- పాతికేళ్ళలో ప్రపంచానికి భారత్ ఆరోగ్యకేంద్రం
- జీవనశైలిలోనే అంతా ఉంది
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ ఓ) అధినేత టెడ్రోస్ అథనామ్ మన గుజరాత్ కు వచ్చారు. తన ఉపన్యాస ప్రారంభంలో గుజరాతీలో పలకరించి అందరినీ పలవరింపజేశారు. ప్రధాని నరేంద్రమోదీ చప్పట్లు చరచి, నవ్వులు ఒలికించారు. జామ్ నగర్ లో బుధవారం ‘సంప్రదాయ వైద్య అంతర్జాతీయ కేంద్ర భవనం’ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. మారిషస్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్ కూడా మరో అతిధిగా వచ్చారు. భారతీయుల సమగ్ర జీవన విధానానికి ప్రతిబింబాలైన మన వైద్య విధానాలపై టెడ్రోస్ ప్రశంసలు కురిపించారు.
Also read: కొత్త రాష్ట్రపతిపై ఊహాగానాలు
తృణధాన్యాల పాత్ర అద్వితీయం
ఆయుర్వేదం మొదలు అనేక సంప్రదాయమైన చికిత్సా పద్ధతులు మన దేశాన్ని ఎన్నో ఏళ్ళపాటు ఆరోగ్యంగా నిలిపాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ గుర్తుచేశారు. భారతీయ ప్రాచీన విజ్ఞాన సంపదను పరిరక్షించుకోవడం మన కర్తవ్యమని పలికారు. గుజరాత్ లో ప్రారంభమైన ఈ ఆరోగ్యకేంద్రం ప్రపంచ మానవాళి మొత్తానికి ఉపయోగపడాలన్నది మన ప్రభుత్వం చేసుకున్న సంకల్పం. ఈ ఆశయం సంపూర్ణంగా ఆచరణలో సిద్ధించాలంటే మరో 25 ఏళ్ళు పడుతుందని ప్రధాని మాటలను బట్టి అర్ధం చేసుకోవచ్చు.అనుకున్న ఫలితాలను రాబట్టగలిగితే సంప్రదాయ వైద్యంలో మరో శకం ఆరంభమవుతుందని అంచనా వేయవచ్చు. మన జీవనవిధానంలో తృణధాన్యాల పాత్ర విస్మరించజాలనిది. ప్రధాని మోదీ కూడా ఈ అంశాన్ని స్ఫుటంగా స్పృశించారు. భారతీయ సంప్రదాయ వైద్య విధానాలపై చర్చలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి కానీ, ఆచరణలో ఆమడదూరంలో ఉన్నాం. పరిశోధనలు పడకేశాయి.శిక్షణలు శూన్యం. నిధులు,వనరులు మృగ్యం.ఇటువంటి వాతావరణంలో,ఇప్పుడు ఈ కేంద్రం నిర్మాణానికి పునాదులు పడడం హర్షణీయం.ప్రభుత్వాలు ఇప్పటికైనా మేలుకుంటే మంచిది.జీవనశైలిని (లైఫ్ స్టైల్) మార్చుకుంటే ఆరోగ్యం బాగుంటుందనే మాటలు ఈ మధ్యకాలంలో బాగా వినపడుతున్నాయి. జీవనశైలి అంటే జీవన విధానమే. పొద్దున నిద్రలేచినప్పటి నుంచి మంచం ఎక్కేంత వరకూ పాటించే నియమాల సమాగమమే జీవనవిధానం. శారీరక వ్యాయామం,మానసిక సాధన, ఆహార వ్యవహారాలు, ఆలోచనా సరళి, విశ్రాంతి, నిద్ర సమయాలు… ఇవన్నీ అందులోనే ఉన్నాయి. ఇవన్నీ సక్రమంగా ఉంటే, ఆరోగ్య సమస్యలు పెద్దగా దరి చేరవని ఆధునిక వైద్యులు కూడా చెబుతున్నారు. పూర్వులు చెప్పింది,పాటించింది కూడా అదే. నిద్ర, విశ్రాంతి సమయాలలో మార్పులు రావడంతో పాటు,ఆహార పద్ధతులు పూర్వానికి భిన్నంగా మారిపోయాయి. తృణధాన్యాల ఊసే లేకుండా పోయింది.ఇప్పుడిప్పుడే మళ్ళీ కొందరు ఆ దారిని వెతుక్కుంటున్నారు. 2023 వ సంవత్సరాన్ని ‘తృణధాన్యాల సంవత్సరం’గా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఈ నిర్ణయం వెనకాల భారత ప్రభుత్వ అభ్యర్థన ఉంది. ఈ ప్రాధాన్యతను ఐక్యరాజ్యసమితితో పాటు పలు దేశాలు కూడా గుర్తిస్తున్నాయి. ఇది శుభపరిణామం. సంప్రదాయ వైద్య విధానాలకు పట్టం కడుతూ,తృణధాన్యాల పెంపకాన్ని,వాడకాన్ని పెరిగే విధంగా చూస్తూ ముందుకు సాగడం మన ప్రభుత్వాల ముందున్న తక్షణ కర్తవ్యం.
Also read: కరోనా మళ్ళీ కాటేస్తుందా?
ఆయుష్ వీసాలు
పంచభూతాలను పరిరక్షించుకోకపోతే ఇవ్వేమీ ముందుకు సాగవన్న అంశాన్ని ముందుగా గుర్తించాలి. ఇందులో ప్రభుత్వాలతో పాటు పౌరుల బాధ్యత కూడా జతకలవాల్సి వుంది. తృణధాన్యాల పెంపకంలో అనువైన నేల, ఆరోగ్యకరమైన నీరు, సురక్షితమైన గాలి సమృద్ధిగా ఉండాలి. వీటిని నమ్ముకొని ముందుకు సాగే రైతులకు వ్యవసాయం లాభసాటిగా మారాలి. దోపిడీదారుల నుంచి రైతన్నలకు రక్షణ కల్పించాలి. ఆర్ధికంగా తోడ్పాటు అందించాలి. అట్లే…భారతీయ ప్రాచీన విజ్ఞానాన్ని మళ్ళీ పాదుకొల్పాలంటే, సంప్రదాయ వైద్య విధానాలు మళ్ళీ వేళ్లూనుకోవాలంటే మెడికల్ మాఫీయాను అడ్డుకోవాలి. కనీసం రేపటి తరాల భారత పౌరులు పదికాలాల పాటు పచ్చగా బతకాలంటే మన విద్యావిధానంలోనూ మార్పులు రావాలి. ఆరోగ్యకరమైన జీవన విధానాలకు సంబంధించిన విషయాలను పాఠ్యాంశాలలో చేర్చాలి.వీటన్నిటిపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి.నిత్యం సమీక్షలు జరగాలి. వైద్యవిద్యకు పెద్దఎత్తున నిధులు కేటాయించాలి. అధ్యాపకులు,విద్యార్థుల ఎంపికలో,శిక్షణలో ప్రామాణికతలు పెరగాలి. అడుగడుగునా నాణ్యతకు పెద్దపీట వెయ్యాలి. పరిశోధనలు విస్తృతంగా జరగాలి.ఇవన్నీ జరిగితేనే ఆశయాలు సిద్ధిస్తాయి. ఆయుష్ థెరపీ, సంప్రదాయ వైద్య సేవల నిమిత్తం భారత్ రావాలనుకొనే విదేశీ పౌరుల కోసం త్వరలో ‘ఆయుష్ వీసాలు’ అందిస్తామని మన ప్రధాని ప్రకటించడం కొత్త అధ్యాయం. ఆయుష్ రంగంలో పెట్టుబడులు,ఆవిష్కరణలకు అపరిమితమైన అవకాశాలు ఉన్నాయి. ఔషధాల తయారీ, సౌందర్య సాధనాలకు కూడా ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. ఈ రంగాలకు ఇప్పటికే పెద్ద డిమాండ్ ఉంది.అందరూ కలిసి ఆరోగ్యకరమైన అడుగులు వేస్తే… ‘ఆరోగ్యభారత్’ నిర్మాణం అందని ద్రాక్ష కాదు.
Also read: జీ 7 సదస్సుకు మోదీజీకి ఆహ్వానం ఖాయం