Sunday, December 22, 2024

లక్షద్వీప్ వైపు లక్షలమంది చూపు!

  • ప్రధాని పర్యటనపై మాల్దీవుల మంత్రుల వక్రభాష్యం
  • వెంటనే ముగ్గురు మంత్రులను తొలగించిన మాల్దీవ్ సర్కార్

ప్రధానమంత్రి నరేంద్రమోదీ జనవరి మొదటి వారంలో లక్షద్వీప్ లో పర్యటించారు. కవరత్తిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కొన్ని గంటల పాటు ఆ సముద్ర తీరంలో సేద తీరారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకోవైపు, మాల్దీవుల మంత్రులు లక్షద్వీప్ పరిశుభ్రత గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. వారిపై ఆ ప్రభుత్వం వేటు కూడా వేసింది. వీటన్నిటి ప్రభావంతో నేడు ప్రపంచ పర్యాటకులంతా లక్షద్వీప్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే లక్షలమంది గూగుల్, మేక్ మై ట్రిప్ బాట పట్టారు. ఈ 20 ఏళ్ళలో ఎప్పుడూ లేనంత గరిష్ఠ స్థాయిలో ఆన్ లైన్ అన్వేషణ పెరిగిందని కేంద్ర సమాచార శాఖ విభాగాలు వెల్లడించాయి. తమ వెబ్ సైట్ లో లక్షద్వీప్ కోసం వెతుకుతున్న వారి సంఖ్య అనూహ్య రీతిలో పెరిగిందని  ఆన్ లైన్ ట్రావెల్ సంస్థ మేక్ మై ట్రిప్ కూడా ప్రకటించింది. ప్రధాని మోదీ ఈ ద్వీపంలో గడపడమే కాక సాహసమైన ప్రయాణం కూడా చేశారు. సముద్ర గర్భంలో తిరుగుతూ మిగిలిన జీవరాసుల జీవనాన్ని కూడా దర్శించుకున్నారు. అంత పెద్ద ద్వీపంలో ఇంతటి సాహసం చేయడం మోదీకే చెల్లిందనే ప్రశంసలు, ఇటువంటి సాహసకృత్యాలు ఎందుకనే విమర్శలు రెండూ వెల్లువెత్తాయి. లక్షద్వీప్ లో అద్భుతమైన బీచ్ లు ఉండడమే కాక, భోజనం, ఆహారపదార్ధాలు, ఆతిధ్యం అద్భుతంగా వున్నాయని సాక్షాత్తు దేశ ప్రధాని చెప్పడంతో భారతీయులలో ఈ ద్వీపాలను దర్శించాలనే ఆరాటం పెరిగింది. మిగిలిన దేశాల వారికీ అంతే ఆసక్తి పెరిగింది.

మాల్దీవ్ అధ్యక్షుడితో కరచాలనం చేస్తున్న భారత ప్రధాని

మాల్దీవ్ ప్రభుత్వానికి భయసందేహాలు

మాల్దీవ్ ప్రభుత్వానికి మాత్రం అసూయ, భయం పెరిగాయి. భారత్ లోని బీచ్ లను, ద్వీపాలను అన్వేషించాలనే ఆరాటం ప్రపంచ పర్యాటకులలో మరింత ఎక్కువైంది. ఒక్క సంఘటన ఇంత ప్రభావం చూపిందన్నమాట! లక్షద్వీప్ పై మాల్దీవుల ప్రజలు అక్కసు వెళ్ళ గక్కుతూ, కువిమర్శలు చేస్తున్న వేళ, మాల్దీవులకు బుకింగ్స్ నిలిపివేయాలని నెటిజన్లు మేక్ మై ట్రిప్ వారికి సూచనలు పంపుతున్నారు. ఈ వేడి రగులుతున్న సందర్భంలో దిద్దుబాటు చర్యలకు మాల్దీవ్ ప్రభుత్వం సిద్ధమైంది. భారత్ తో సయోధ్య కోసం అర్రులు జాస్తోంది. మన దేశ సినిమా, క్రీడారంగ ప్రముఖులు సైతం మాల్దీవులకు ప్రత్యామ్నాయంగా భారత ద్వీపాలను దర్శించాలని పిలుపునివ్వడం గమనార్హం! భారత్ లో పర్యాటక రంగం అభివృద్ధి చెందడానికి కేంద్ర ప్రభుత్వం అనేక ప్రణాళికలు చేస్తోంది. ప్రధాని చేసిన లక్షద్వీప్ పర్యటన, ప్రచారం కూడా అందులో భాగమేనని అర్థం చేసుకోవాలి. లక్షద్వీప్ లో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు పెరగాల్సివుంది. పర్యాటక విధానంలో యువతకు ఉద్యోగాల కల్పన కూడా ముఖ్యమైన అంశం. ఇప్పుడు ఇంతగా చర్చకు, శోధనకు కేంద్రంగా మారిన ఈ ద్వీపం గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఇది దేశంలోనే అత్యల్ప సంఖ్యలో జనాభా కలిగిన అతి చిన్న కేంద్ర పాలిత ప్రాంతం. అరేబియా సముద్రంలో కేరళ తీరం నుంచి 200-300 కిలోమీటర్ల దూరంలో ఈ ద్వీపాలు వున్నాయి. ఈ ప్రాంత రాజధాని కవరత్తి నగరం.

ప్రధాని నరేంద్రమోదీపై వక్రభాష్యం చెప్పినందుకు బర్తరఫ్ అయిన మాల్దీవ్ మంత్రులు

పర్యాటక కేంద్రంగా లక్షద్వీపాలు

 లక్షద్వీప్ పేరుతో ఒక జిల్లా కేంద్రం కూడా వుంది. లెక్కల్లోలేని అనేక ద్వీపాలు ఈ సముద్రంలో ఉన్నాయి. అందుకే లక్షద్వీప్ అనే పేరు వచ్చింది. ప్రస్తుతం దొరికే అంకెల ప్రకారం 10 దీవుల్లో మాత్రమే జనాభా వున్నారు. మిగిలిన 17 దీవులలో జనాభా శూన్యం.  సముద్రగర్భంలో మాత్రం అనేక జీవరాసులు వున్నాయి. ఆగట్టిలో ఎయిర్ పోర్ట్ వుంది. కొచ్చిన్ నుంచి ఇక్కడికి విమానాల రాకపోకలు వున్నాయి. ఇక్కడ వున్నదంతా ముస్లిం జనాభానే. కాకపోతే, వీళ్లంతా మలయాళం యాసలో మాట్లాడుతారు. లక్షద్వీప్ గురించిన ప్రస్తావన తమిళ సాహిత్యంలో మొట్టమొదటగా వచ్చినట్లు చెబుతారు. ఒకప్పుడు పల్లవుల ఏలుబడిలో ఈ ప్రాంతం ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. ప్రస్తుతం ఇక్కడ జనాభా మొత్తం కలిసి 70వేలు లోపే. మలయాళం, జెసేరీ ( ద్వీపంలోని స్థానిక భాష ), తమిళం, మలయాళ యాసతో అరబిక్, మహ్ల్ భాషలు ఇక్కడ వాడుకలో ఉన్నాయి. ప్రధానంగా మలయాళం -అరబిక్ సంస్కృతి ఇక్కడ రాజ్యమేలుతోంది. ఈ దీవులు మాల్దీవులలోని చాగోస్ దీవులను పోలివుంటాయి. “మీరు సాహసాలు చెయ్యాలనుకుంటున్నారా? అయితే, లక్షద్వీప్ లో ‘స్మార్కెలింగ్ చేయండి. మీ సాహసాల జాబితాలో దీనిని కూడా చేర్చుకోండి ” అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచిస్తున్నారు. ఇది అద్భుతమైన అనుభవమని కితాబు ఇస్తున్నారు. స్మార్కెలింగ్ అంటే? సముద్రంలో చేసే ఒక తరహా డ్రైవింగ్.స్మార్కెల్ అనే ట్యూబ్, డ్రైవింగ్ మాస్క్ వేసుకొని సముద్రగర్భంలో ఈత కొట్టడం అన్నమాట! దీని ద్వారా సాగర గర్భంలోని జీవరాశులను,పర్యావరణాన్ని తెలుసుకొనవచ్చు. మన ప్రధాని ఆ పని చేశారు. మొత్తంగా చూస్తుంటే, మాల్దీవులు -లక్షద్వీప్ మధ్య భవిష్యత్తులో పెద్ద పోటీ జరుగనుంది. వెరసి  మన పర్యాటకం ఊపందుకోనుంది.

Also read: ఆంధ్రమేవ జయతే!

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles