- వందేళ్ల ఓయూ చరిత్రలో నూతన అధ్యాయం
- గుమ్మడి నర్సయ్య కుమార్తె సాధించిన ఘనత
- ఇల్లందు నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎంఎల్ఏగా ఎన్నికైన గుమ్మడి నరసయ్య
హైదరాబాద్ : బషీర్ బాగ్ లా కళాశాల ప్రిన్సిపాల్ గా నియమించబడ్డ తొలి ఆదివాసీ మహిళా ప్రిన్సిపాల్ గా నియుక్తురాలైన ఆదివాసీ బిడ్డ ఉస్మానియా లా ప్రొఫసర్ డాక్టర్ గుమ్మడి అనురాధ. సీపీఐ(ఎంఎల్-న్యూడెమాక్రసీ)కి చెందిన మాజీ ఎంఎల్ఏ గుమ్మడి నరసయ్య కుమార్తె అనూరాథ. ఖమ్మంజిల్లా మారూమూల గ్రామం టెక్కలగూడెంలో గుమ్మడినరసయ్య దంపతులకు ముప్పయ్ మూడేళ్ళ కిందట జన్మించిన అనూరాధ కష్టపడి చదువుకొని న్యాయశాస్త్రంలో డిగ్రీ సంపాదించారు. న్యాయశాస్త్రంలో ఉస్మానియా యూనివర్శిటీ నుంచి పీహెచ్ డీ చేశారు. ఉస్మానియా లా కాలేజీలో మూడేళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేశారు.
అనూరాధ సొంత గ్రామంలోనే రెండో తరగతి వరకూ చదివారు. తర్వాత సుదిమెల్లలో ప్రభుత్వం నడిపే ఆదివాసీ సంక్షేమ స్కూలులో, కళాశాలలో ఇంటర్ వరకూ చదివారు. తర్వాత ఇల్లందులో డిగ్రీ కళాశాలలోచేరి బీఏ చదివారు. అక్కడ ఉన్నప్పుడే పీడీఎస్ యూ (ప్రోగ్రెసివ్ డెమాక్రాటిక్ స్టూడెంట్స్ యూనియన్)లో కీలకపాత్ర పోషించారు. అనంతరం ఉస్మానియా లా కాలేజీలో చేరారు. ఆ తర్వాత పీహెచ్ డీ ఆదివాసీల భూములకు సంబంధించిన చట్టాలు అనే విషయంపైన చేశారు. ఇంటర్ వరకూ తెలుగు మీడియంలో చదవడం వల్ల డిగ్రీలో చదువుకాస్త కష్టం అనిపించించనీ, కొంత శ్రమతీసుకొని అధ్యయనం చేస్తే చదువు గాడిలో పడిందని ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనూరాథ చెప్పారు. అప్పటి నుంచి పీహెచ్ డీ అయ్యేవరకూ వెనక్కు చూసింది లేదని అన్నారు. కొంతకాలం ఐఏఎస్ పరీక్షలకు తయారు కావాలని తలపోశాననీ, కానీ న్యాయశాస్త్రంలో బోధనను వృత్తిగా తీసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత సివిల్స్ గురించి ఆలోచించలేదని అన్నారు.