గుంటూరు : అన్నదమ్ముల అనుబంధం గురించి అనేక కథలు విన్నాం. తండ్రి ఆస్తికోసం పరస్పరం ద్వేషించుకున్న అన్నదమ్ములనూ చూశాం. కానీ ఒకే తల్లి కడుపున పుట్టిన అన్నదమ్ములు ఒకరిరి విడిచి మరొకరు జీవించలేని పరిస్థితిని ఇక్కడ చూశాం. అన్న హఠాన్మరణాన్ని తట్టుకోలేక తమ్ముడు కూడా ప్రాణాలు విడిచిన ఘటన ఇక్కడ జరిగింది. ఒకే రోజు ఒకరి తర్వాత ఒకరు గుండెపోటుతో మరణించడంతో ఆ కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది.
గుంటూరులోని పాతిమాపురానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త షేక్ అబ్దుల్ నబీ (40) ఒక బేకరీలో ఉద్యోగి. మంగళవారంనాడు ఆయనకు గుండెపోటు వచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళారు. వైద్యులు పరీక్షించి ఆస్పత్రికి తీసుకొని రాకముందే చనిపోయారని (బ్రాట్ డెడ్) అని నిర్ధారించారు. ఇదంతా గమనిస్తున్న తమ్ముడు షేక్ దస్తగిరి (36) తట్టుకోలేక పోయారు. గుండెనొప్పితో అక్కడికక్కడే కూలిపోయారు. తమ కళ్ళ ఎదుటే మృతుని సోదరుడు సైతం మరణించడం వైద్యులను నిర్ఘాంతపరిచింది. దస్తగిరి పెయింటర్ గా పని చేస్తూ జీవించేవాడు. అన్నదమ్ములు ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో కుటుంబాలను పోషించే పెద్దదిక్కు పోయి దిక్కుతోచని పరిస్థితులలో రెండు కుటుంబాల సభ్యులూ విలపిస్తున్నారు. ఈ దారుణం చూసి పాతిమాపురంలో కంట తడి పెట్టనివారు లేరు.