* నువ్వానేనా అంటున్న భారత్, ఇంగ్లండ్
* ఉరకలేస్తున్న విరాట్ సేన, ఆత్మవిశ్వాసంతో మోర్గాన్ ఆర్మీ
టీ-20 ఫార్మాట్లో ప్రపంచ మేటిజట్లు ఇంగ్లండ్, భారత్ ల పాంచ్ పటాకా సిరీస్ క్లయ్ మాక్స్ దశకు చేరింది. సిరీస్ లోని మొదటి నాలుగుమ్యాచ్ ల్లో రెండుజట్లు చెరో రెండుమ్యాచ్ లు నెగ్గి 2-2తో సమఉజ్జీలుగా నిలవడంతో…ఈ రోజు రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఆఖరాట కాస్త టైటిల్ సమరంలా మారింది.
అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగే ఈ ఆఖరిపోరాటంలో నెగ్గినజట్టే సిరీస్ విజేతగా నిలువగలుగుతుంది. దీంతో రెండుజట్లూ విజయమే లక్ష్యంగా పోరుకు సిద్ధమయ్యాయి.
Also Read : సమఉజ్జీల సమరంలో ఆఖరాట
తుదిజట్లలో మార్పులు అవసరమా?
ప్రస్తుత సిరీస్ మొదటి నాలుగుమ్యాచ్ ల్లో మూడింట ఇంగ్లండ్ ఒకేజట్టును కొనసాగిస్తే…భారత్ మాత్రం మ్యాచ్ మ్యాచ్ కూ మార్పులు చేర్పులతో నెట్టుకొంటూ వచ్చింది. భారత్ వేదికగా మరో ఏడుమాసాలలో జరుగనున్న టీ-20 ప్రపంచకప్ కు సన్నాహకంగానే ఈ రెండు టాప్ ర్యాంక్ జట్లు ప్రస్తుత సిరీస్ ను ఉపయోగించుకొంటున్నాయి. మహ్మద్ షమీ, బుమ్రా, రవీంద్ర జడేజా, నటరాజన్, కుల్దీప్ యాదవ్ లాంటి కీలక ఆటగాళ్లు వివిధ రకాల కారణాలతో సిరీస్ కు దూరం కాగా…మరో 19 మంది ఆటగాళ్ల నుంచే భారత్ తుదిజట్లను ఎంపిక చేస్తూ వస్తోంది.
ఐపీఎల్ విజేత ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రాహుల్ చహార్ తుదిజట్టుకు ఆడగలిగారు.
Also Read : భారత వన్డేజట్టులో సూర్య, నటరాజన్
సూర్యకుమార్ వైపే అందరి చూపు
నెగ్గితీరాల్సిన నాలుగో టీ-20లో భారత్ సఫలం కావడంలో ప్రధానపాత్ర వహించిన మిడిలార్డర్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్..ఈ రోజు జరిగే ఆఖరిపోరాటంలో కూడా కీలకం కానున్నాడు.
వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, కెప్టెన్ విరాట్ కొహ్లీ, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్థిక్ పాండ్యాలతో కూడిన భారత బ్యాటింగ్ ఆర్డర్ అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. ఈ ఆరుగురిలో ఏ నలుగురు తమ స్థాయికి తగ్గట్టుగా ఆడినా ఇంగ్లండ్ కు గట్టిపోటీ తప్పదు. అయితే…ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ల జోడీ మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్ లను ఎంత సమర్థవంతంగా ఎదుర్కొనగలరన్నది…పిచ్ స్వభావాన్నిబట్టి ఆధారపడి ఉంది. పిచ్ లో ఏమాత్రం పేస్, బౌన్స్ ఉన్నా…ఇంగ్లండ్ పేసర్లు దానిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొనే అవకాశం ఉంది.
Also Read : నాలుగో టీ-20లో సూర్యప్రతాపం
ఓపెనర్ల పైనే ఇంగ్లండ్ భారం
భారత్ తో పోల్చిచూస్తే ఇంగ్లండ్ ఓపెనింగ్ జోడీనే అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. జేసన్ రాయ్, జోస్ బట్లర్ ఇద్దరూ ప్రత్యర్థి బౌలర్ల పై విరుచుకు పడుతూ మ్యాచ్ స్వరూపాన్ని కొద్ది బంతుల తేడాలోనే మార్చివేయడంలో తమకుతామే సాటిగా నిలిచే మొనగాళ్లుగా గుర్తింపు తెచ్చుకొన్నారు. ఇంగ్లండ్ వన్ డౌన్ ఆటగాడు, ప్రపంచ నంబర్ వన్ డేవిడ్ మలాన్ మాత్రం స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోతున్నాడు. ఈరోజు జరిగే కీలక ఆఖరిపోరాటంలో మలాన్ నుంచి ఇంగ్లండ్ టీమ్ మేనేజ్ మెంట్ భారీస్కోరును ఆశిస్తోంది.
Also Read : ప్రో-బాక్సింగ్ లో సింగ్ ఈజ్ కింగ్
హార్డ్ హిట్టర్లు బెయిర్ స్టో, బెన్ స్టోక్స్,కెప్టెన్ మోర్గాన్ సైతం బ్యాటుతో ఆటను మలుపుతిప్పడంలో దిట్టలే. ఆఖరి ఓవర్ ఆఖరు బంతివరకూ సాగిన నాలుగో టీ-20లో కేవలం 8 పరుగుల తేడాతో ఓడిన ఇంగ్లండ్..ఆఖరాటలో నెగ్గితీరాలన్న పట్టుదలతో ఉంది.
టాస్ నెగ్గినా… లేని గెలుపు గ్యారెంటీ
ప్రస్తుత సిరీస్ లోని మొదటి మూడుమ్యాచ్ ల్లో టాస్ నెగ్గి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకొన్న జట్లనే విజయం వరించింది. అయితే…నాలుగోమ్యాచ్ లో టాస్ నెగ్గినా ఇంగ్లండ్ కు పరాజయం తప్పలేదు.
సిరీస్ విజేతను నిర్ణయించే ఆఖరిమ్యాచ్ కు స్టేడియం క్యూరేటర్ ఎలాంటి పిచ్ ను సిద్ధం చేస్తారన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఫాస్ట్ వికెట్ ను ఇంగ్లండ్ ఆశిస్తుంటే…భారత్ మాత్రం స్లో పిచ్ ఉండాలనే కోరుకొంటోంది. బ్యాటింగ్ కు, బౌలింగ్ కు అనువుగా ఉండే స్పోర్టివ్ పిచ్ ను సిద్ధం చేస్తే మాత్రం…180 నుంచి 200 వరకూ స్కోరు నమోదైనా ఆశ్చర్యం లేదు.
Also Read : లెజెండ్స్ సిరీస్ ఫైనల్లో భారత్
సిరీస్ లోని మొదటి నాలుగుమ్యాచ్ ల్లో ఫలితాలు ఒక ఎత్తుకాగా…ఈ రోజు జరిగే ఆఖరిమ్యాచ్ లో ఆటతీరు మరో ఎత్తుకానుంది. పొరపాట్లు చేయకుండా అందివచ్చిన అవకాశాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొన్న జట్టే విజేతగా నిలువగలుగుతుంది.
ఆతిథ్య భారతజట్టు రెట్టించిన ఆత్మవిశ్వాసంతో పోటీకి దిగుతుంటే…ఇంగ్లండ్ ప్రపంచ నంబర్ వన్ జట్టు ధీమాతో సమరానికి సై అంటోంది.
అయితే…ఈ టైటిల్ పోరు ఆఖరి బంతి వరకూ నువ్వానేనా అన్నట్లుగా సాగుతుందా? లేక వార్ వన్ సైడే అన్నట్లుగా ముగిసిపోతుందా ?…తెలుసుకోవాలంటే కొద్దిగంటలపాటు సస్పెన్స్ భరించక తప్పదు.
Also Read : ఆల్-ఇంగ్లండ్ క్వార్టర్స్ లో సింధు