- ప్రచారంలో ముందున్న టీడీపీ, వైసీపీ
- అభ్యర్థిని ఖరారు చేయని బీజేపీ
- జీఎస్టీని ప్రచారాంశంగా మార్చిన వైసీపీ
తిరుపతి ఉపఎన్నికలొ పార్టీల హడావుడి పెరిగిపోయింది. ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు సమాయత్తమవుతున్నారు. అధికార వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తి ఎన్నికల బరిలో దిగుతుండగా, టీడీపీ నుంచి పనబాక లక్ష్మి ఎన్నికల్లో పోటీచేయనున్నారు. ఇక బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. వైసీపీ, టీడీపీలు ఉపఎన్నికల బరిలో దూకుడుగా వ్యవహరిస్తుండగా బీజేపీ, జనసేనలు అభ్యర్థిని ప్రకటించకపోవడంపై ఇరు పార్టీల శ్రేణులు అయోమయానికి గురవుతున్నాయి.
బీజేపీకి ఇరుకునపెడుతున్న వైసీపీ:
ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార వైసీపీ బీజేపీని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. తిరుమల శ్రీవారి సేవలను జీఎస్టీ పరిథిలోకి తీసుకొచ్చిన అంశాన్ని తెరమీదకు తెచ్చింది. శ్రీవారి సేవలపై జీఎస్టీని విధించడం సరికాదని దీంతో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని వైసీపీ ఆరోపిస్తోంది. దీన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తోంది. తిరుపతి ఉపఎన్నికల ప్రచారంలో ఇది బీజేపీకి ప్రతికూలాంశంగా మారిందని రాజకీయ విశ్లేషలకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: తిరుపతి, నాగార్జున సాగర్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల
కోట్ల రూపాయలు జీఎస్టీ చెల్లిస్తున్న టీటీడీ:
టీటీడీ ప్రతి సంవత్సరం సుమారు 120 కోట్ల మేర జీఎస్టీని కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తోంది. శ్రీవారి దర్శనార్థం వచ్చిన భక్తులు ఉండే కాటేజీల అద్దెతో పాటు భక్తులకు కల్పించే సౌకర్యాలను కేంద్రప్రభుత్వం జీఎస్టీ పరిథిలోకి తీసుకొచ్చింది. స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చినప్పటికీ ప్రసాదం తయారీకి ఉపయోగించే అన్ని రకాల ముడి పదార్ధాలకు జీఎస్టీ చెల్లించే టీటీడీ కొనుగోలు చేస్తోంది. టీటీడీ పరిథిలోని అన్ని సేవలకు జీఎస్టీ వర్తిస్తోంది. వాటిని మినహాయింపు ఇవ్వాలని రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. టీటీడీ చెల్లిస్తున్న జీఎస్టీకి ప్రతిగా కేవలం తొమ్మిది కోట్ల రూపాయలను మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇన్ పుట్ సబ్సిడీని దేవస్థానానికి చెల్లిస్తోందని విజయసాయిరెడ్డి తెలిపారు. ప్రైవేటు హోటళ్ల తరహాలో భక్తుల సౌకర్యార్థం నిర్మించిన కాటేజీలకు కూడా జీఎస్టీ విధించడం సరికాదని వైసీపీ విమర్శిస్తోంది. ఇదే విషయాన్ని ఉపఎన్నికలో విస్తృతంగా ప్రచారం చేయాలని వైసీపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ప్రతిదాడి చేస్తున్న బీజేపీ:
అసలే అభ్యర్థి ఎంపికలో తలమునలైన బీజేపీకి జీఎస్టీ వ్యవహారం తలనొప్పిగా మారింది. జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటినుండి నోరుమెదపని వారు ఉపఎన్నికలో ప్రచారాంశంగా చేయడంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. రాజకీయ లబ్ధికోసమే కొత్తగా జీఎస్టీ అంశాన్ని తెరపైకి తెచ్చారని విమర్శిస్తోంది. శ్రీవారి భక్తుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇన్నాళ్లూ ఏం చేశారని ఎదురుదాడి చేస్తోంది.
Also Read: బీజేపీ, జనసేన మధ్య విభేదాలు ?