- నువ్వానేనా అంటున్న బరోడా, తమిళనాడు
- ముస్తాక్ అలీ టీ-20 టోర్నీ ఫైనల్
దేశవాళీ టీ-20 టోర్నీ విజేతలకు ఇచ్చే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్‌కు మాజీ చాంపియన్ తమిళనాడు, బరోడా అర్హత సాధించాయి. సూపర్ సండే టైటిల్ సమరానికి సై అంటే సై అంటున్నాయి. అహ్మదాబాద్ మోతేరా స్టేడియం వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్‌లో తమిళనాడు 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ ను చిత్తు చేసింది. రెండో సెమీపైనల్లో బరోడా 25 పరుగుల తేడాతో పంజాబ్‌ను అధిగమించింది.
అరుణ్ కార్తీక్, దినేశ్ కార్తీక్ బ్యాటింగ్ షో
తొలి సెమీస్ సమరంలో ముందుగా టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 154 పరుగులు చేసింది. కెప్టెన్ అశోక్ మనేరియా 51, అర్జిత్ గుప్తా 45 పరుగుల స్కోర్లతో రాణించారు. తమిళనాడు బౌలర్లలో మహమ్మద్ 24 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 155 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన తమిళనాడు..ప్రారంభఓవర్లలోనే మొదటి ముగ్గురు టాపార్డర్ ఆటగాళ్ల వికెట్లు కోల్పోయినా.. అరుణ్ కార్తీక్ స్ట్ర్రోక్ ఫుల్ బ్యాటింగ్ తో గమ్యాన్ని చేరుకోగలిగింది.
అరుణ్ కేవలం 54 బంతుల్లోనే 9 ఫోర్లు,3 సిక్స్‌లతో సహా 89 పరుగుల స్కోరుతో నాటౌట్‌గా నిలిచాడు. కెప్టెన్ దినేశ్ కార్తీక్ 17 బంతుల్లో 29 పరుగులు సాధించడంతో మరో 8 బంతులు ఉండగానే తమిళనాడు విజేతగా నిలిచింది. ముస్తాక్ అలీ టోర్నీ ఫైనల్స్ చేరడం తమిళనాడుకు ఇది వరుసగా రెండోసారి.
Also Read : 2020-21 రంజీ సీజన్ హుష్ కాకి
బరోడా బ్యాంగ్, బ్యాంగ్….
ఆ తర్వాత జరిగిన రెండో సెమీస్‌లో బరోడా ఆల్‌రౌండ్ పవర్ తో చెలరేగిపోయింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన బరోడా… కెప్టెన్ కేదార్ దేవ్‌ధర్ 64 పరుగులు, కార్తీక్ కాకడే 53 పరుగులతో అర్ధశతకాలు నమోదు చేశారు. దీంతో బరోడా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 160 పరుగులు చేసింది. సమాధానంగా 161 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన పంజాబ్ 8 వికెట్లకు 135 పరుగులే చేయగలిగింది. కెప్టెన్ మన్‌దీప్ సింగ్ 42 నాటౌట్, గుర్‌కీరత్ సింగ్ 39 పరుగులు మినహా మిగిలిన ఆటగాళ్లంతా విఫలమయ్యారు. బరోడా బౌలర్లలో లుక్మన్ 3 వికెట్లు, నినాద్ రత్వా 2 వికెట్లు పడగొట్టారు.
ఆదివారం జరిగే టైటిల్ సమరంలో డిఫెండింగ్ చాంపియన్ తమిళనాడు కు బరోడా గట్టిపోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read : భారత అంపైర్లకు భలే చాన్స్