- ఫైనల్లో ఒసాకాతో బ్రాడీ ఢీ
- టైటిల్ నెగ్గితే 21 కోట్ల ప్రైజ్ మనీ
ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ సమరానికి కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. ఆస్ట్ర్రేలియా వాణిజ్య రాజధాని మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న ఈటోర్నీ తొలి సెమీ ఫైనల్లో అమెరికన్ బ్లాక్ థండర్, 39 ఏళ్ల సెరెనా విలియమ్స్ ను జపాన్ ప్లేయర్, మాజీ చాంపియన్ నవోమీ ఒసాకా వరుససెట్లలో ఓడించింది. 2019 లో ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గిన 23 ఏళ్ల ఒసాకా మరోసారి ఫైనల్లో హాట్ ఫేవరెట్ గా పాల్గోనుంది. గత 20 మ్యాచ్ ల్లో ఓటమి అంటే ఏమిటో ఎరుగని 3వసీడ్ ఒసాకా మరోసారి ఆస్ట్ర్రేలియన్ క్వీన్ గా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
మరో సెమీఫైనల్లో అమెరికన్ సంచలనం , 22వ సీడ్ జెన్నీఫర్ బ్రాడీ గట్టిపోటీ ఎదుర్కొని మూడుసెట్ల పోరులో కారోలినా ముచోవాను అధిగమించింది. తన కెరియర్ లో తొలిసారిగా ఓ గ్రాండ్ స్లామ్ ఫైనల్స్ చేరడం ఇదే మొదటిసారి. 25 ఏళ్ల బ్రాడీ నుంచి ఫైనల్లో తనకు గట్టిపోటీ ఎదురుకావచ్చని ఒసాకా చెప్పింది.
టైటిల్ సమరంలో నెగ్గిన విజేతకు 21 కోట్ల రూపాయలు, రన్నరప్ గా నిలిచిన ప్లేయర్ కు16 కోట్లరూపాయలు ప్రైజ్ మనీ దక్కనుంది. ఆస్ట్ర్రేలియా ఓపెన్ ఆరంభానికి ముందే మెల్బోర్న్ చేరుకొన్న వివిధ దేశాల క్రీడాకారులు 14 రోజుల క్వారెంటెన్ అనంతరం నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగిటివ్ గా తేలిన తర్వాతే పోటీలలో పాల్గొనటానికి అనుమతించడం విశేషం. క్వారెంటెయిన్ కాలంలో 14 రోజులపాటు హోటెల్ గదికే పరిమితం కావడాన్ని మించిన శిక్ష మరొకటి లేదని స్పానిష్ టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నడాల్ తో సహా పలువురు ప్రముఖ ప్లేయర్లు వాపోయిన సంగతి సంచలనంగా మారింది.
Also Read: ఆస్ట్ర్రేలియన్ ఓపెన్లో జోకో జోరు