- షర్మిల వస్తే గాంధీ భవన్ ఖాళీ?
రాష్ట్ర కాంగ్రెస్ ఆధిపత్య పోరాటం తారాస్థాయికి చేరింది. కేంద్ర పరిశీలకులు మాణిక్కం ఠాకూర్ కూడా చేతులెత్తేసి ఢిల్లీ బాట పట్టే పరిస్థితులు కనబడుతున్నాయి. హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పిసిసి అధ్యక్షులు ఉత్తమ కుమార్ రెడ్డి పదవీ బాధ్యతలను వదులు కుంటానని అనడమే తప్ప ఆయన స్థానంలో కొత్తవారు వచ్చే సూచనలు కనిపించడం లేదు. ఇక భట్టివిక్రమార్క పట్టు వదలకుండా గాంధీ భవన్ లో తన ఆధిపత్యం చలాయిస్తూనే ఉన్నారు. ఇందులో రేవంత్ రెడ్డి తన రాజకీయ అస్తిత్వం కోసం ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ రాష్ట్రంలో పాదయాత్రలకు శ్రీకారం చుట్టారు. ఈ దశలో మూడు ముక్కలాటలో పేపర్ల పబ్లిసిటీ కోసం ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడడం వల్ల అంతర్గత ప్రజాస్వామ్యం రచ్చకెక్కి కాంగ్రెస్ పార్టీ పరువు బజారున పడింది.
బిస్కట్లు తింటాం, తిట్టుకుంటాం:
“మేము ఎవరి మాట వినం. అయినా సమావేశాల్లో టీ బిస్కెట్లు తింటాం. బయటకు రాగానే తిట్టుకుంటాం” అన్న ఒక అగ్రనాయకుడి మాటలు కాంగ్రెస్ పతనావస్థకు తార్కాణం. కేంద్రంలో దిశానిర్దేశం చేసే నాయకత్వం లేదు. తెగిన పతంగిలా కాంగ్రెస్ పార్టీ గాలిలో చక్కర్లు కొడుతోంది. జగిత్యాల జీవనరెడ్డి, నల్లగొండ కోమటి రెడ్డి వెంకట రెడ్డి, సయోధ్య బాటలో పార్టీని చక్కదిద్దే ప్రయత్నాల్లో , వారే పిసిసి రేస్ లో ఉన్నారనే పుకార్లు లేవదీసే కేడర్ తో ఉత్తమ కుమార్ రెడ్డి తన పీఠం జారిపోకుండా తన ఎత్తులు వేస్తూనే ఉంటారు. మరో వైపు భట్టి సీనియర్ లతో గ్రూప్ రాజకీయాలు నడుపుతూనే ఉంటారు.
Also Read: ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
హనుమంతరావు గర్జన :
మధ్యలో వృద్ధ సింహం హనుమంతరావు గర్జనలతో రాష్ట్ర కాంగ్రెస్ లో ప్రకంపనలు వస్తూనే ఉంటాయి. ఈ లోపు సంగారెడ్డి నుండి నేనున్నాను అంటూ తూర్పు జయప్రకాష్ రెడ్డి వాణి వినవస్తుంది. ఈ ముగ్గురు ఎవరి లాబీయింగ్ వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ‘‘ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవికి ధోకా లేదు. భట్టికి గట్టి పట్టు ఉంటుంది. రేవంత్ రెడ్డి వ్యక్తిగత కక్షలు కేసీఆర్ పై పేలుతూనే ఉంటాయి. ఈ దశలో కాంగ్రెస్ లో అస్తిత్వ ప్రకటనలు వస్తూనే ఉంటాయి,’’ అని ఒక కాంగ్రెస్ నిరాశావాది మాటలు. గాంధీభవన్ సందడి తగ్గి చాలా రోజులు అవుతోంది. ‘శుభకార్యం అయ్యాకా ఉండే నిర్మానుష్య పరిస్థితి ఉంది,’ అని ఆవేదనతో చెప్పిన ఒకాయన మాటలు చూస్తే స్మశాన వైరాగ్యం కనిపిస్తుంది తప్ప మళ్ళీ శుభకార్యాలు జరిగే సూచనలు అక్కడ కనిపించడం లేదు.
రెడ్ల ప్రాబల్యం ఎక్కువ :
ముఖ్యంగా కాంగ్రెస్ లో మొదటి నుండి రెడ్ల ప్రాబల్యం ఎక్కువ. పిసిసి పదవీ ఈ సారి బిసిలకు ఇవ్వాలనే నినాదం రావడం చూస్తే వేరే పార్టీ నుండి వచ్చిన రేవంత్ రెడ్డికి పీసీసీ పీఠం దక్కకుండా చేసే ప్రయత్నాలు రెడ్ల నుండే ముమ్మరమయ్యాయి. అటు మధు యాస్కీ, పొన్నం ప్రభాకర్ లాంటి వారు సమీకరణాలు వేగంగా చేస్తున్నారు. ఇదిలా ఉంటే సీనియర్ అయిన గీతారెడ్డి కూడా పిసిసి రేస్ లో ఉండేలా అటు రెడ్డి వర్గం, ఇటు ఎస్సీ వర్గం ఒత్తిడి తెస్తుంది. ఆమె వయసు రీత్యా ఈ టెన్షన్ భరించలేరు.
Also Read: కేసీఆర్ వ్యూహం: తెలంగాణలో షర్మిల?
రేవంత్ పాదయాత్ర :
ఇక ఒక్కప్పుడు వై ఎస్ రాజశేఖర రెడ్డి లా నడిచే ఓపిక రేవంత్ రెడ్డికి ఉంది కాబట్టి, తెలంగాణ పాదయాత్ర కు శ్రీకారం చుట్టి, పోయిన కాంగ్రెస్ ప్రాబల్యాన్ని పునరుద్ధరించాలని మాణిక్కం ఠాకూర్ వేసిన ఎత్తుగడను కాంగ్రెస్ సీనియర్లు చిత్తు చేశారు. రేవంత్ రెడ్డి ఇచ్చే డబ్బుకు ఠాకూర్ లొంగి పోయారని ఆరోపణ చేయడంతో ఇంటి ముందు వరకు వచ్చిన పిసిసి పీఠం రేవంత్ కు దక్కకుండా పోయింది! ఈ గొడవలో ప్రాంతాల పదవీ విభజన మొదలైంది. భట్టి విక్రమార్కకు పిసిసి పీఠం ఇస్తే ఖమ్మం నుండి కాంగ్రెస్ విజయ యాత్ర మొదలవుతుందని అంటున్న వారు భట్టికి పిసిసి పీఠం ఆశ చూపారు. సాగర్ ఉప ఎన్నికల్లో జానారెడ్డి ఉంటారా ఉండరా అన్న మీ మాంస లో ఒక వేళ సాగర్ లో డిపాజిట్ దక్కితే చాలు. జానారెడ్డి గెలుపు అసాధ్యం అన్న మాటలు కాంగ్రెస్ నుంచే వినిపిస్తున్నాయి. జానారెడ్డి గురించి ఈ విధంగా మాట్లాడితే కాంగ్రెస్ అభ్యర్థి మరొరకైతే పరిస్థితి ఎట్లా ఉంటుందో ఊహించుకోవలసిందే. ఉత్తమ కుమార్ రెడ్డి ని పదవి నుండి తొలగిస్తే ఇంకొకరు ఆ పదవిలో ఒక నెల రోజులు కూడా ఉండలేరని అంటున్న వారు కొందరు.
ఉత్తమ్ పై వ్యాఖ్యలు :
నల్లగొండ జిల్లాలో తన భార్యను గెలిపించేస్థితి లో కూడా లేని ఉత్తమ కుమార్ రెడ్డి సాగర్ ఉప ఎన్నికపై తన ప్రభావం చూపడం కల్ల అని నల్గొండ కాంగ్రెస్ నాయకులు బహిరంగంగా అంటున్నారు. సందట్లో సడేమియా అన్నట్టు షర్మిల వైఎస్ ఆర్ కాంగ్రెస్ ను తెరమీదకు తెచ్చారు, ఇంకేం ఇప్పుడు కొండా సురేఖ, మురళి, హైదరాబాద్ కాంగ్రెస్ కేడర్ అంతా షర్మిల వైపు వెళ్లే సూచనలు ఉన్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ కేడర్ అంతా షర్మిల వైపు వెళ్లే సూచనలు ఉన్నాయి. అప్పుడు రేవంత్ ఒంటరి వాడు కావడానికి కాంగ్రెస్ లో నే పావులు కదుపుతున్నారు. చేవెళ్ల నుండి షర్మిల పాదయాత్ర ఉంటే టిఆర్ఎస్ లో కూడా ప్రకంపనలు ఉండవచ్చు. ఇంద్రారెడ్డి కుటుంబాన్ని షర్మిల వైపు తిప్పే ప్రయత్నాలు మొదలయినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే సబితా ఇంద్రారెడ్డి ఈ సమయంలో అడుగు వేయరని ఇంద్రారెడ్డి అభిమానులు అంటున్నారు.
Also Read: ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మంగా మారిన సాగర్ ఉపఎన్నిక
బోసిపోయిన గాంధీ భవన్:
ఇక షర్మిళ దృష్టి ఇపుడు కాంగ్రెస్ పాత కాపులపై ఉంది.బిజెపి నుండి కూడా షర్మిల వైపు వెళ్లే వారు ఉంటారని అంటున్నారు.ఇదిలా ఉంటే షర్మిల వైఎస్ బొమ్మతో తెలంగాణ లో తిరిగితే కాంగ్రెస్ కోటలు బద్దలు అవుతాయని షర్మిల వాక్చాతుర్యం తో గాంధీ భవన్ ఖాళీ అవుతుందని అనేవారు ఉన్నారు. గాంధీ భవన్ ఎదురుగా ఉన్న బీజేపీ ఆఫీసులో సందడి ఉంటే గాంధీ భవన్ బోసిపోయి ఉంది. తిరిగి రాహుల్ గాంధీ వచ్చి తెలంగాణ లో పర్యటిస్తే తప్ప గాంధీ భవన్ కు రంగులు పడతాయని అంటున్న వారు ఉన్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్ మూడు ముక్కలు పదవీ వ్యామోహం వీడి ఏకమయితే తప్ప కాంగ్రెస్ పతాకం రెపరెపలాడదు.