కారా మేష్టారు
తెలుగు కథా శిఖరం కూలిపోయింది. సాహిత్య ప్రపంచంలోనే తొలిసారి కథకు గూడుకట్టిన కథాకిరీటి శ్వాస ఆగింది. తెలుగు కథ కోసం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యావద్దేశం నాలుగు చెరుగులా పరుగులిడిన కథాపథికుడి సాహసయాత్ర ముగిసింది. కారామేష్టారు అని పిలవబడే కాళీపట్నం రామారావు జీవితయాత్ర ఆగిపోయింది. కళింగాంధ్రకే కాదు తెలుగు కథా సాహిత్యానికి దీపధారి (టార్చ్ బేరర్)గా నిలిచిన కాళీపట్నం రామారావు తన తొంభై ఏడో ఏట మరణించారు.
జీవన వ్యావృత్తి
శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం మురపాక గ్రామంలో 1924 నవంబర్ 9న జన్మించిన కాళీపట్నం రామారావు లెక్కలు మాష్టారుగా కళింగాంధ్ర జిల్లాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయునిగా పనిచేశారు. కళింగాంధ్ర సాహిత్యం పట్ల మమకారంతో కొకు, శ్రీశ్రీ, రావి శాస్త్రి ప్రభావంతో కథలు రాయడం మొదలుపెట్టారే గాని, రాద్దామన్న ఆత్రం తక్కువ, కథను నిలబెట్టుకుందామన్న ప్రయత్నం ఎక్కువ కావడంవల్ల పిడికెడు కథలు మాత్రమే రాయగలిగారు. 1943లో తొలికథ “ప్లాటుఫారమో’ చిత్రగుప్తలో ప్రచురణ కావడంతో తెలుగు సాహిత్యలోకానికి పరిచయమైనప్పటికీ, ఆయన వరుసగా రాసిన కథలు ఆనందవాణి, చిత్రాంగి, ఆంధ్రపత్రిక, భారతిలాంటి విలువైన పత్రికలలో ప్రచురితమైనప్పటికీ ఆయన చదువుతున్న సాహిత్యానికి రాస్తున్న సాహిత్యానికి ఎక్కడో తేడా కొడుతోందన్న అసంతృప్తితో 1955 నుంచి దాదాపు ఎనిమిదేళ్లు కథలు రాయకుండా పూర్తిగా చదవడంలోనే మునిగిపోయారు.
తరువాత 1964లో కారామేష్టారు “తీర్పు” కథతో మళ్లీ కథ రాయడం ఆరంభించేరు. 1966లో రాసిన “యజ్ఞం” కథ సృష్టించిన దుమారం, సాహిత్యలోకంలో జరిగిన చర్చరచ్చలు మరే తెలుగు కథ విషయంలోనూ జరగలేదంటే అతిశయోక్తి కాదు. అప్పుడప్పుడే విరసం మొగ్గ తొడుగుతున్న దశలో ఒక మామూలు కథకు అంత హైప్ నివ్వడం ద్వారా ఆ సంస్థ మనుగడకు కూడా కొంత దోహదం చేసిందన్న విమర్శ ఉన్నప్పటికీ ఇప్పటికీ ఆ కథమీద చర్చ జరుగుతుండడం కూడా మనం గమనించాలి. 1968 నుంచి 1972 వరకు కాళీపట్నం రామారావు తన కెరియర్ బెస్ట్ కథలు రాసిన కాలంగా చెప్పుకోవచ్చు.
1974లో యజ్ఞం కథకు కేంద్ర సాహిత్య అకాడెమీ వరించింది. కాని అప్పటికి ఆయనకున్న విప్లవ ఆదర్శాల మేరకు ఆ అవార్డును తిరస్కరించారు.
దాదాపుగా ఇదే సమయం నుంచి కథకులను తయారుచేసే పనిలో పడ్డారు. తెలుగు నేలంతా తిరిగి, ఎక్కడ మంచి కథకుడున్నా వెన్నుతట్టి ప్రోత్సహించి, తెలుగు కథను సంపద్వంతం చేసే పనిలో పడ్డారు. అందులో భాగంగా ఆంధ్రభూమి తదితర పత్రికలలో వర్ధమాన కథకుల టాలెంట్ సెర్చ్ గా “నేటి కథ” శీర్షికను నిర్వహించడం, ఆర్ కె పబ్లికేషన్స్ ద్వారా కొన్ని కథల పుస్తకాలు ప్రచురించడం వంటి ప్రయత్నాలు చేశారు. అనేక కథా సంపుటాలకు ముందుమాటలు రాశారు. తన సాహిత్య జీవితానికి పరమ ప్రయోజనం కలిగించాలన్న సదుద్దేశంతో ఒక బృహత్ ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. అదే కథానిలయం ఆలోచన. తెలుగు కథ పుట్టినప్పటి నుంచి అచ్చయిన ప్రతి కథను ఒక చోటకి చేర్చాలని ఆయన ఒక పద్ధతి ప్రకారం చేసిన కృషి గొప్ప ఫలితాలను ఇచ్చింది. ఈ కలను సాకారం చేసుకోవడానికి అంతవరకు డబ్బులు, విరాళాలు, చందాలు పోగుచేయడానికి ఇచ్చగించని కారామేష్టారు జోలె పట్టుకున్నారు. వచ్చిన అవార్డునల్లా స్వీకరించారు. ఏ రూపంలోనైనా కథకు లభించిన ఆర్థిక సాయాన్ని అందుకుని కథానిలయానికి వెచ్చించారు. జ్ఞానపీఠం రాకపోతే పోయిందని జనపీఠ అవార్డును నెలకొల్పి కారాభిమానులంతా ఈ ప్రయోగానికి నిధులు అందించాలని ఇచ్చిన పిలుపునకు అనూహ్యమైన స్పందన లభించింది. దాదాపు కొన్ని లక్షల రూపాయలు సమకూరాయి. దాంతో కథానిలయం ట్రస్టును ఏర్పాటుచేసి రెండంతస్తుల భవన నిర్మాణం, పుస్తకాలు సర్దడానికి ఆలవరాలు, వివరాలు రాసిపెట్టడానికి కంప్యూటర్లు, వలంటీర్లు మొదలైన ఏర్పాట్లు చకచకా జరిగాయి. అలా 1997లో కథానిలయం ఏర్పాటైంది. బాపు కన్ను బొమ్మను లోగోగా చిత్రీకరించి ఇచ్చారు. ప్రతి ఏటా ఫిబ్రవరి మూడో ఆదివారం నాడు జరిగే కథానిలయం వార్షికోత్సవం సాహిత్య అభిమానులకు పండుగగా మలచడంలో కారా మేష్టారి కృషి ఎంతో ఉంది. 2006లో తన చివరి కథ “అన్నెమ్మ నాయురాలు” ప్రచురించారు. 2021 జూన్ 4వ తేదీ తుది శ్వాస విడిచేవరకు కథ కోసం తపన పడిన కథా కృషీవలుడు కారా మేష్టారు.
కారా మేష్టారి సాహిత్యం
తాను దాదాపు దశాబ్ద కాలం కథలు ఎందుకు రాయకుండా నిశ్శబ్దం పాటించారని అడిగినప్పుడు, “ఎంతటి పరి శీల నాశక్తి కలవారైనా, ఒక స్థిరమైన ప్రాపంచిక దృక్పథం లేని వారెవ్వరూ గొప్ప రచనలు చేయలేరు. గొప్ప రచయితలు ఎరిగిన వ్యక్తుల మీదా, జరిగిన సంఘటనలు తీసుకొని కథలు రాయరు. వాస్తవ జీవితం నుండి వారివారి ప్రాపంచిక దృక్పథం మేరకు జీవిత వాస్తవాలు గ్రహిస్తారు. వాటిని వ్యక్తం చేసేందుకు అవసరమైన సంఘటనల్నీ, పాత్రల్నీ, సన్నివేశాలను కల్పిస్తారు. అంతా కల్పనే అయినా వారి చిత్రణలో ఆ కల్పన జీవితమంత సహజంగా కనపడుతుంది” అనీ, తన కథల్లో ఇది కనిపించక రాయడం ఆపేసారని చెప్పారు. “అందరికీ అన్నవస్త్రాలు అమర్చేవారూ, ఎందరికెన్ని అమర్చినా తమకు తాము ఒక్కటీ అమర్చుకోలేని వారూ, తమ బలమెక్కడో తమని పట్టి పల్లారుస్తున్న శక్తులేవో చెప్పినా గుర్తించలేనివారూ, గుర్తించినా దినదినగండంగా సాగిస్తున్న జీవన పోరాటం మధ్య ఇంకే పోరాటానికి శక్తిని గాని, వ్యవధి గాని సమీకరించుకోలేని వారూ, నూటికి ఎనభై మంది జనం. వీళ్ల తరతరాల అసహాయ స్థితి మీదకీ, పరాధీనపు బతుకుల మీదకీ దృష్టి మళ్లించే రాతలు – లేవనను – చాలా తక్కువ” అన్న ఉద్దేశంలో మలిదశ కథలు రాశారు.
చదవగా చదవగా నాకూ రాయాలని బుద్ధి పుట్టిందని చెప్పిన కారా కేవలం సాహిత్యాన్నే కాక జీవిత లోతుపాతుల్ని నిశితంగా పరిశీలించారు. మరోవైపు గ్రామీణ జీవితంలోని వైరుధ్యభరితమైన వర్గ సంబంధాలను గురించి విచక్షణాయుత దృష్టితో పరిశీలించడం అలవాటు చేసుకున్నారు. అలా మధ్యతరగతి ప్రపంచంతో పాటు – రావిశాస్త్రి శిష్యరికంతో అధోజగత్తు సహోదరుల జీవితాలను ఔపోసన పట్టగలిగారు. తృణమూలాల్లోని ఆర్థిక సంబంధాలు మానవ జీవితాలను శాసిస్తాయన్న శాస్త్రీయ తాత్విక దృక్పధాన్ని ఆకళించుకున్న కాళీపట్నం మనిషి దుష్టత్వం సమాజ ప్రగతికి అవరోధమనే భ్రమను తొలగించి, సామాజిక వ్యవ దుష్టమైందని తన కథల్లో నిరూపించారు.
నేనెరిగిన కారా
నా పద్దెనిమిదేళ్ల ప్రాయంలో శ్రీకాకుళం టౌన్‌హాలులో ఒక కథాకార్యశాలలో తొలిసారి కారాను కలిసాను. “రచయితలమని మనకెలా తెలుస్తుంది సార్?” అని నేనడిగిన ప్రశ్నకు “నువ్వెప్పుడైనా ఎవరికైనా కార్డు రాశావా, అయితే నువ్వు రచయితవే” అంటూ మా మాటల పరిచయం మొదలైంది. తరువాత నాకోసం పుస్తకాలు భద్రంగా దాచి, ఫోన్ చేసి నాకిచ్చేంత చనువు పెరిగింది. దాదాపు మూడేళ్లు కథానిలయం వార్షికోత్సవంపై ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో నివేదికలు చదివి వినిపించాను. ఒక రెండుసార్లు హైదరాబాద్ సుల్తాన్‌బజారు సందుల్లో దొరికే కారాకిళ్లీ తెచ్చాను. కథానిలయం రికార్డులు కొన్ని రాసిన గుర్తు కూడా. లోకల్ జెకెసి న్యూస్ ఛానెల్ లో టీవీ ప్రెజెంటర్ గా ‘చేయూత కార్యక్రమంలో లైవ్ లో ప్రేక్షకులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి కారా మేష్టారిని అతిథిగా పిలుద్దామని నేను ప్రతిపాదించినప్పుడు మురపాక గ్రామానికి చెందిన మా ఎండీ జల్లేపల్లి శ్రీధర్ గారు ఆనందంగా ఒప్పుకున్నారే గాని, సాహిత్యరంగ ప్రతినిధులను పిలిచినప్పుడు పెద్దగా ప్రేక్షకులకు పట్టదేమోనని సందేహించారు. ఆ అరగంట కార్యక్రమం కాస్తా విరామం లేకుండా వచ్చే ఫోన్లతో గంటన్నరకు సాగినప్పుడు ఎండీగారితో పాటు నేను కూడా ఆశ్చర్యపోయాను. కారాకున్న ప్రజాభిమానం మెండని తెలిసిన సంగతది. మేష్టారి భార్య సీతగారు మరణించినప్పుడు మేష్టారు చిగురుటాకులా వణికిపోవడంతో కారాభిమానులం అంతా కలవర పడ్డాం. చలసాని ప్రసాద్ గారు చనిపోయినప్పుడు పెద్ద వయసులో ఇలాంటివి విని భరించడం చాలా కష్టం అన్నారు. అక్షరాల నుడికట్లు వంటి పజిల్స్ నిరంతరం చేస్తుండే వారు, జ్ఞాపకశక్తి మెరుగుపడడానికని బోసినోటితో నవ్వేవారు. పుల్లెల శ్రీరామచంద్రుడి గారి గ్రంథాల సేకరణ మాత్రమే కాదు, అవి దొరికినప్పుడు కూడా చిన్నపిల్లాడిలా సంబరపడిపోవడం కళ్ల ముందు కదలాడుతోంది.
మేష్టారికి దాసరి రామచంద్రరావుగారంటే చాలా అభిమానం. ఎందుకంటే కథానిలయానికి దాసరి అంత ప్రాముఖ్యత నిచ్చేవారు. అయితే రచయితల విషయానికొస్తే కళింగాంధ్ర కథకుల్లో బమ్మిడి జగదీశ్వరరావు (బజరా) అంటే మేష్టారికి చెప్పలేనంత ప్రేమ. తరువాతే ఎవరైనా అన్నట్టు తాదాత్మ్యతతో మాట్లాడేవారు. బజరా బిడియాన్ని విసుక్కునేవారు. వారివారి బిజీ జీవితాలను వదిలిపెట్టి కథానిలయం కోసం ఏడాదిలో కొన్ని నెలలపాటు ఇక్కడికి వఛ్చి కృషి చేసే కవనశర్మగారన్నా, వివినమూర్తి గారన్నా మేష్టారికి ఎంత గౌరవం అంటే మాటల్లో చెప్పలేను. వారి దగ్గర నుంచి చూసి మనం నేర్చుకోవలసింది చాలా ఉందని పదేపదే అనేవారు. కారా మేష్టారి అబ్బాయి కేసరి పేరుతో కథలు రాస్తారు. కేసరి కథలు అని ఒక పుస్తకం వేశారు. వాటికి కొంత ప్రచారం కల్పించమని నాకు చెప్పారు. నేనాపని చేయలేకపోయాను. ఎందరివో పుస్తకాలు పిలిచి నాకు అందించారు. ప్రతి పుస్తకం గురించి గొప్పగా చెప్పేవారు. నాకిచ్చిన కందుకూరి వీరేశలింగం జీవిత చరిత్ర ఇచ్చి ఆది చదువుతానో లేదోనన్న బెంగతో ఒక ఎక్సర్ సైజ్ చేయించారు. సిక్కోలు బుక్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తానన్న ఆలోచనకు ఊతమివ్వడమే కాకుండా, పుస్తకాల ప్రచురణలో అన్నిటికంటే ముఖ్యమైనది మార్కెటింగ్ అంటూ సాధారణంగా రచయితలకు తెలియని అనేక విషయాలు ప్రస్తావించారు.
మేష్టారు లేని లోటు తెలుగు సాహిత్య ప్రపంచంలో ఎవ్వరూ పూడ్చలేనిది. కథ తనకు దీగూడును అందించిన అభయహస్తాన్ని కోల్పోయింది. కళింగాంధ్ర సాహిత్యం దిక్కులేనిదయిపోయింది. ఇవే సాహిత్య అభిమానుల జీవితాల్లో వృధాభరిత క్షణాలు.
A nice review of the life of a well known writer. It would be better if he reviews his literary works too.