకు మరో మార్గం లేదు. వళ్లంతా దెబ్బలతో నడవడం కూడా కష్టంగా ఉంది. చార్మినార్ చేరుకున్నాను.
పోలీసులు గానీ ఇంకెవరు గానీ నన్ను చూడడం లేదు. నా మాట వినడం లేదు. కనీసం జీపులో హాస్పటల్ కు తీసుకు వెళ్లడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.అక్కడ నాకు కనిపించాడు ఆజాద్ చిస్తీ. ఆజాద్ ముందు గాయపడిన వ్యక్తి ఎవరో తెలియకపోయినా సాయం చేద్దామనుకున్నట్టుంది. నేను శ్రీధర్ ను ఆజాద్ అని చెప్పాను. దగ్గరనుంచి చూసిఅప్పుడు గుర్తు పట్టాడు. అరె శ్రీధర్ నువ్వా, ఏమయింది, నిన్నూ కొట్టారా? అన్నాడు. జీప్ లో ఎక్కిండానికి ప్రయత్నించాడు. ఎవరూ వినలేదు. పోలీసు అధికారులను తిట్టాడు. లాభం లేదు. చివరకు తన బజాజ్ చేతక్ తీసుకు వచ్చి వెనక ఎక్కించుకుని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకువెళ్లి కట్లు కట్టించి ఇంజెక్షన్లు మందులు ఇప్పించి, నన్ను బషీర్ బాగ్ లో ఉన్న సమాచార భారతి ఆఫీసులో దించాడు. అప్పడికి ఇంకా అంగీ లేదు. నన్ను ఎవరూ గుర్తు పట్టలేదు. ఏమిటిలా అయ్యావ్ అని నవ్వుతున్నారు మిత్రులు (తెలియక). మరికొందరు అరెరే ఎంతపని అయిందని అంటున్నారు. అదృష్టవశాత్తు మా మామయ్య యాదగిరాచార్యులుకు దెబ్బలు దగలలేదు.
నన్నుబాగా ఆదరించిన మరో మిత్రుడు ఆదిరాజు. నా అవతారం చూసి ఆఫీసు వెనుక ఉన్నతన ఇంటికి తీసుకు వెళ్లాడు. ఆదిరాజు సతీమణి, పిల్లలు కూడా నన్ను ఆదరించారు. ఆదిరాజు నాకు లాల్చీ ఇచ్చి గదిలో విశ్రాంతి తీసుకోమన్నాడు. అప్పుడు డాక్టర్ చెన్నారెడ్డి ముఖ్యమంత్రి. ‘‘అసలు నీ ప్రభుత్వం ఉందా కుప్పకూలిందా?’’ అని చాలా కోపంతో ఆదిరాజు చెన్నారెడ్డికి టెలెక్స్ మెసేజ్ ఇచ్చాడు. తరువాత అంతే ఆవేశంతో నాగురించి ఒక వార్తను రిలీజ్ చేశాడు. అన్ని ఇంగ్లీషు తెలుగు పత్రికల్లో ప్రచురితమైంది ఆ వార్త.
సాయంత్రం దాకా కన్నుతెరవడం కష్టమయింది. తరువాత ఆ రాత్రే వరంగల్లుకు వెళ్లిపోయాను. ఇంట్లో అమ్మానాన్నకు అందాకా తెలియదు. నన్ను వారు కూడా వెంటనే గుర్తు పట్టలేకపోయారు. ఆజాద్ ఆదిరాజు మానవత్వం ఉన్న జర్నలిస్టులు. ఆరోజు ఆజాద్ గుర్తించకపోతే ఏమయ్యేదో ఊహించలేను.
ఆజాద్ ను నేను మరవలేను. రాజ్యాంగం మత సామరస్యం గురించి నన్ను మాట్లాడమన్నపుడు నేను ఈ ఉదంతం చెప్పాను.
నేను సమాచార కమిష్నర్ గా డిల్లీ వెళ్లినపుడు నాతో మాట్లాడి, హైదరాబాద్ లో నన్ను రెండు సార్లు ఇంటర్వ్యూ చేసి, నన్ను పలువిధాలుగా ప్రశంసించాడు. అభినందించాడు. ఆజాద్ ప్రేమ, అభిమానం, ఆదరణ, తోటి జర్నలిస్టులకు మిత్రులకు సాయం చేయాలన్న తపన చాలా గొప్పవి.
ఆజాద్ చిస్తీ ఈ విధంగా చెప్పాపెట్టకుండా వెళ్లిపోవడం చాలా బాధాకరం. ఈ మధ్య నేను కరోనా వల్ల కలవలేకపోయాను. ఆయన అనారోగ్యంగా ఉన్నాడని కూడా తెలియదు. ఇప్పుడు లేడంటే నమ్మలేను. మంచి మిత్రుడు ఆజాద్ కు నా అశ్రునివాళి. థాంక్స్ ఆజాద్. నిన్ను మరవలేను.
సత్యమూర్తి నివాళి
ఫేస్ బుక్ లో ఆజాద్ కు నివాళి అర్పిస్తూ నేను రాసిన ఈ వ్యాసానికి 380 మంది ఆదరణ లభించింది. ఆజాద్ గురించి మరో ఇద్దరు పాత్రికేయ మిత్రుల నివాళి నాకు చాలా నచ్చింది. సత్యమూర్తి రాసిన మంచి మాటలు ఇవి:
ఆజాద్ చిస్తీ… ఈ సీనియర్ జర్నలిస్టుకు ధన్యవాదాలు చెప్పకుండా ఉండలేను. సూర్య వ్యవస్థాపక ఎడిటర్ గా అవతారం చాలించిన తర్వాత ‘జనవాహినిలో నేడు’ అనే పత్రిక ప్రారంభించాను. ఆ పత్రికకు ఎక్రిడిటేషన్ లు రావాలన్నా, ప్రభుత్వ ప్రకటనలు రావాలన్నా సమాచార శాఖ ఎంపానెల్ మెంట్ తప్పని సరి. అయితే అది జరగాలంటే 18 నెలల పాటు నిరవధికంగా పత్రిక ప్రచురించి ఉండాలి. ఆ తర్వాత దరఖాస్తు చేసుకోవాలి. అన్నీ చూసిన తర్వాత వారు ఎంపానెల్ చేసుకునే అవకాశం ఉంటుంది…. చేసుకోకపోవచ్చు కూడా. నేను ఆలోచించాను. అప్పటికే దాదాపు రెండు దశాబ్దాల జర్నలిజం అనుభవం ఉన్న నేను పత్రిక పెట్టినా ఆ నిబంధన వర్తిస్తుందా? ఒక టెక్నోక్రాట్ ఏదైనా పరిశ్రమ పెడితే ఎన్నో రాయితీలు ఇస్తారు. జర్నలిస్టు పత్రిక పెడితే 18 నెలల నిబంధనకు సడలింపు ఇవ్వరా? ఇదే ప్రశ్న వేస్తూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాను. నా కాగితం తీసి చెత్తబుట్టలో వేశారు. అప్పటి సమాచార శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో సంతకం పెట్టించి మళ్లీ దరఖాస్తు ఇచ్చాను. అయినా సరే అప్పటి సమాచార శాఖ కమిషనర్ పార్ధసారధి దాన్ని ఆమోదించలేదు. ఫైల్ రిటర్న్ అయింది. నా సమస్యను ముఖ్యకార్యదర్శి ఆర్ ఎం గోనెల కు చెప్పాను. ఆయన కూడా ఏం చేయలేకపోయారు. కొద్ది రోజుల తర్వాత మళ్లీ గోనెల ను కలిశాను. ఇదివరకే చెప్పాను కదా నేనేం చేయలేను అన్నారాయన మళ్లీ. నేను మాట్లాడుతుండగానే ఆజాద్ చిస్తీ ఆర్ ఎం గోనెల వాష్ రూం నుంచి టక్కు సరి చేసుకుంటూ బయటకు వచ్చాడు. నన్ను చూస్తూనే అక్కడ నుంచే ‘‘ఏం సత్యంమ్మూర్తీ ఇలా వచ్చావు’’ అంటూ గట్టిగా అడుగుతూ ‘‘యూ నో.. గోనెలా… అంటూ ఆయనతో మాట్లాడటం మొదలు పెట్టాడు. సత్యమూర్తీ, నేనూ కలిసి రిపోర్టింగ్ చేసేవాళ్లం.. సత్యమూర్తి అప్పటిలో ఈనాడులో ఉండేవాడు.. ఆ రోజుల్లో… అంటూ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు నుంచి మర్రి చెన్నా రెడ్డి వరకూ జరిగిన అనుభవాలు మాట్లాడుకున్నాం. మాట్లాడుకున్నాం అనే కన్నా ఆజాద్ ఆర్ ఎం గోనెలకు చెప్పాడు అంటే కరెక్టుగా ఉంటుంది. ఆ తర్వాత నాపై గోనెల అభిప్రాయమే మారిపోయింది… పైగా ‘యు మస్ట్ హెల్ప్ హిమ్’’ అంటూ ఆజాద్ దాదాపుగా ఆయనకు ఆదేశాలు ఇచ్చాడు. ఆయన వెంటనే పార్థసారథికి ఫోన్ చేశారు. ఆయన కుదరదని చెప్పారు.. గోనెల ప్రశ్నార్ధకంగా నన్ను చూశారు. ‘‘సార్.. నేను పత్రిక రెగ్యులర్ గా తీసుకురాకపోయినా, ఏవైనా అవకతవకలకు పాల్పడినా ఎంపానెల్ మెంట్ రద్దు చేసే అధికారం కమిషనర్ కు ఉంటుంది… 18 నెలల రూల్ నుంచి మినహాయింపు ఇవ్వడానికి ఆయన ఎందుకు భయపడుతున్నాడో అర్ధం కావడం లేదని అన్నాను. అదే విషయం గోనెల ఆయనకు చెప్పారు. వెంటనే జీవో ఇచ్చేయమని చెప్పారు. అలా జనవాహినిలో నేడు కు 18 నెలల రూల్ నుంచి ప్రత్యేక మినహాయింపు ఇస్తూ జీవో వచ్చేసింది. అప్పటి వరకూ ఆంధ్రజ్యోతి (పున: ప్రారంభం) కు, సూర్యా పేపర్ కు మాత్రమే ఆ మినహాయింపు ఉండేది. ఆ తర్వాత సాక్షికి మినహాయింపు వచ్చింది. ఈ మూడు పత్రికల మధ్య అలాంటి మినహాయింపు తెచ్చుకున్న ఘనత కేవలం ఒకే ఒక్క ‘జనవాహినిలో నేడు’కు మాత్రమే దక్కింది. ఈ ఘనత సాధించేందుకు ఆజాద్ చేసిన మాట సాయం మరువలేనిది. నా మీద ఆజాద్ కు ఉన్న గౌరవం, ఆజాద్ మంచితనం, సహాయకారి గుణం పత్రిక ప్రారంభించే నిజమైన జర్నలిస్టులకు నిబంధనలు మినహాయించాలనే కోరికను తీర్చింది. ఆజాద్ చిస్తీ కి ధన్యవాదాలు చెప్పకుండా ఉండగలనా? ఏ ఐఏఎస్ అధికారినైనా పేరు పెట్టి పిలిచే కమాండ్ ఉన్న జర్నలిస్టు ఆజాద్ చిస్తీకి శ్రద్ధాంజలి.
సోమశేఖర్ నివాళి
ది హిందూ బిజినెస్ లైన్ సీనియర్ ఎడిటర్ గా రిటైరయిన ములుగు సోమశేఖర్ మరికొన్ని మంచి మాటలు ఇంగ్లీషులో చెప్పారు. దాని అనువాదం ఇది:
‘‘రాజకీయవేత్తలు నిర్వహించే పత్రికా గోష్ఠులలో 1980లలో ఆజాద్ ఛిస్తీ చాలా ప్రముఖంగా కనిపించేవారు. ముఖ్యమంత్రులకూ, దిల్లీ నుంచి వచ్చిన కేంద్రమంత్రులకూ అతి సమీపంలో కూర్చొని మొట్టమొదటి ప్రశ్న సంధించేది ఆయనే.
‘‘లావుగా, గడ్డంతో, కాస్త పొట్టిగా కనిపిస్తూ కంచుకంఠంలో మాట్లాడే ఆజాద్ ముఖ్యమంత్రులకు, ముఖ్యంగా ఎన్ టి రామారావుకూ, చెన్నారెడ్డికీ, నేదురుమల్లి జనార్దనరెడ్డికీ, చంద్రబాబునాయుడికీ బాగా పరిచయం. వారి ఐఏఎస్ అధికారులకంటే ఛిస్తీతో ఈ ముఖ్యమంత్రులకు సాన్నిహిత్యం ఉండేది. మామూలు దుస్తులలోనూ, సూట్ లోనూ ఉండి బూట్లు వేసుకొని జర్నలిస్టులలో ప్రత్యేకమైన వ్యక్తిగా కనిపించేవారు.
ఒక సారి రాజ్ భవన్ లో ఆజాద్ నాటి రాష్ట్రపతి జ్ఞానీ జైల్ సింగ్ దగ్గరికి దర్జాగా నడుచుకుంటూ వెళ్ళి ఆయనతో ఉర్దూలో చాలా సేపు మాట్లాడి మెప్పించడం నాకు బాగా గుర్తు. జైల్ సింగ్ ఆజాద్ ను ఆలింగనం చేసుకోవడమే కాకుండా ఆయన కోరిక మేరకు రెండు ఉర్దూ గేయ పంక్తులను ఆలపించారు. ఇది 1987 నాటి ముచ్చట.
ఆజాద్ ఛిస్తీ ఎప్పుడూ హడావిడిగా, నిర్విరామంగా ఉండేవారు. సంతోషంగా, ఉత్సాహంగా, చలాకీగా ఉండేవారు. ఆయనకు సచివాలయంలో వార్తలు సేకరించడం ఇష్టం. మంత్రుల ఛాంబర్లలోకి జర్నలిస్టుల బృందాన్ని తీసుకొని నేరుగా వెళ్ళి, మంత్రులను పేర్లతో సంబోధించి అక్కడికక్కడే ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసే అసాధారణమైన చొరవ ఉండేది ఆయనకు.
‘‘నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన జర్నలిస్టు జీవితంలో వార్తలు సేకరించే సంస్థలలో పని చేశారు. పత్రికలలో పని చేశారు. చివరికి హైటెక్ టీవీ అధినేతగా వెలిగారు. జర్నలిస్టుల రాజకీయాలలో కూడా ఆజాద్ చురుకుగా ఉండేవారు. ఆయన ప్రాబల్యం దిల్లీ వరకూ ఉండేది. హిందూస్తాన్ టైమ్స్ లో పని చేసి, నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్టుల సంస్థకు అధ్యక్షుడుగా పని చేసిన రాజేంద్ర ప్రభుకు దగ్గరగా ఉండేవారు.
ఆయన రచనల గురించి నాకు తెలియదు కానీ ముఖ్యమైన ఘనటలలో, సందర్భాలలో ఆయన ఉనికి మాత్రం మరచిపోలేనిది. బేగంపేట విమానాశ్రయంలో 1984లో ప్రధానమంత్రి హోదాలో రాజీవ్ గాంధీ మొదటిసారి దిగినప్పుడు ఆజాద్ ప్రముఖంగా అక్కడే ఉన్నారు. ముఖ్యమంత్రులను పేరు పెట్టి ఉర్దూలో అందంగా పిలిచినప్పుడు ఆజాద్ వ్యక్తిత్వం కొట్టొచ్చినట్టు కనిపించేది.
‘‘పురిగొలిపే తన మాటకారితనంతో, వ్యవహారశైలితో ఎంత పెద్దవారి దగ్గరికైనా నేరుగా వెళ్ళగలిగే సామర్థ్యం ఆయనలో ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అంశం. ఆయన ఒక చిన్న వార్తాసంస్థకు లేదా పత్రికకు ప్రతినిధిగా ఉండేవారు. అంతే. పీటీఐలో పని చేస్తున్న నాకు కానీ, ఇతర పెద్ద పత్రికలలో పని చేస్తున్న ఇతర జర్నలిస్టులకు కానీ ఆయనలాగా దూసుకుపోవడం సాధ్యమయ్యేది కాదు.
‘‘ఆయన చొరవకు ఒక ఉదాహరణ 1990లలో న్యూదిల్లీ రైల్వేస్టేషన్ లోజరిగిన ఉదంతాన్ని పేర్కొనవచ్చు. నేనూ, నా మిత్రుడు ఒకరు దిల్లి నుంచి హైదరాబాద్ వెడుతున్నాం. మా దగ్గర ఖరారైన టిక్కెట్టు రిజర్వేషన్ లేదు. ఎవరైనా రైల్వే అధికారి దొరుకుతారేమో, సాయం చేస్తారేమోనని మేము అదే పనిగా వెతుకుతూ ఉన్నాం. అప్పుడు నాకు ఛిస్తీ సాబ్ నడిచి మా వైపు వస్తూ ‘క్యా బాత్ హై సోమూ?’ అంటూ కనిపించారు.
‘‘టిక్కెట్టు ఖరారు చేసుకోలేకపోయామని చెప్పాను. ఆయన తక్షణం రంగంలో దిగారు. మేనేజర్ దగ్గరికి తీసుకొని వెళ్ళి నిమిషాలలో రిజర్వేషన్ చేయించారు. అంతకు మునుపు ఆయనే ఇటువంటి పని అనేక సందర్భాలలో చేశారు. రాజకీయ నాయకులతో పరిచయాలూ, జర్నలిస్టుగా చొరవా, ఎవరినైనా ఒప్పించే నేర్పూ ఏ పనినైనా చేయగల సామర్థ్యం ఆయనకు ఇచ్చాయి.
ఆయనను కలుసుకొని కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఫేస్ బుక్ లో మాత్రం కలుస్తూ ఉండేవాళ్ళం. ఛిస్తీ సాబ్ నన్ను ఎప్పుడూ మెచ్చుకుంటూ ఉండేవారు. హైదరాబాదీల గురించి కానీ వరిష్ఠ పాత్రికేయుల గురించీ కానీ, ప్రెస్ క్లబ్ గురించి కానీ వార్తలు రాసినప్పుడు అదనపు సమాచారం నాకు ఆయన దగ్గరే లభించేది.
‘‘ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోయిన ఆజాద్ ఛిస్తీకి వీడ్కోలు. ఎక్కడికి వెళ్ళినా సంతోషంగా ఉండండి ఆజాద్. ఆయన కుటుంబానికి నా ప్రగాడ సంతాపం.’’