Wednesday, January 8, 2025

దేశవ్యాప్తంగా 14 మంది న్యాయమూర్తుల బదిలీ

  • సీజేలుగా అయిదుగురికి పదోన్నతి
  • తెలుగు రాష్ట్రాలకు కొత్త సీజేలు
  • సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం

దేశ వ్యాప్తంగా ఒకేసారి 14 మంది న్యాయమూర్తుల బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం పచ్చజెండా ఊపింది. ఈ నెల 14 న భేటీ అయిన కొలీజియం న్యాయమూర్తుల బదిలీలపై నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీంకోర్టు ఓ ప్రకటన విడుదల చేసింది. నలుగురు ప్రధాన న్యాయమూర్తులు, అయిదుగురు న్యాయమూర్తులు బదిలీ అయినవారిలో ఉన్నారు. మరో అయిదుగురు సీనియర్ న్యాయమూర్తులు ప్రధాన న్యాయమూర్తులుగా పదోన్నతులు పొందారు. దేశవ్యాప్తంగా 25 హైకోర్టులకు కలిపి 1079 న్యాయమూర్తుల పోస్టులు కేటాయించగా ప్రస్తుతం 665 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల న్యాయమూర్తులకు స్థానచలనం:

ఒకేసారి తెలుగు రాష్ట్రాలలో ప్రధాన న్యాయమూర్తులకు స్థానచలనం కలిగించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జె కె మహేశ్వరి  సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి నియమితులయ్యారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ ఉత్తరాఖండ్ కు బదిలీ కావడంతో తెలంగాణకు ఢిల్లీ హైకోర్టు సీనియర్ మహిళా న్యాయమూర్తి హిమా కోహ్లీ రానున్నారు.

ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మహ్మద్ రఫీక్ మధ్యప్రదేశ్ సీజేగా బదిలీ అయ్యారు. కొత్తగా పదోన్నతిపై పంజాబ్ హర్యానా నుంచి జస్టిస్ ఎస్ మురళీధర్ ఒడిశాకు, కలకత్తా నుంచి జస్టిస్ సంజీవ్ బెనర్జీ మద్రాస్ కు అలహాబాద్ నుంచి జస్టిస్ పంకజ్ మిత్తల్ జమ్ము కశ్మీర్ కు, ఉత్తరాఖండ్ నుంచి జస్టిస్ సుధాంశు ధులియా గౌహతికి ప్రధాన న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జస్టిస్ రాకేష్ కుమార్ ఈ నెల 31తో పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో జోయ్ మల్య బాగ్చీ కలకత్తా హైకోర్టు నుంచి రానున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ న్యాయమూర్తుల సంఖ్య ప్రస్తుతం ఉన్న స్థాయిలోనే కొనసాగనుంది.

ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా నియమితులైన జస్టిస్ గోస్వామి 1961లోజన్మించారు. 1985 లో పట్టభద్రులైన అనంతరం అసోం, నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్, త్రిపుర మిజోరం బార్ కౌన్సిల్ లో పేరు నమోదు చేసుకున్నారు. 2004లో సీనియర్ అడ్వొకేట్ గా ప్రమోషన్ లభించింది. 2011లో జస్టిస్ గోస్వామి హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. 2019లో సిక్కిం హైకోర్టు చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు స్వీకరించారు.

తెలంగాణ హైకోర్టు సీజేగా నియమితురాలైన జస్టిస్ హిమా కోహ్లీ 1959 లో జన్మించారు. ఢిల్లీ హైకోర్టులో జడ్జిగా ఉన్న ఆమెకు ప్రమోషన్ మీద తెలంగాణ హైకోర్టు సీజేగా నియమితులయ్యారు. 1999-2004 మధ్య న్యూఢిల్లీ మున్సిపల్ మున్పిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్ న్యాయ సలహాదారుగా వ్యవహరించారు. 2006 మే 29 న ఢిల్లీ హైకోర్టులో అదనపు జడ్జిగా నియమితులయ్యారు. 2007 ఆగస్టులో పర్మినెంట్ జడ్జిగా నియమితురాలయ్యారు.

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles