Sunday, December 22, 2024

పాకిస్థాన్ లో ప్రకంపనలు

  • అడుగంటిన ఆర్థిక పరిస్థితులు
  • తాలిబాన్ తో తలనొప్పి
  • ఖైబర్ ఫక్తూన్ క్వా చేయిజారే దుస్థితి
  • ఉగ్రవాదానికి ఊతం ఇచ్చినందుకు మూల్యం

పాకీ అంటే పవిత్రమైన, స్థాన్ అంటే స్థానం /ప్రదేశం /ప్రాంతం. వెరసి పాకిస్తాన్ అంటే పవిత్రమైన ప్రాంతం అని అర్థం. కానీ, నిజజీవనంలో ఆ పేరుకు – ఆ దేశం తీరుకు ఏమాత్రం పొంతన లేదు. పాలకుల అసమర్ధతకు, అక్రమాలకు, అన్యాయాలకు పాపం సామాన్య ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. అది మరింత భయానకంగా మారుతోంది. దేశ ఆర్ధిక పరిస్థితులు పతనం అంచుకు చేరుకున్నాయి. విదేశీ మారక నిల్వలు ఖాళీ అయిపోయాయి. నిత్యావసర వస్తువుల కొరత ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది. ధరలు ఆకాశాన్ని కూడా అధిగమించి ఎక్కడో పయనిస్తున్నాయి. ప్రతిక్షణం భయానకంగా, క్షణమొక యుగంగా అక్కడ పౌరుల రోజులు గడుస్తున్నాయి. పాలకుల అపరాధాలు, ప్రజల అమాయకత్వంతో పాటు ప్రకృతి వికృతిగా మారిన క్రమం ఆ దేశాన్ని కకావికలం చేస్తున్నాయి. చైనాకు లొంగిపోయి, అమెరికాతో అంటకాగి, రష్యాతో రకరకాలుగా ప్రవర్తించి, తాలిబన్ ను పెంచి పోషించి అఫ్ఘనిస్థాన్ తో ఆడుకొని, అక్రమ మార్గాలు తొక్కినందుకు దేశం భారీగా మూల్యం చెల్లిస్తోంది. ఇంధనం లేమి సమస్యతో రాత్రి 8 గంటలకే దుకాణాలు కట్టే పరిస్థితిలోకి మార్కెట్ రంగం వచ్చేసింది. వీధి దీపాలు ఆర్పుకొని, ఇళ్లల్లోనూ సగం వెలుగుతో సర్దుకోవాల్సిన చీకట్లోకి పాకిస్తాన్ వెళ్లిపోయింది. కరెన్సీ విలువ ఘోరాతి ఘోరంగా పడిపోయింది. సబ్సిడీల భారాన్ని మోసే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. చమురు దిగుమతి చేసుకొనే స్థితి పూర్తిగా సన్నగిల్లి పోయింది.

Also read: రాహుల్ తో కమల్ కబుర్లు

In Pakistan, Imran Khan's 'Long March' Pushes Crisis to a Boil | WPR
ఇమ్రాన్ ఖాన్ లాంగ్ మార్చ్

అడుగంటిన విదేశీమారక ద్రవ్యం

ఉద్యోగుల జీతాల కోత మొదలైంది. అంతర్జాతీయ సంస్థల నుంచి ఆర్ధిక సాయలు ఆగిపోయాయి. విదేశీ రుణాలు చెల్లించే స్థితి లేనేలేదు. నూనె, నెయ్యి కొరత చెప్పనలవి కాదు. ఎక్కువ శాతం నూనె విదేశాల నుంచే దిగుమతి చేసుకోవాలి. ఆ అవకాశాలు లేకపోవడంతో వంటనూనెను అత్యవసర వస్తువుల జాబితా నుంచి కూడా తొలిగించారు.ఆర్ధిక ఇబ్బందులు మొదలై చాలాకాలమైనా ఇప్పుడు మరింత పెరిగాయి.గత ఏడాది వచ్చిన వరదలు ఆ దేశానికి చాలా కష్టాలను తెచ్చిపెట్టాయి. ఈ ప్రభావంతో ఎగుమతులు పూర్తిగా తగ్గిపోయాయి. ఇతర దేశాల నుంచి దిగుమతులను పెంచుకోవాల్సిన దుస్థితి వచ్చిపడింది. ఈ దెబ్బకు విదేశీ మారక నిల్వలు ఘోరంగా పడిపోయాయి. దేశంను చీకట్లో నెట్టడమే కాక అమెరికాలోని పాత రాయబార కార్యాలయాలను అమ్ముకోవాల్సిన ఖర్మ పట్టింది. రాజకీయంగానూ, భౌగోళికంగానూ సమస్యలు చుట్టుముట్టాయి. గత ఏప్రిల్ లో ఇమ్రాన్ ఖాన్ ను ప్రధానమంత్రి పదవి నుంచి తప్పించిన విషయం తెలిసిందే. దాని వల్ల సాధించింది ఏమీ లేకపోగా రాజకీయంగా అనిశ్చిత పరిస్థితులు అలుముకున్నాయి. తాలిబన్ ను పెంచి పోషించిన పాపం నేడు పామై కరుస్తోంది. ఖైబర్ పక్తున్ క్వా రాష్ట్రంపై తాలిబాన్ ప్రభుత్వం కన్నేసింది. సరిహద్దుల్లో ఉన్న పుష్తూన్ తెగ ఉండే ప్రాంతాలపై పట్టుకోసం తాలిబన్ ప్రభుత్వం పట్టుపడుతోంది. తాలిబన్ మద్దతుతో నడుస్తున్న తెహ్రీక్ -ఎ -తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ) దళాలు పాకిస్తాన్ సైన్యంతో మాటిమాటికీ గొడవలకు దిగుతూ యుద్ధానికి సిద్ధమవుతున్నాయి.

Also read: కొత్త సంవత్సరంలో వాడిగా, వేడిగా రాజకీయం

Pakistan's unending economic crisis: Imran govt needs $51.6 billion  external financing over two year period - India News News
పాకిస్తాన్ లో అంతులేని ఆర్థిక సంక్షోభం

దద్దరిల్లుతున్న సరిహద్దు ప్రాంతాలు

ఈ పరిణామాలతో సరిహద్దు  ప్రాంతాలు దద్దరిల్లిపోతున్నాయి. భస్మాసుర హస్తంలా పాకిస్తాన్ కు తాలిబన్ దళాలు ఏకుమేకై పోయాయి. ఈ ప్రభావాల వల్ల ఖైబర్ రాష్ట్రం పాకిస్తాన్ చేయిదాటిపోయే పరిస్థితి వచ్చేసింది. ఉత్తర పాకిస్తాన్ లో ‘పాకిస్తాన్ తాలిబన్’ సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతోంది. అక్కడ వివిధ మంత్రిత్వ శాఖలను కూడా ఏర్పాటుచేసింది. ఈ పరిణామాలు పాకిస్థాన్ సార్వభౌమత్వాన్నే ప్రశ్నిస్తున్నాయి. పాకిస్తాన్ భూభాగం ఇప్పుడు విభజనకు గురవుతోంది. ధర్మబద్ధంగా నడిచే పుణ్యభూమి భారతదేశం విషయంలో చేసిన పాపాలన్నీ నేడు పాకిస్తాన్ కు శాపాలుగా మారాయి. భారత భూభాగాన్ని ఆక్రమించడం, ఆస్తులను ధ్వంసం చేయడం, ఉగ్రవాదంతో నరబలికి దిగడం, చైనాతో చేయి కలిపి, అమెరికాతో ద్వంద్వనీతి నెరుపుతూ భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలని తీవ్రంగా ప్రయత్నం  చేసింది.అవన్నీ ఇప్పుడు తనకే తగులుకున్నాయి. చైనాను నమ్ముకున్నందుకు శ్రీలంకకు పట్టిన గతి నేడు పాకిస్తాన్ కు పట్టింది. అంతర్జాతీయ సమాజంలో పరపతిని కోల్పోయిన పాకిస్తాన్  నేడు స్వదేశ ప్రజల్లోనూ పెద్దఎత్తున చెడ్డపేరు మూటకట్టుకుంది. చేసిన పాపం అనుభవించక తప్పదు. పాపం పాకిస్తాన్ ప్రజలు!

Also read: జమిలి ఎన్నికలు అభిలషణీయమా?

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles