- మళ్లీ అధికారం మాదే అంటున్న బీజేపీ
- కంచుకోటను నిలబెట్టుకొనేందుకు కాంగ్రెస్ వ్యూహాలు
అసోం లో ఎన్నికలు సమీపిస్తుండటంతో పొత్తులపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. సీట్ల సర్దుబాటుపై కూటముల మధ్య నెలకొన్న సందిగ్ధతకు సాధ్యమైనంత త్వరగా పరిష్కారం కనుగొని ప్రచారంలో దూసుకెళ్లేందుకు వ్యూహాలు పన్నుతున్నాయి.ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి తో పాటు మరో ప్రాంతీయ కూటమి ఎన్నికల బరిలో నిలవనున్నాయి. బీజేపీ, అసోం గణపరిషత్, యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్, గణ సురక్ష పార్టీ ఒక కూటమిగా ఎన్నికల బరిలో దిగుతున్నాయి.
చర్చలు సఫలం-కొలిక్కివచ్చిన సర్ధుబాట్లు:
ఈ నేపథ్యంలో బీజేపీ, అసోం గణపరిషత్, యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ మధ్య సీట్ల సర్దుబాటు జరిగిన చర్చలు ఫలప్రదమయ్యాయని భాగస్వామ్య పార్టీల మధ్య ఒప్పందం కుదిరినట్లు అసోం బీజేపీ అధ్యక్షుడు రంజిత్ దాస్ వెల్లడించారు. 126 స్థానాలున్న అసోంలో ఇప్పటి వరకు 86 స్థానాల్లో బీజేపీ, అసోం గణపరిషత్, యునైటెడ్ పీపుల్స్ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు జరిగినట్లు తెలుస్తోంది. మూడు దశల్లో జరగనున్న ఎన్నికల్లో మార్చి 27న తొలి విడత పోలింగ్ జరిగే స్థానాల్లో అభ్యర్థుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. మిగతా స్థానాలలో సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై స్పష్టత రాలేదని తెలుస్తోంది. అసోంలో మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ మార్చి 9తో ముగియనుంది.
Also Read: కేరళ బీజేపీ సీఎం అభ్యర్థిగా శ్రీధరన్
బీజేపీకి రెబెల్స్ బెడద:
ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటోంది. ఒక్కో స్థానంలో పలువురు అభ్యర్థులు పోటీలో ఉండటంతో టికెట్ ఆశించిన అభ్యర్ధులు టికెట్ దక్కకపోతే ఎన్నికల్లో రెబెల్స్ గా దిగి తమ ప్రతాపం చూపుతామని ఇప్పటికే హెచ్చరించడంతో అసంతృప్త నేతలను ముందు బుజ్జగించేందుకు బీజేపీ వ్యహరచన చేస్తోంది.
కాంగ్రెస్ నేతృత్వంలో మహాగట్ బంధన్:
కాంగ్రెస్ సారథ్యంలోని మహాగట్ బంధన్ లో ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎంల్, అచాలిక్ గణ మోర్చాలు ఉన్నాయి. 2016 ఎన్నికల్లో బీజేపీతో జతకట్టిన బోడో పీపుల్స్ ఫ్రంట్ ఈ సారి కాంగ్రెస్ చెంతకు చేరింది. అప్పటి ఎన్నికల్లో బీపీఎఫ్ 12 సీట్లు సాధించింది. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ కూటమిని వీడి కాంగ్రెస్ తో కలిసి ఈ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. 2014 లోక్ సభ ఎన్నికలకు ముందు బీపీఎప్ ఎన్డీఏలో చేరింది. 2006లో బీపీఎఫ్ కాంగ్రెస్ నేతృత్వంలోని సంకీర్ణ సర్కారుకు ప్రధాన మద్దతు దారుగా ఉండి సంకీర్ణ సర్కారును కాపాడింది. 2019లో పౌరసత్వ సవరణ చట్టం సిఏఏ కు నిరసనగా అసోం గణ పరిషత్ బీజేపీని వీడటంతో బీపీఎఫ్ కాపాడింది.
Also Read: పశ్చిమ బెంగాల్ లో బీజేపీ, తృణమూల్ అమీతుమీ
ప్రాంతీయ కూటమి:
ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్, అసోం జతియాతబాడి యువ చత్ర పరిషత్ లు కలిసి అస్సాం జతియా పరిషత్ పేరుతో కొత్త ప్రాంతీయ కూటమిని నెలకొల్పాయి. రైతు నేత అఖిల్ గొగోయే నేతృత్వంలోని రైజోర్ దళ్ పార్టీతో పొత్తులో ఎనికల్లో పోటీచేస్తోంది.