- వ్యూహాలకు పదును పెడుతున్న ప్రధాన పార్టీలు
- అధికారం కైవసం చేసుకునేందుకు బీజేపీ ప్రణాళికలు
- హ్యాట్రిక్ కొట్టాలని పట్టుదలతో ఉన్న దీదీ
పశ్చిమ బెంగాల్ ల్ పాగా వేసేందుకు బీజేపీ పట్టుదలతో వ్యూహరచన చేస్తోంది. మరోవైపు బీజేపీని అధికారం లోకి రాకుండా చూడడమే లక్ష్యంగా తృణమూల్ కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఈ సారి ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని పట్టుదలతో ఉన్న మమతా బెనర్జీ తన రాజకీయ జీవితంలో గతంలో ఎన్నడూ లేనంత గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ ప్రభంజనాన్ని అడ్డుకోవడానికి మమతా బెనర్జీ వేస్తున్న ఎత్తులు ఎంతవరకు సపలమవుతాయో చూడాలి. ఎన్నికల్లో విజయం సాధించేందుకు చిన్నా చితకా పార్టీల మద్దతును కూడగడుతున్నారు. ఇందులో భాగంగా బీహార్‌లో సత్తా చాటిన ఆర్జేడీ నేత అసెంబ్లీ ఎన్నికల పొత్తుపై దీదీతో భేటీ అయి చర్చలు జరిపారు. తేజస్వి మమతకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
Also Read: దశలవారీ పోలింగ్ దుర్దశ: కొన్ని ప్రశ్నలు
కాంగ్రెస్ వామపక్షాల మధ్య సీట్ల సర్ధుబాటు:
మరోవైపు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకంపై ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. సీట్ల పంపకాలపై గత కొద్దిరోజులుగా జరుగుతున్న చర్చలు ఎట్టకేలకు కొలిక్కి వచ్చాయి. 294 స్థానాలున్న బెంగాల్‌లో కాంగ్రెస్ పార్టీకి 92 స్థానాలలో పోటీచేసేందుకు ఒప్పందం కుదిరినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదురి ప్రకటించారు. మిగిలిన 202 స్థానాల్లో వామపక్ష పార్టీలు బరిలో నిలవనున్నాయి.
తృణమూల్ బీజేపీ మధ్యే ప్రధాన పోటీ:
2016 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ 92 స్థానాల్లోనే పోటీ చేసింది. అయితే, వామపక్ష పార్టీల కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకుంది. 202 స్థానాల్లో పోటీ చేసిన వామపక్షాలు కేవలం 35 స్థానాలకే పరిమితమవ్వగా కాంగ్రెస్ పార్టీ 44 స్థానాల్లో గెలుపొంది బెంగాల్‌లో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఇక కూటమిలో గతంలో 148 స్థానాల్లో పోటీ చేసిన సీపీఎం కేవలం 26 స్థానాలు మాత్రమే గెలిచి మూడో స్థానానికి పరిమితమైంది. అయితే 2016 ఎన్నికల్లో ప్రధాన పోటీదారుగా ఉన్న వామపక్ష-కాంగ్రెస్ కూటమికి ఈసారి ఎన్నికల్లో అంతగా ప్రాముఖ్యత లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో 18 ఎంపీ స్థానాలు గెలిచి టీఎంసీకి ప్రత్యర్థిగా అవతరించిన బీజేపీ అసెంబ్లీ పోరులో మమతా బెనర్జీకి గట్టి సవాల్ విసురుతోంది.