———— ———
(“Reason and Passion “from The Prophet by KAHLIL GIBRAN)
స్వేచ్ఛానువాదం: డా. సి. బి.చంద్ర మోహన్
————- ———–
చాలా సార్లు,
నీ హేతు బుధ్ధి, తీర్పరి తనము–
నీ భావావేశము, తృష్ణ —
లకు జరిగే సంగ్రామములో
ఆత్మ ఒక రణ స్థలం అవుతుంది !
పై అంశాలలో,
‘ అసమ్మతి, శత్రుత్వాలను
పారద్రోలి, ఏకత్వాన్ని సాధించి
ఆహ్లాద పరిచే శాంతి దూతను
కావాలని కదా !‘ మీ ఆలోచన!
కానీ ఎలా ?!
మీ ఆత్మలోని సమస్త అంశాలను
మీరు ప్రేమిస్తే తప్ప,
మీరు కూడా శాంతి దూతలైతే తప్ప
అది సాధ్యం కాదు కదా !
మీ వివేకం, భావావేశం
తెర చాప, చుక్కానుల్లా
మీ ఆత్మలు సాగర యానం చేస్తాయి!
ఆ రెండూ ధ్వంసమైతే
నీవు అశాంతితో పొర్లుతావు!
లేదా
సాగర మధ్యంలో నిశ్చలంగా ఉండిపోతావు!
హేతువు పరిమితులున్న శక్తి !
భావావేశం — అజాగ్రత్తగా ఉంటే దహించివేస్తుంది !
నీ అభిరుచులంత ఎత్తుకు
ఆత్మ –నీ ఇంగిత జ్ఞానాన్ని ఉన్నతీకరించనీ!
భావావేశాన్ని వివేకంతో నడిపించనీ !
బూడిద నుంచి ఫీనిక్స్ పక్షి
పునరుజ్జీవనం పొందినట్లు
నీ కళా తృష్ణ ప్రతి రోజూ
పునరుత్థానం పొందాలి !
హేతువు — తృష్ణ రెండింటినీ
నీ ప్రియమైన అతిథులుగా స్వీకరించు !
ఇద్దరికీ సమంగా సత్కారాలు చెయ్యి.
ఎక్కువ తక్కువలు చూపితే
ఇద్దరి ప్రేమా, విశ్వాసాలూ కోల్పోతావు!
కొండల్లో, మర్రి చెట్ల నీడల్లో
సుదూర పచ్చిక మైదానాల్ని, పొలాల్నీ చూస్తూ
ప్రశాంతతననుభవిస్తూ,
మనసులో, ‘వివేకంలోనే
విశ్వ శక్తి దాగుంది‘ అనుకో!
తుఫాను వేళ,
పెనుగాలికి చెట్లు కూలుతున్న దృశ్యం చూస్తూ,
ఉరుములూ, మెరుపులూ , ఆకాశపు మహిమలను చూస్తుంటే
భావావేశంలో బ్రహ్మాన్డం ఉందనుకో!
—అనంత విశ్వం లో నీవు ఒక శ్వాస వనీ
విశ్వారణ్యంలో నీవొక ఆకువనీ అనుకుంటే
నీవు వివేకంలో సాంత్వన పొందగలవు !
అభిరుచితో ఆటలాడుకోగలవు!
Also read: సందేహం – సంకల్పం – సందేశం
Also read: ఇద్దరు రాకుమార్తెలు
Also read: ప్రేమా , అసహ్యమూ
Also read: సంచారి తత్త్వాలు