Tuesday, November 5, 2024

ఇప్పుడు వారికి  ఒక “అడ్రెస్” వచ్చింది

ఫొటో రైటప్: రసీదు చూపుతున్న గెమ్మిలి బాలరాజు, చిలకమ్మ

( ముప్పై ఏళ్ల గడిచాక .. రెండేళ్ళ ప్రయత్నం తరువాత)

ఆ కాగితం ముక్క వారి చేతికి రాగానే, వారికి అన్ని  పండగలు ఒకేసారి వచ్చినట్లయ్యింది. ఇక తమ వూరు “పిల్లపిల్ల అంకసార్లు” నిలిచి వుoటుందనే నమ్మకం చిక్కింది.  2024 జనవరి 12న ఉదయం 7 గంటలకు వారందరూ, తమ పిల్లపాపలతో తమ చేతిలో ఉన్న ఆ “ కాగితం” ముక్కలను చూపిస్తూ నాకు ఈ ఫోటో తీసి పంపారు. ఆ ఫోటోలలోని వారిని తేరిపార చూడండి… వారి వదనాలలోని ఆ ఆనందాన్ని గమనిoచoడి… వయస్సుపై బడిన పెద్దల సంతృప్తిని గుర్తిచండి.

ఇంటి పన్ను రసీదులు చూపిస్తున్న కొత్తవీధి గ్రామ ఆదివాసీలు

ఇంతకీ ఏమిటి ఆ కాగితం ముక్క?

వారి ఇళ్ళకు గ్రామ పంచాయితి వారు నగదు కట్టించుకొని ఇచ్చిన పన్ను రసీదులే ఆ ‘‘కాగితం’’ ముక్కలు. ఆ పాటిదానికే ఇంత సంబరమా? అంటే , అవును ఆపాటిదానికే అంత సంబరం మరి. గత ముప్పై ఏళ్లుగా వారు  వూరు  కట్టుకొని జీవిస్తున్నారు. ఆ ఒక వూరు వుందనే రికార్డు ఇప్పటి వరకు లేదు. యువర్ ఆనర్! వూరు వున్నా రికార్డు లేకపోతె అక్కడ వూరు లేనట్లే. దేశం లేని ప్రజలలాగ వారిది రికార్డు లేని గ్రామం. ముప్పై ఏళ్ల తరువాత, రెండేళ్ళ ప్రయత్నం ఫలితంగా,   తమ పరిధిలో అక్కడ ఒక ఆవాస గ్రామం వుందని దాని పేరు కొత్తవీధి అని, అందులో ఇల్లు వున్నాయాని, వాటిలో మనుషులు జీవిస్తున్నారని ఆ గ్రామ పంచాయితీ గుర్తిoచింది. గుర్తించి ప్రతి ఇంటికి ఒక “ అసెస్మెంట్ ( assessment) నెంబర్” ఇచ్చింది.  అంటే ప్రతి ఇంటికి ఇప్పుడు  డోర్ నెంబర్ వచ్చింది. ఆ ఇంటికి పన్ను (tax) కట్టించుకొని రసీదు ఇచ్చింది. మొదటి సారి, అనకాపల్లి జిల్లా, చీడికాడ మండలం, కోనాం పంచాయితీకి చెందిన “ కొత్తవీధి” అనే ఆవాస గ్రామం రికార్డులో కనిపించింది. ఇప్పుడు అయోధ్యలోని రామాలయం అంతరిక్షం నుండి చూస్తే ఇలా  కనబడుతుందoటూ ఒక  వాట్స్ అప్ (WhatsApp) లో ఎవరో ఒక ఫోటో పంపారు. కాని మేము గత రెండు సవత్సరాలుగా, ఇదిగో “ కొత్తవీధి” అనే ఆదివాసీల గ్రామం గూగుల్ ఎర్త్ ( Google earth) లో ఇలా కనిపిస్తుందని సాటి లైట్ ఇమేజ్ (satellite image)  పట్టుకొని కోనాం గ్రామ సచివాలయం నుండి భుమి శిస్తు కమీషనర్ ( CCLA)  కార్యాలయం ( విజయవాడ) వరకూ తిరుగుతూనే వున్నాం.

రసీదు

ఆ రసీదు  లేకపోతె ఏమిటటా?!

ఆ రసీదు లేకపోతే ఏమిలేదు వారికి ఏమి లేదు.  వినడానికి ఆశ్చర్యంగా వుండవచ్చును. కొత్తవీధి గ్రామంలో 11 కొందు ( Kondh) తెగకు చెందిన ఆదివాసీ కుటుంబాలు జీవిస్తున్నాయి. వ్యవసాయం, కూలి పని తప్ప మరో జీవనo వారికి తెలీదు. నేను మూడు ఘటనలు చెపుతాను.

1.       మనిషికి తాగడానికి నీరు కావాలి కదా! వారి కోసం మంచినీటి బోరు ఇస్తామన్నారు.  కాని  గ్రామం వున్నట్లు ఏమైనా మీ వద్ద “కాగితాలు” ఉన్నాయా ? అని అడిగారు శ్రీవారు.  అవేలేవు. కాగితాలు లేకపోతే మనుషులు లేనట్లే, కాగితాలు లేనివారికి దాహం వేయకూడదు కదా! అందుకు ప్రభుత్వ నిబంధనలు వప్పుకోవు. అందుకే ప్రభుత్వం వారి మంచి తాగు నీరు పధకం అక్కడికి రాలేదు.

Also read: గొంతెలమ్మ తల్లి సంబరం

2.       తమ గోడువిని న్యాయం చేయమని గెమ్మెలి బాలరాజు కర్నూలు పట్టణంలో వున్న “లోకాయుక్త” కు ఒక పిటిషన్ పెట్టుకున్నాడు. లోకాయుక్త వారు బాలరాజుకు నోటీసు పంపారు. అది బాలరాజుకు చేరలేదు. ఎందుకంటే బాలరాజు అడ్రాస్ లో వున్న “ కొత్తవీధి” అనే గ్రామం, పొస్ట్ మేన్ గారి పంచాయితీ ఆవాస గ్రామాల జాబితాలో లేదు. కనుక సదరు పొస్ట్ మేన్ వారు,  ఇలాంటి వ్యక్తీ, అలాంటి వూరు ఏది లేదని ఆ నోటీసును వెనక్కి తిప్పి పంపెసారు.

గూగుల్ సాటి లైట్ ఇమేజ్ (satellite image) కొత్తవీధి

3.       మహాత్మ గాంధి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం వుంది. అందులో మీరు నమోదు కావాలంటే,  “ గ్రామీణ” ప్రాంతంలో జీవిస్తూ వుండాలి. కాని మీ  గ్రామమే రికార్డులో లేకపోతె ఎక్కడ వున్నట్లు ? నిన్న మొన్నటి వరకు వారికీ ఈ పధకం నుండి ఒక్క రూపాయి వేతనంగా అందలేదు.

అక్కడ పిల్లలు వున్నా వారికీ అంగన్వాడి సెంటర్  వుండదు. ఇలా రాసుకుంటూపొతే  ఒక పెద్ద “ లాండరి లిస్ట్” అవుతుంది.

Also read: మూడు పార్టీలు, వాటి జెండాలు వున్నాయి,  కాని కొండకు  దారే లేదు …

పెళ్లిళ్ళు … పుట్టుకలు .. చావులు ..  సాగులు 

గెమ్మెల బాలరాజు- చిలకమ్మ, వంతాల నాగేశ్వరావు- కుమారి దంపతులు కొత్తవీధి గ్రామానికి  ఆదికుటుంబాల వంటివారు. వారిప్పుడు వార్ధక్యంలోకి వచ్చేసారు. ఆ గ్రామంలో 10 జననాలు, ఆరు మరణాలు జరిగాయి. ఈ మధ్యనే బాలరాజు మనవడు  2023 ఆఖరి వారంలో  చనిపోయాడు.

కొత్తవీధి గ్రామంకు మూడు వైపుల కొండలు.  రోడ్డుకు చేరాలంటే  గ్రామం నుండి 40 నిముషాలకు  పైగా నడుచుకుంటూ వెళ్ళాలి.

వ్యవసాయం, కూలి శ్రమ  మాత్రేమే తెలిసిన ఈ కొందు ఆదివాసీలు కొత్తవీధి గ్రామాన్ని కట్టుకొని ఆ గ్రామo చుట్టు వున్న మెట్టు భూమిని సాగులోకి తెచ్చారు. ఇప్పుడు మీకు అక్కడ జీడి మామిడి, టేకు తోటలు,  పనస, చింత  వంటి చెట్లు కనిపిస్తాయి. మా సర్వేలో  2,800లకు పైగా లెక్క తేలాయి. ఇది గాక వర్షాధారంతో పండించే  తిండిగింజల సాగుకూడ వుంది. కాని వ్యవసాయ శాఖ  వారు నమోదు చేసే “ఈ క్రాప్ బుకింగ్” ఇవేవి కనిపించవు.  కొత్తవీధి గ్రామం, దాని చుట్టూ మానవ జీవితం వుoది. ప్రభుత్వాల మీద అతి తక్కవగాను, తమ కష్టంమీద ఆధారపడి జీవిస్తున్న ఈ కుటుంబాలకు వూరు వుంది గాని అది పంచాయితీ రికార్డులో లేదు. వారి సాగు వుందిగాని అది రెవిన్యూ రికార్డులో లేదు. రికార్డు ప్రకారం వూరు లేదు,  సాగు లేదు. ‘రోజులు మారాయి’ (1955) సినిమాలో కరణం ( రమణా రెడ్డి)కు  “ ఇది గర్నమేంట్ రికార్డు అనుకుoటున్నారా లేకపోతె చాకలి పద్దనుకుంటున్నారా!?”   ఊతపదం. “సర్కార్ వారి లెక్కదాఖల (రికార్డు) ప్రకారం అక్కడ (కొత్తవీధి అనే) వూరు లేదు, కొందు ఆదివాసీల సాగూ లేదు.

వంతాల నాగేస్వారావు – కుమారి

కళ్ళు వున్నాయి … వాటి కింద నోరు వుంది

రాచకొండ విశ్వనాధ శాస్త్రి రచన “రత్తాలు – రాంబాబు” లేదా “రాజు – మహిషి” లో  అప్పారావు ఏడ్డు ( హెడ్ కానిస్టేబుల్ ) తన శిష్యుడితో చెపుతాడు ( జ్జాపకం మీద, నా మాటలలో రాస్తున్నాను సుమా !) “పోలీసోడికి అందరిలాగే రెండు కళ్ళు వుంటాయి. అయి అన్నిటిని సూత్తా వుంటాయి. ఆ కళ్ళ కింద నోరు ఉంటాది.  దానికి కాస్తా మేత అందిస్తే ఆ  కళ్ళు కొసింత మూసుకుంటాయి”. పోలీసోడికే కాదు అధికారి అనే ప్రతివాడికి కళ్ళు, దాని కింద నోరు వుంటాయి. ఇప్పటి వరకు “ కొత్తవీధి” అనే గ్రామం,  పంచాయితీ అధికారులకు అందుకే కనిపించ లేదు. 30 ఏళ్ల కాలంలో 5 ఏళ్లకు ఒకటి చొప్పున మొత్తం 6 పాలక వర్గాలు మారి వుంటాయి. ఒక్కడికి అక్కడ గ్రామం కనిపించ లేదు.

Also read: అజయ్ కుమార్ కూ, గదబ ఉద్యమకారులకూ ఈఏఎస్ శర్మ అభినందన

ఓటరు కార్డు మాత్రేం ముందే ఇచ్చారు

రేషన్ కార్డు ఇవ్వకపోయినా ఓటరు కార్డు మత్రేం ముందే వచ్చింది. కొత్తవీధి వారికి ఓటరు కార్డులు ఇప్పించడం మీద వున్న ఆసక్తి ఇంటి పన్ను రసీదు ఇప్పించడంలో  ఎందుకు లేదు? 

ఓటు హక్కు వుంటేనే పౌరుడు. పౌరుడు అయితేనే   రాజ్యంగo చెప్పిన ప్రాధమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు దక్కుతాయని ఓటరు కార్డులు ఇచ్చారా?! కొత్తవీధి ఆదివాసీలు MP, MLA, ZPTC, MPTC, పంచాయితీ సర్పంచ్ , వార్డు మెంబర్ ఇలా ప్రతి ప్రజా ప్రతినిధికి ఓట్లు వేస్తూనే వున్నారు. రికార్డు దాఖలు వూరు పేరు లేని ఈ గోచిపాతరాయళ్ళు మాత్రం పంచాయితీ నుండి పార్లమెంట్ వరకు ప్రజా ప్రతినిధులను ఎన్నుకునే సర్వసత్తాక గణతంత్ర పౌరులు. ఓటు హక్కు ఇవ్వడానికి అవసరం లేని “రికార్డు”,  తాగు నీటి  బోరు వేయడానికి మాత్రం కావలసి వచ్చింది.

రెండేళ్ళ ప్రయత్నం

2021 నుండి, కొత్తవీధి పేరుతొ ఒక ఆదివాసీ గ్రామం వుందని, అందులో మనుషులు వున్నారని, ఆ గ్రామం చుట్టూ భూమి వుందని, దానిలో వారి సాగు అనుభవం వుందని వినతి పత్రాలు పట్టుకొని చంద్ర బాబు నాయుడు “ ప్రజల వద్దకు పాలన” నుండి  జగన్ రెడ్డి గారి “ జగనన్నకు చెప్పుకుందాం” వరకూ ఆదివాసీలు ‘ఎక్కని గడప, మొక్కని బండ’ లేదు.

జిల్లా పంచాయితీ అధికారి వారిని కలసి మరోసారి వినతిపత్రం ఇచ్చాం. వారు రిపోర్టు ఇవ్వమని “ఒక అర్జెంట్’’ మేమోను మండలం పంచాయితీ  అధికారికి  పంపారు. మండల పంచాయితీ అధికారి దివ్యసన్నిధికి వెళ్లి వారిని కలిశాం. వారు పంచాయితీ కార్యదర్శి వారికి ఆదేశాలు ఇచ్చారు. సదరు పంచాయితీ కార్యదర్శి వారు గ్రామ పంచాయితి తీర్మానం కావాలన్నారు. పోలోమంటూ గౌరవ సర్పంచి వారిని కలిశాం.

కొత్తవీధి ఆదివాసీలతో వ్యాస రచయిత అజయ్ కుమార్

గౌరవ మండల పంచాయితి అధికారి వారు గౌరవ గ్రామ  పంచాయితి కార్యదర్శి వారిని వెంటబెట్టుకొని కొత్తవీధి వచ్చారు. గ్రామ పంచాయితీ వారు అక్కడ 30 ఏళ్లుగా కొత్తవీధి పేరుతొ ఒక ఆవాస గ్రామo వుందని, సదరు గ్రామoలోని ఇళ్లకు అసెస్మెంట్ (assessment)  చేసి ఇంటి పన్నులు వసూలు చేయుటకు అంగీకరిస్తూ  తీర్మానం ఇచ్చారు. అంతే కాదు రేషన్ కార్డ్, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు ఇలా  వల్లమాలిన కార్డులన్ని  తీసుకున్నారు. అంతేనా , ఇంటి ఇంటికి తిరిగి ఫోటోలు తీశారు. ఇళ్ళ కొలతలు వేసారు. మొదటిసారి ఆ వూరు పేరు గ్రామ పంచాయితీ రికార్డులలోకి  ఎక్కింది. ఇంటి పన్ను వచ్చింది. కొత్తవీధి ఆదివాసీల చేతికి ఒక రసీదు అనే “కాగితం” ముక్క వచ్చింది. ఇంకా చెప్పాలంటే, 30 ఏళ్లకు, రెండేళ్ళ ప్రయత్నాల తరువాత వారికి ఇప్పుడు వారికోక  ఒక “అడ్రెస్” వచ్చింది.

Also read: అవును! గదబ సాగు రైతులే   గెలిచారు

PS అజయ్ కుమార్

అజయ్ కుమార్ పీ ఎస్
అజయ్ కుమార్ పీ ఎస్
పీఎస్ అజయ్ కుమార్ ఆంధ్రా విశ్వవిద్యాలయంలో సోషల్ వర్కులో మాస్టర్స్ డిగ్రి (MSW) చేశారు. గత 30 ఏళ్లుగా ఆదివాసీల భూమి సమస్య, నిర్వాసిత, గ్రామీణ కార్మికుల హక్కుల కోసం పని చేస్తున్నారు. ‘ప్రభుత్వ భూమి పేదలదే’, ‘భూమి సమస్య – వ్యాసాలు 1, 2’, ‘కళ్యాణలోవ కధలు’ ప్రచురితమైన పుస్తకాలు. భూమి సమస్య వ్యాసాలు – 1కి, DNF Rural Journalist award foundation –Hyderabad వారి Rural journalist award for year 2008 లభించింది. ప్రస్తుతం అఖల భారత వ్యవసాయ & గ్రామీణ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శిగా పని చేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles