- ల్యాండ్ పూలింగ్ లో భూములు ఇచ్చిన వారికీ ప్రత్యామ్నాయ భూమి కేటాయింపు చేయాలి.
- జీవో 72ను అమలు చేయాలి
- ప్రత్యామ్నాయ భూమిని అప్పగించన తరువాతనే ఇళ్ళ పట్టాల పంపిణి చేయాలి
అనకాపల్లి మండలంలోని పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజలు 26 ఏప్రిల్ 2023, బుధవారం, అనకాపల్లి పట్టణం నాలుగు రోడ్ల కూడలి వద్ద దీక్షా శిబిరం నిర్వహించి తమ నిరసన తెల్పారు.
ఈ సందర్బంగా, ఐ.ఆర్. గంగాధర్, అనకాపల్లి శాసన సభ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టి కమిటి సభ్యుడు మాట్లాడుతూ, అనకాపల్లి మండలం పరిధిలోని సంపతిపురం, తమ్మయ్య పేట, వేటజంగాలపాలెం, కూండ్రం, కుంచంగి, సీతానగరం గ్రామాలలో G.O. 72 ద్వారా దళిత బహుజన పేదలకు ఇచ్చిన D-పట్టా భూములు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇళ్ళ పట్టాల పంపిణి కోసం అని తీసుకుందనీ, జీవో ప్రకారం, సేకరించిన భూమికి గాను ప్రత్యామ్నాయ భూమి కేటాయిస్తామని హామీ ఇస్తూ RDO సంతకoతో లేండ్ పూలింగ్ ద్రుపత్రాలు ( Land pooling ownership Certificate) ఇచ్చారనీ, కాని నేడు భూమికి భూమి అడుగుతుంటే పోలీసులను పంపి కేసులు పేడతామని బెదిరిస్తున్నారనీ అన్నారు. అనకాపల్లి మండలంలో పేదల వద్ద తీసుకున్న భుమికి గాను ప్రత్యామ్నాయ భూమి ఇచ్చిన తరువాతేనే ఇంటి పట్టాలు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఏ. బాల కృష్ణ మాట్లడుతూ, పేదల చేతిలో వున్న భూములు ఇచ్చే వరకూ అధికారులు వారికి “అరచేతిలో వైకుంఠo” చూపారనీ, ఇప్పుడు భూములు ఇచ్చిన వారి సంగతి గాలికి వదిలేశారనీ ఆయన అన్నారు. ప్రత్యామ్నాయ భూమి చుపేవరకూ ఆందోళన కొనసాగిస్తామని అన్నారు.
సీపీ(ఎంఎల్) లిబరేషన్ జిల్లా కన్వీనర్ పీ.ఎస్. అజయ్ కుమార్ మాట్లాడుతూ, జీడి మామిడి తోటలతో వున్న డీ-పట్టా భూములు అప్పగించి నాలుగు ఏళ్ళు కావస్తున్నా నేటికీ ప్రత్యామ్నాయ భూమి చూపకపోవడం అన్యాయం అని అన్నారు. ఈ నాలుగు ఏళ్లలో ఒక్కొక్క డీ-పట్టాదారు, ఎకరానికి రూ. 80,000 లు నష్టపోయారనీ, వారoదరికీ నగదు నష్టపరిహారం ఇవ్వాలనీ ఆయన డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 72 ప్రకారం, తమ భూములు ఇచ్చిన వారికి వారి గ్రామంలోనే ప్రత్యామ్నాయ భూములను వెంటనే అప్పగించాలనీ, ఇందుకు జిల్లా కలెక్టర్ చొరవ తీసుకోవాలనీ ఆయన కోరారు.
ఆమ్ ఆద్మీ పార్టి (AAP) నాయకుడు కె. హరిబాబు మాట్లాడుతూ, భూమి ఇచ్చిన వారికి న్యాయం చేయాలని కోరారు.
డిమాండ్స్ తో కూడిన వినతిపత్రాన్ని అనకాపల్లి రెవిన్యూ డివిజన్ ఆర్ డీవో కు
అందజేశారు.
మే 8 సోమవారం భారీ ధర్నా
వచ్చేనెల మే 7వ తేదీలోగా ల్యాండ్ పూలింగ్ లో భూములు ఇచ్చిన వారికి జీవో ప్రకారం ప్రత్యామ్నాయ భూములను అప్పగించాలనీ, లేనియెడల మే 8వ తేదీ సోమవారం అనకాపల్లిలోని రెవెన్యూ డివిజనల్ కార్యాలయం వద్ద వందలాది మందితో భారీ ధర్నా నిర్వహిస్తామనీ బాధితులు తెలియజేశారు.
Also read: పేదలకు ఇళ్ళ కోసం .. పేదల భూములు ..