- భారీస్థాయిలో ప్రాణం, ఆస్తి నష్టం
- ఆరు రాష్ట్రాలు విలవిల
- 96 ఏళ్ళ పూర్వమే ఇటువంటి విపత్తు
ప్రకృతికి అగ్రరాజ్యమైనా, పేద దేశమైనా ఒకటే. పూరి పాకైనా, ఆకాశహర్మ్యమైనా సమానమే. దానికి ఆగ్రహం రానంత సేపు అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఉగ్రరూపం ఎత్తితే ఒణికి పోవాల్సిందే, ఉనికి పోగొట్టుకోవాల్సిందే. టోర్నడో రూపంలో అమెరికాలో సంభవిస్తోన్న సుడిగాలుల విలయమే దానికి ఉదాహరణ. ఆరు రాష్ట్రాల్లో టోర్నడోలు విరుచుకు పడుతున్నాయి. వందమైందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వందలమంది గల్లంతయ్యారు. ఇంకెంతమంది ప్రాణాలు కోల్పోయారో తెలియరావడం లేదు.
Also read: గంధర్వులను మించిన ఘంటసాల
భారీగా ప్రాణనష్టం
మీడియా కథనాలు బట్టి ప్రాణ నష్టం భారీగా జరిగినట్లు సమాచారం. ఆస్తి నష్టం కూడా పెద్దఎత్తున జరిగింది. ఈ ప్రకంపనలు ఇంకా అదుపులోకి రాలేదు. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద విపత్తుగా దేశాధ్యక్షుడు జో బైడెన్ అభివర్ణిస్తున్నారు. కెంటకీలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) ప్రకటించారంటే ఆ తీవ్రతను అంచనా వేయవచ్చు. ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులు, గోడౌన్స్ లో బతుకు వ్యవసాయం సాగించే పేదకూలీలు ప్రాణాలు కోల్పోవడం,గల్లంతు కావడం అత్యంత విషాదం.క్రిస్మస్ వేడుకలు మరికొద్ది రోజుల్లో ఉండగానే ఈ భీభత్సం సంభవించడం పెనువిషాదం. ప్యాకింగ్ మొదలైన పనుల్లో తలమునకలై వారందరూ పనిచేస్తున్నారు. అందులో అమేజాన్ వంటి ప్రఖ్యాత సంస్థల సిబ్బంది కూడా ఉన్నారు. 1925 తర్వాత ఇదే అత్యంత విపత్తుగా నమోదైంది. కెంటకీ, ఇల్లినాయిస్, మిస్సౌరి, మిసిసిపీ, ఆర్కాన్సాస్, టెన్నెసీ మొదలైన ప్రాంతాలన్నీ ఈ భీభత్సానికి బలి అయ్యాయి. టోర్నడో నేపథ్యాన్ని గమనిస్తే వాతావరణంలో సంభవిస్తున్న మార్పులతో పాటు మానవ తప్పిదాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ‘నీరు పల్లమెరుగు..’ అన్న నానుడి చందంగా, అల్పపీడనం ఆవరించిన ప్రాంతాల వైపు సుడిగాలులు పయనించి ప్రకంపనలు సృష్టించడం సహజంగా జరిగే ప్రతిచర్య. అది అతిపెద్ద స్థాయిలో జరిగినప్పుడు ఇటువంటి విపత్తులు చోటుచేసుకుంటాయి.
Also read: విశాఖ ఉక్కుపై పునరాలోచన చేయరా?
సమతుల్యం లోపించడం వల్లనే సంక్షోభం
భూమధ్యరేఖకు పైన ఉన్న ప్రాంతాలలో వాతావరణం ఎప్పుడూ అతి తీవ్రంగానే ఉంటుంది. వనాలు, అరణ్యాలు దట్టంగా వుంటే వాతావరణం సమతుల్యంగా ఉంటుంది. అది లోపించడం వల్లే ప్రకృతి ప్రకోపాలు పెట్రేగి పోతున్నాయి. ఇల్లు, కార్యాలయాలు, భవనాల నిర్మాణంలో ఆధునిక సాంకేతికత ప్రవేశించిన క్రమంలో, సౌష్టవం సన్నగిల్లుతోందని నిపుణులు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా పైకప్పుల తీరు ఇదివరకటి వలె దృఢంగా ఉండడం లేదని అంటున్నారు. ఇటువంటి పెను సుడిగాలులు వీచినప్పుడు తట్టుకోవడం కష్టమని చెబుతున్నారు. ఏ సాంకేతికత అందుబాటులో లేనప్పుడు, మానవ నిర్మాణంలో రూపుదాల్చుకున్న దేవాలయాలు, రాజభవనాలు ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని వందల ఏళ్ళ నుంచి చెక్కుచెదరకుండా నిలబడ్డాయి. ఆధునిక నిర్మాణాల బతుకు అతి తక్కువకాలంలోనే తెల్లారుతోంది. ఇటువంటి వాతావరణం కేవలం అమెరికాకే పరిమితం కాదు, భారత్ మొదలు చాలా ప్రపంచ దేశాల పరిస్థితి ఇదే రీతిలో ఉంది.ఎంత ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలైనా,ఎంతటి నిపుణులైనా, అనుభవజ్నులైనా ప్రకృతిలో వచ్చే మార్పులను కొంత వరకు మాత్రమే అంచనా వేయగలరు. ‘వాన రాకడ, ప్రాణం పోకడ ఎవ్వరికీ తెలియదు’ అన్నట్లుగా, ప్రకృతి వైపరీత్యాలను సంపూర్ణంగా అంచనా వేసే మేధ, అడ్డుకోగలిగిన శక్తి మానవాళికి లేదు. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ,సహజ వనరులను విధ్వంసం చేయకుండా కాపాడుతూ, ప్రకృతిని గౌరవిస్తూ ముందుకు సాగడమే మనం చేయగలిగింది.
Also read: భారత్, రష్యాల చారిత్రక సంబంధాలు