చెన్నై : సినిమా పాటల, మాటల రచయిత వెన్నెలకంటి మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో చెన్నైలో గుండెపోటు కారణంగా మరణించారు. 63 ఏళ్ళ వన్నెలకంటి తన నివాసంలోని ఆఖరి శ్వాస పీల్చారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు శశాంక వెన్నెకలకంటి కూడా సినీగీతాలు రాస్తున్నారు. రెండవ కుమారుడు రాకేందుమౌళి వెన్నెలకంటి కూడా సినిమారంగంలోనే రచయితగా కుదురుకుంటున్నారు.
‘శ్రీరామచంద్రుడు’తో శ్రీకారం
మూడు దశాబ్దాలకు పైగా విస్తరించిన ఆయన సినీగీతరచన జీవనంలో మూడువేల సినిమా పాటలు రాశారు. 1957లో నెల్లూరులో జన్మించి చైన్నైలో స్థిరబడిన వెన్నెలకంటి మూడు వందల సినిమాలకు మాటలు రాశారు. పదకొండు సంవత్సరాల వయస్సులోనే పద్యాలు రాయడం ప్రారంభించిన వెన్నెలకంటి తొలుత ఆధ్యాత్మికం వైపు మొగ్గుచూపారు. హరికథల పట్ల ఆసక్తి చూపించారు. ‘శ్రీరామచంద్రుడు’ సినిమాతో గీతరచన ప్రారంభించి ఆదిత్య 369, ఘరానా బుల్లోడు, సమరసింహారెడ్డి, క్రిమినల్, టక్కరి దొంగ మొదలైన సినిమాలకు పాటలు రాశారు. వెన్నెలకంటి పాటలు రాసిన చివరి సినిమా కీర్తిసురేశ్ నటించిన ‘పెంగ్విన్’. ఆయన పూర్తి పేరు వెన్నెలకంటి రాజేశ్వరప్రసాద్. వెన్నెలకంటిగానే ప్రసిద్ధుడు.
డబ్బింగ్ సినిమాల ఫేమ్
డబ్బింగ్ సినిమాలకు డైలాగ్ లూ, పాటలూ రాయడంలో వెన్నెలకంటి సిద్ధహస్తుడు. కమల్ హాసన్ నటించిన చాలా సినిమాలకు ఆయన మాటలు రాశారు. 2020 అనే కరోనా నామసంవత్సరంలో అనేక దిగ్గజాలవంటి సినీప్రముఖులు తనువు చాలించారు. ఆ దుర్మార్గమైన వత్సరం ముగిసిపోయింది కదా అని తేలికగా ఊపిరి తీసుకునే సమయంలో వెన్నెలకంటి వంటి అద్భుతమైన ప్రతిభాశాలిని తెలుగు సినీపరిశ్రమ కోల్పోయింది. నిరుడు మరణించిన తెలుగు ప్రముఖులలో అందరికంటే ముందు చెప్పుకోవలసిన వ్యక్తి ఎస్ .పి. బాలసుబ్రహ్మణ్యం. వెన్నెలకంటిని సినీపరిశ్రమలో ప్రోత్సహించింది బాలూనే. ఆ తర్వాత జయప్రకాశరెడ్డి, రావికొండలరావు, కోలభాస్కర్, నరసింగ్ యాదవ్ ఇతరులు మరణించారు.
వెంకయ్యనాయుడు సంతాపం
వెన్నెలకంటి గొప్ప సినీగేయ రచయిత మాత్రమే కాకుండా సుప్రసిద్ధ సాహితీవేత్త కూడా అంటూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపసందేశంలో అన్నారు. ‘శ్రీరంగనాధుని దివ్యరూపమే చూడవే…’ అనే పాట వెన్నెలకంటి రాసిన పాటలలో తనకు అత్యంత ఇష్టమైనదని వెంకయ్యనాయుడు అన్నారు. 34 ఏళ్ళలో 1500లకు పైగా స్వతహాగా తెలుగుచిత్రాలకు పాటలు రాసిన వెన్నెలకంటే మరో 1500 గీతాలు డబ్బింగ్ సినిమాలకు రాసి ఉంటారు. సినిమారంగానికి రాకముందు ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పని చేసేవారు. ఎంఎస్ విశ్వనాథం, ఇలయరాజా, విద్యాసాగర్, కీరవాణి, మాధవపెద్ది సురేష్, మణిశర్మ వంటి శిఖరసదృశులైన సంగీత దర్శకులతో కలసి వెన్నెలకంటి పని చేశారు.
మాటరాని మౌనమిది…
‘మహర్షి’లో వెన్నెలకంటి రాసిన ‘మాటరాని మౌనమిది…’ తెలుగు ప్రేక్షకులను ఊర్రూతలూపింది. ఆ సినిమా దర్శకుడు వంశీ ఈ పాటను ప్రత్యేకమైన బాణిలో రాయించుకున్నారు. ఆదిత్యలో ‘రాసలీల వేళ…’ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ‘ముద్దుల మామయ్య’ సినిమాలో ‘మామయ్య అను పిలుపు…’ అనే పాటకూడా ప్రేక్షకాదరణ పొందింది. పంచతంత్రం, దశావతారం వంటి డబ్బింగ్ సినిమాలకు మాటలూ, పాటలూ రాయడం ద్వారా ఆయన ఎక్కువ పేరు సంపాదించారు.